ఒకప్పుడు.. నోరు తెరిచి నెర్రలు వారిన నేలలు.. ఎండిన బావులు, చెరువులు.. అసంపూర్తి ప్రాజెక్టులు, పిచ్చిమొక్కలు, తుమ్మలు, ముళ్లపొదలు మొలిచిన కాలువలు.. పని దొరుకక వలస వెళ్లిన పల్లెలు దర్శనమిచ్చేవి. ఎటు చూసినా కరువు తాండవించేది.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడం, విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ సీఎం కావడం కలిసొచ్చింది. కరువుతీరా వానలు కురవడం, ఎటు చూసినా జలాల గలగలలు వినిపించడం, కనుచూపు మేర పచ్చదనం కొట్టొచ్చినట్టు కనిపించడం, కుప్పలు కుప్పలుగా ధాన్యపురాశులు దర్శనమివ్వడం తెలంగాణకు వరంలా మారాయి. ఒకప్పుడు యేడాదిలో సగం రోజులు పని దొరక్క పస్తులున్నోళ్లకు.. ఇప్పుడు యేడాది పొడువునా పని దొరుకుతున్నది. ఒక్కమాటలో చెప్పాలంటే ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారింది. నాడు దండగన్న వ్యవసాయం నేడు పండుగైంది. కేసీఆర్ పథకాల అమలుతో రైతన్నలు సుఖసంతోషాలతో, ఆనందంగా సాగు పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ)
మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఏ పని చేసేటోళ్లను పలకరించినా.. పని దొరకడం లేదు అనే మాటే వినిపిస్తలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరంతో నాడు బీడు భూములు కూడా నేడు సాగులోకి వచ్చాయి. ఒకప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 లక్షల ఎకరాలు సాగులో ఉంటే వ్యవసాయ శాఖ తాజా గణాంకాల ప్రకారం 17.71 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. స్వపరిపాలనలో ఆదిలాబాద్ పచ్చబడిందని చెప్పేందుకు ఈ గణాంకాలు నిదర్శనంగా నిలస్తున్నాయి. గడిచిన ఎనిమిదేళ్ల పాలనలో వర్షాలకు కొదవ లేదు. ఉమ్మడి జిల్లాలోని కడెం, గడ్డెన, స్వర్ణ, సత్నాల, మత్తడి, కుమ్రం భీం ఆసిపాబాద్ ప్రాజెక్టులతోపాటు కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులన్నీ నిండు కుండల్లా మారాయి. ఒకప్పుడు ఈ ప్రాంతాల్లో పాయగా మారిన గోదావరి నది నేడు జీవనదిగా మారింది. చుట్టూ పక్కల వేలాది ఎకరాలకు సాగునీటికి నిలయమైంది. భూగర్భ జలాలు పెరిగాయి. చెరువులన్నీ నిండిపోయాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఎనిమిదేండ్లలో తెలంగాణ సుభీక్షంగా మారింది. నాడు దండగన్న వ్యవసాయం నేడు పండుగైంది. రైతులతోపాటు వ్యవసాయం ఆధారిత పనులు చేసే కూలీలు, ట్రాక్టర్లు, హార్వెస్టర్, లారీలు, ట్రాలీలు నడుపుకునే వారు, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఏడాది పొడవునా పని దొరుకుతున్నది. ఒకప్పుడు ఏడాదికి రెండు సార్లు సీజన్ మాత్రమే పనులకు వెళ్లి.. సంవత్సరంలో సగం రోజులు పని దొరక్క పస్తులున్నోళ్లకు ఇప్పుడు ఏడాది పొడువునా పని దొరుకుతున్నది.
మిషన్ కాకతీయతో అదనంగా లక్ష ఎకరాలు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో మిషన్ కాకతీయ ద్వారా 1,388 చెరువులకు పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టడంతో ఆయా చెరువుల కింద బీడుగా ఉన్న భూములు సాగులోకి వచ్చాయి. చెరువులను పునరుద్ధరించుకోవడం, కొత్త చెరువులను తవ్వడం వల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,07,480 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడుతల్లో రూ.371 కోట్లు ఖర్చు చేసింది. కాగా.. నిర్మల్ జిల్లాలో రూ.41 కోట్లతో 410 చెరువులను బాగు చేయగా, ఆయా చెరువుల కింద అదనంగా 7,480 ఆయకట్టు పెరిగింది. అలాగే భూగర్భ జలాలు 2 మీటర్ల మేర పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు విడుతల్లో 219 చెరువులకు మరమ్మతులు చేపట్టారు. ఇందుకోసం రూ.152 కోట్లు ఖర్చు చేశారు. కాగా వీటిలో కొ న్ని కొత్త చెరువులు కూడా ఉన్నాయి. ఆయా చెరువుల కింద సుమారు 40వేల ఎకరాలు సాగవుతున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో మిషన్ కాకతీయ కింద రూ.96 కోట్లతో 389 చెరువులను ఆధునీకరించారు. దీంతో ఆయా చెరువుల కింద పడావుగా ఉన్న 35వేల ఎకరాలు సాగుబడిలోకి వచ్చాయి. అలాగే మంచిర్యాల జిల్లాలో రూ.82కోట్లతో 370 చెరువులను పునరుద్ధరించారు. దీంతో ఆయా చెరువుల కింద అదనంగా 25 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. కేసీఆర్ పాలనలో పనికి రంది లేకుండా బతుకున్న వివిధ వర్గాలను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది.
రంది లేకుంట రెండు పంటలేసుకుంటున్నం
చెన్నూర్, సెప్టెంబర్ 23 : తెలంగాణ రాకముందు ఎవుసం చేసేందుకు అరిగోస పడ్డం. తెలంగాణ వచ్చినంక మిషన్ కాకతీయ పథకం కింద చెరువులను మంచిగ చేయడంతో పుష్కలంగా నీళ్లుంటున్నయి. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు గోదావరి నదిపై బ్యారేజీలు నిర్మించిన్రు. గోదావరి, ప్రాణహిత వల్ల భూగర్భ జలాలు మస్తు పెరిగినయ్. నాడు ఒక్క పంట పండుడే కష్టంగా ఉండే. ఇప్పుడు రెండు పంటలకు ఢోకా లేకుంటైంది. సీఎం కేసీఆర్ సార్ ఎవుసాన్ని పండుగలెక్క చేసిండు. 24 గంటలు ఉచితంగా నీళ్లిస్తున్నడు. రైతుబంధు ఇస్తున్నడు. అన్ని సౌలతులు కల్పించడంతో రంది లేకుండా ఎవుసం చేసుకుంటున్నం. నేను ఈ యేడాది కూడా మిర్చి పంట వేసిన. ఏడాదంతా కూలీలు, రైతులకు చేతినిండా పని దొరుకుతుందంటే కేసీఆర్ పుణ్యమే.
– మారిశెట్టి పోశన్న, జనగామ, కోటపల్లి మండలం
తెలంగాణ వచ్చాకే..
భైంసాటౌన్, సెప్టెంబర్, 23 : తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల మరమ్మతులు, పూడికతీత పనులు చేయించారు. కొత్తగా చెక్ కూడా నిర్మించారు. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగినయి. బోర్లు వేస్తే కావాల్సినన్ని నీళ్లు పడుతున్నయి. సర్కారోళ్లు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నరు. రైతు బంధు కూడా ఇస్తున్నరు. ఇట్లా అన్ని సౌలతులు కల్పించడంతో ఎవుసం చేసేటోళ్లు పెరిగిన్రు. చదువుకున్న పిల్లలు కూడా ఎవుసం చేసేందుకు ముందుకు వస్తున్నరు. రెండు పంటలు మంచిగ పండుతున్నయి. నేను వ్యాన్ నడుపుత. రికాం లేకుండా పని దొరుకుతుంది. భైంసా మార్కెట్ పత్తి, సోయా, మక్క తరలిస్తున్న. ఏడాదంతా గిరాకీలు ఉంటున్నయి. తెలంగాణ వచ్చిన తర్వాతనే మా బతులకు మారినయి.
– దగ్డే శ్రావణ్, వ్యాన్ డ్రైవర్, సిద్ధార్థనగర్
హార్వెస్టర్ కొన్న..
ఖానాపూర్, సెప్టెంబర్ 23 : నాడు ఎటు చూసినా ఎండి పోయిన చెరువులు, బీడు భూములే కనిపిస్తుండే. నీళ్లు.. కరెంట్ లేక ఎవుసమంటేనే భయమేసేది. కానీ తెలంగాణ వచ్చినంక మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు మంచిగ చేసిన్రు. పుష్కలంగా నీళ్లుంటున్నయి. రెండు పంటలకు ఢోకా లేకుంటైంది. నేను 12 ఎకరాల్లో వరి వేసిన. బ్యాంకు నుంచి లోన్ తీసుకొని హార్వెస్టర్ కొనుక్కున్న. మస్తు గిరాకీ ఉంటుంది. వరితో పాటు సోయా, జనుము, మక్క కోతలకు పంపిస్తున్న. ఏడాది పొడువునా బిజీగా ఉంటున్న. వరి కోస్తే ఒక గంటకు రూ. 2000 నుంచి రూ. 2200 వరకు తీసుకుంటున్న. నాడు ఎవుసం లేక ఇతర ప్రాంతాలకు పోయి కూలీ పనులు చేసినోళ్లు మస్తు మంది ఉన్నరు. ఇప్పుడు ఉన్న ఊళ్లనే చేతినిండా పని దొరుకుతుంది. ఎవ్వరూ రికాం ఉండడం లేదు. సీఎం కేసీఆర్ వల్లే ఈ రోజు రైతులు రాజుల్లాగా బతుకుతున్నరు.
– పడిగెల మల్లారెడ్డి, హార్వేస్టర్ యాజమాని, తర్లపాడు
అడ్వాన్ ఇచ్చి మరీ డ్రైవర్లుగా పెట్టుకుంటున్నరు
చెన్నూర్, సెప్టెంబర్ 23 : నాపేరు గుజేటి గణేశ్. నాది మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కొమ్మెర గ్రామం. నేను ట్రాక్టర్ డ్రైవర్ పదేళ్ల నుంచి పనిచేస్తున్న. తెలంగాణ రాకముందు ట్రాక్టర్ సరిగా గిరాకీ ఉండేది కాదు. ఒక్క వానకాలం పంటలప్పుడు రికాం ఉండేది కాదు. ఆ తర్వాత మళ్లా ఖాళీగా ఉండేటోళ్లం. బయట పనులకు కూడా పోయేటోళ్లం. తెలంగాణ వచ్చినంక మిషన్ కాకతీయ కింద చెరువులను మంచిగ చేసిన్రు. చెరువుల్లో పుష్కలంగా నీళ్లుంటున్నయ్. అందుకే రెండు పంటలు వేస్తున్నరు. మా ఊరిలో పత్తి, వరి ఎక్కువ సాగు చేస్తుంటరు. మొదట పత్తి దుక్కులు దున్నుతం. ఆ తర్వాత వరి పొలాలను నాటుకు దున్నుతం. ఇంతేగాకుండా మందు బస్తాలు తీసుకరావడం. ధాన్యాన్ని మార్కెట్ తరలించడంవంటి పనులు చేస్తం. ట్రాక్టర్ల్ ఫుల్ గిరాకీ ఉంటుంది. కూలీలకు చేతినిండా పని దొరుకుతుంది. ఇది వరకు డ్రైవర్ చేస్తామని యజమానుల చుట్టూ తిరిగేటోళ్లం. ఇప్పుడు యజమానులే మా దగ్గరికి వచ్చి బతిమిలాడుతున్నరు. ముందే అడ్వాన్ ఇచ్చి మరీ డ్రైవర్లుగా పెట్టుకుంటున్నరు.
– గుజేటి గణేశ్, ట్రాక్టర్ డ్రైవర్, కొమ్మెర