ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్13 : వేతనాలు ఇవ్వాలని జిల్లా కేంద్రంలోని సామాజిక దవాఖానలో పనిచేస్తున్న పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బందితో పాటు సూపర్వైజర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక సామాజిక దవాఖాన ఎదుట మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు దివాకర్ గౌడ్ మాట్లాడుతూ ఏజెన్సీ కాంట్రాక్టర్లు కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రతినెలా 5వ తేదీలోగా జీతాలు అందేలా చూడాలని, ఏడు నెలల పెండింగ్ జీతాలను వెంటనే విడుదల చేయాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికులు మల్లేశ్, మురళీ, సత్తార్, మమత పాల్గొన్నారు.