నిర్మల్, జూలై 3(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు కార్యక్రమం ఆయా కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. దశాబ్దాలుగా దారిద్య్రంలో మగ్గుతున్న కుటుంబాలకు వెలుగురేఖగా నిలుస్తున్నది. నిన్నటి దాకా ఉపాధి లేక ఉసూరుమన్న యువతకు ఈ పథకం దళిత కుటుంబాల అభ్యున్నతికి నాంది అవుతున్నది. ముఖ్యం గా ఎస్సీల్లో వెనుకబడిన వారికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో వారంతా వ్యాపారవేత్తలుగా ఎదిగి, స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ పథకం బాటలు వేస్తున్నది. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10లక్షల సాయం అందిస్తున్నది.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత భారీ మొత్తంలో ఓ పథకానికి నేరుగా నగదు బదిలీ చేయడం లేదు. 100శాతం రాయితీతో ఎలాంటి కండీషన్లు, లబ్ధిదారుడి వాటా లేకుండా అమలవుతున్న ఏకైక పథకంగా దళితబంధు చరిత్రకెక్కింది. ఆరు నూరైనా దళితబంధు పథకాన్ని అమలు చేసి చూపిస్తామని సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం ఈ పథకాన్ని హుజూరాబాద్‌లో ప్రయోగాత్మకంగా మొదలు పెట్టి.. ఆ తర్వాత రాష్ట్రం నలుమూలలకు తీసుకెళ్లారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి వంద చొప్పున యూనిట్ల పంపిణీ పూర్తి కాగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి దళితబంధు పథకాన్ని వర్తింపజేసే పనిలో రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇందుకు సంబంధించిన జీవో విడుదల కాగా, రెండో విడుత దళితబంధు పథకాన్ని త్వరలోనే అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
రెండో విడుతలో 2750 యూనిట్లు..
నిర్మల్ జిల్లాలో తొలి విడుతలో దళితబంధు పథకాన్ని 261మందికి వర్తింపజేశారు. 2021-22లో నియోజకవర్గానికి 100యూనిట్ల చొప్పున ముథోల్‌లో 100, నిర్మల్‌లో 100, ఖానాపూర్ నియోజకవర్గంలో 61మందికి మొత్తం 261యూనిట్లు మంజూరయ్యాయి. ఖానాపూర్ నియోజకవర్గంలో మొత్తం 8మండలాలు ఉండగా, నిర్మల్ జిల్లా పరిధిలో 4మండలాలు ఉన్నాయి. దీంతో ఆయా మండలాల పరిధిలోని దళిత కుటుంబాలకు 61యూనిట్లను మంజూరయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే మరో నాలుగు మండలాలకు చెందిన దళిత కుటుంబాలకు 39 యూనిట్లు మంజూరు చేశారు. తాజాగా రెండో విడుతలో వేలాది మంది కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ఈసారి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 1100 యూనిట్లు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు.
జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో 2750 మందికి దళితబంధు ద్వారా ప్రయోజనం చేకూరనున్నది. నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలకు 1100 చొప్పున, ఖానాపూర్ నియోజకవర్గానికి 550 యూనిట్లు మంజూరు కానున్నాయి. ఇందుకోసం రూ. 275 కోట్లు మంజూరు చేయనున్నారు. దళిత జాతిలో పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడేందుకు ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నది. ఆయా కుటుంబాలకు ఆశాదీపంగా మారిన సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని దళిత సమాజం ఆనందం వ్యక్తం చేస్తున్నది. కలెక్టర్ల స్వీయ పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ఈ పథకం అమలు కానున్నది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఇప్పటికే నియోజకవర్గాల వారీగా స్పెషల్ ఆఫీసర్లను సైతం నియమించారు. నిర్మల్ నియోజకవర్గానికి డీఎల్పీవో రమేశ్, ముథోల్ నియోజకవర్గానికి డీఆర్డీఓ విజయలక్ష్మి, ఖానాపూర్ నియోజకవర్గానికి డీటీడీవో అంబాజీని నియమించారు. వీరు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.
ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల సాయం
దళితబంధు పథకంలో ఒక్కో యూనిట్ కింద లబ్ధిదారుడికి ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రూ.10 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వమే అందిస్తుండడం దేశంలో మరెక్కడా లేదు. దళిత కుటుంబాలు సమాజంలో సగౌరవంగా బతకాలన్న లక్ష్యంతో మూడేళ్ల క్రితం దళితబంధు పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. మొదటి విడుతలో నియోజకవర్గానికి 100 యూనిట్లను విజయవంతంగా అందజేసిన ప్రభుత్వం. తాజాగా రెండో విడుతలో నియోజకవర్గానికి 1100 చొప్పున దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నది. ఒర్క కుటుంబానికి రూ.10లక్షల సాయం అందనున్నది. ఈ సాయంతో వారు కోరుకున్న వ్యాపారాన్ని ప్రారంభించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులు తమ వంతుగా సహాయ సహకారాలను అందిస్తారు. రెండో విడుతలో వేలాది మంది దళిత కుటుంబాల్లో గణనీయమైన మార్పు సంభవించనున్నది.అంబేడ్కర్ ఆశయాల సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ చేస్తున్న ఈ ప్రయత్నాలపై అనేక వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నది.
రెండో విడుత ప్రక్రియ ప్రారంభం..
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దళితబంధు రెండో విడుత ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించాం. నియోజకవర్గాల పర్యవేక్షణకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. ఈ సారి ఒక్కో నియోజకవర్గానికి 1100 యూనిట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు సంబంధించి గైడ్‌లైన్స్ రావాల్సి ఉంది. మార్గదర్శకాలు రాగానే అర్హులకు దళితబంధు యూనిట్లను మంజూరు చేస్తాం.
– హన్మాండ్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, నిర్మల్ జిల్లా