మంచిర్యాల, అక్టోబర్ 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అధికారంలోకి వస్తే మద్దతు ధరకు కొనుగోలు చేయడంతో పాటు సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. రబీ సీజన్(2024-25)లో వడ్లు అమ్మగా, ఎప్పుడెప్పుడు డబ్బులిస్తారోనంటూ రైతాంగం ఆశగా ఎదురు చూస్తూ వచ్చింది. ప్రస్తుతం ఖరీఫ్(వానకాలం) సీజన్ కొనుగోళ్లకు సిద్ధమవుతుండగా, సర్కారు స్పందించకపోవడంపై మండిపడుతున్నది.
మద్దతు ధర పైసలైతే పడ్డాయ్.. కానీ బోనస్ ఊసే లేదు
మంచిర్యాల జిల్లాలో రబీ సీజన్లో 34,004 మంది రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో 1,97,590 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విక్రయించారు. వీరిలో 1041 మంది రైతులు 6,925 మెట్రిక్ టన్నుల సన్నధాన్యం పండించి కొనుగోలు కేంద్రాల్లో అమ్మారు. నిర్మల్ జిల్లాలో రబీ సీజన్లో 42,032 మంది రైతులు 1,80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విక్రయించగా, 4,483 మంది రైతులు 25వేల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం అమ్మారు. ఇక ఆసిఫాబాద్ జిల్లాలో 2,611 మంది రైతులు 11,390 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్మగా, 1290 మంది రైతులు 5800 మెట్రిక్ టన్నుల సన్నధాన్యాన్ని విక్రయించారు.
దొడ్డు ధాన్యం విక్రయించిన రైతులతో పాటే సన్నధాన్యం విక్రయించిన రైతులకు మద్దతుధర పైసలు ఖాతాల్లో పడ్డాయి. కానీ, సన్నధాన్యం రైతులకు క్వింటాపై ఇస్తామన్న రూ.500 అదనపు బోనస్ మాత్రం ఖాతాల్లో జమకాలేదు. మంచిర్యాల జిల్లాలో రూ.3.46 కోట్లు, నిర్మల్ జిల్లాలో రూ.12.81 కోట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో రూ.2.9 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 6,814 మంది రైతులకు రూ.19.17 కోట్లు సర్కార్ బాకీ పడింది. రబీ సీజన్ ముగిసి ఐదు నెలలు కావస్తున్నా ఇప్పటి దాకా బోనస్ ఊసే లేకపోవడంపై రైతన్నలు పెదవి విరుస్తున్నారు.
కాంగ్రెస్ అంటేనే మండిపడుతున్న రైతులు..
కాంగ్రెస్ సర్కారు వచ్చాక రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని రైతులు మం డిపడుతున్నారు. ఏ గ్రామంలోనూ 100 శాతం రుణమాఫీ కాలేదు. రైతుబంధు కొందిరికి ఇచ్చి, కొందరికి ఇవ్వలేదు. యూరియా సరఫరా చేయలేక చేతులత్తేసింది. దీంతో సెంటర్ల ముందు గంటల తరబడి క్యూలైన్లు, కొట్లాట చేయాల్సి వచ్చింది. రోజుల తరబడి తిరిగినా ఒక్క బస్తా యూరియా దొరకడమే గగనమైపోయింది. చివరకు అమ్ముకున్న ధాన్యానికి ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వలేకపోతున్నదంటూ రైతులు మండిపడుతున్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి ఘోరంగా మోసపోయామని, మార్పు కోరుకుంటే అన్నదాతల నోట్లో మట్టికొట్టారంటూ వాపోతున్నారు. బోనస్ కోసం ఐదు నెలులుగా ఎదురు చూస్తున్నామంటున్నారు. ఇప్పుడు వానకాలం కోతలు మొదలవుతున్నా పాత సీజన్ డబ్బులు ఇవ్వకపోవడం ఈ సర్కారుకే చెల్లితుందంటున్నారు. కేసీఆర్ సర్కారులో హాయిగా ఉన్న రైతుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందంటున్నారు. నాడు ధాన్యం అమ్మిన వారం రోజుల్లోగా డబ్బులు పడితే.. నేడు నెలలు గడుస్తున్నా బోనస్ పట్టించుకునే నాథుడే కరువయ్యాడని వాపోతున్నారు.
బోనస్ ఇస్తదో.. ఇవ్వదో కూడా తెల్వదు
దహెగాం, అక్టోబర్ 27 : సర్కారోళ్లు సన్నవడ్లకు బోనస్ ఇస్తామంటే నాకున్న నాలుగెకరాల్లో వరి సాగు చేసిన. 104 క్వింటాళ్లు (101 జైశ్రీ రాం) అమ్మిన. అప్పుడే ప్రైవేట్ వాళ్లు క్వింటాలుకు రూ. 2600 ఇస్తామన్నరు. బోనస్‌కు ఆశపడి ఇవ్వలేదు. గీ సర్కారు నమ్ముకొని నష్టపోయినం. ఇగ గా డబ్బులు వస్తయో.. రావో కూడా తెల్వదు.
-గోండె అంజన్న, గిరివెల్లి, ఆసిఫాబాద్
రూ.37 వేల బోనస్ రాలే
గత యాసంగి సీజన్లో నాకున్న ఆరు ఎకరాల్లో మూడున్నర ఎకరాల్లో వరి సాగు చేసిన. 75 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. సిద్ధాపూర్ శివారులోని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో వడ్లు అమ్మిన. మద్దతు ధర పైసలైతే పడ్డయి కానీ.. క్వింటాల్‌కు రూ.500 చొప్పున ఇస్తామన్న బోనస్ రాలేదు. ఇప్పటికే ఐదు నెలలు అయిపోయింది. వానకాలం పంట సైతం చేతికి వస్తుంది. కానీ, యాసంగిలో అమ్మిన సన్నవడ్ల బోనస్ ఇప్పటి దాకా ఇవ్వకపాయె. సాగునీటికి తిప్పలైనా బోనస్ వస్తుందన్న ఆశతో కష్టపడి సన్న వడ్లు పండించిన. కానీ గీ సర్కారోళ్ల పుణ్యమాని రూపాయి రాకపాయె. కాంగ్రెస్ సర్కారు వచ్చిన సంది మాకు కష్టాలు మొదలైనయి.
– అశోక్, నిర్మల్
