కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ సిర్పూర్-టీ, జూన్ 21 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం ఇటిక్యల్పాడ్కు చెందిన ఆదివాసులు ఐదు దశాబ్దాలుగా పోడు భూములను సాగు చేసుకుంటుండగా, అటవీ అధికారుల తీరుతో అభద్రత వెంటాడుతున్నది. ఇప్పటికే కొన్ని భూములు లాగేసుకోగా, మిగతా రైతులను నిత్యం వేధింపులకు గురి చేయడం ఆందోళన కలిగిస్తున్నది.
సిర్పూర్(టీ) మండలం ఇటిక్యల్పాడ్కు చెందిన సుమారు 100 కుటుంబాలకు చెందిన రైతులు గ్రామ శివారులోని 1500 ఎకరాలు సాగుచేసుకుంటున్నారు. ఇప్పటికే గతంలో దాదాపు 250 హెక్టార్ల భూములను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం 600 నుంచి 700 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలో రైతులు సాగుచేస్తున్న భూములు అడవికి చెందినవని, వీటిని అటవీ శాఖకు తిరిగి ఇవ్వాలని అధికారులు కొద్ది నెలలుగా సంప్రదింపుల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారు. అధికారుల వేధింపులపై స్థానిక ఎమ్మెల్యేను కలిసినా ప్రయోజనం లేకపోవడంతో ఇక చేసేదేమిలేక కాంగ్రెస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి రావి శ్రీనివాస్, రైతులు శుక్రవారం తెల్లవారు జామున సీఎంను కలిసేందుకు హైదరాబాద్కు వెళ్లారు.
ఒకవేళ అటవీ అధికారులు తమ భూములను స్వాధీనం చేసుకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని, పెంచికల్పేట్ మండలం కొండపల్లికి చెందిన పోడురైతుల తరహాలో తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరించారు. కాగా, పోడు భూముల సాగు చేసుకుంటున్న రైతుల జోలికి వెళ్లొద్దని ఇటీవల నిర్వహించిన జడ్పీ సమీక్షలో స్వయంగా మంత్రి సీతక్క ఆదేశించనప్పటికీ అటవీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికే పెంచికల్పేట మండలం కొండపల్లి, ఆసిఫాబాద్ మండలంలోని దానాపూర్ గ్రామాల్లో అటవీ అధికారులు భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, పోడు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత, తిరుగుబాటు వ్యక్తమైంది.
మా ఊరిలో దాదాపు 40 ఏళ్లుగా 5 ఎకరాల భూమిని సాగుచేసుకుంటున్న. మా కుటుంబానికి ఈ భూమే ఆధారం. ఇన్నేండ్లుగా లేనిది ఈ యేడాది అటవీ అధికారులు వచ్చి నేను సాగుచేసు కుంటున్న భూమిని లాగేసుకున్నారు. ఐదెకరాల్లో ఎకరం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాకు ఉపాధి లేకుండా పోయింది. కూలీ పనికి వెళ్లాల్సి వస్తోంది. 40 ఏళ్లుగా గుర్తుకురాని అటవీ భూమి ఇప్పుడే ఎందుకు గుర్తుకు వచ్చింది.
– చటరే మల్లయ్య, ఇటిక్యల్పాడ్
నాకు ఊహతెలిసినప్పటికి నుంచి మా నాన్న 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నడు. అదే భూమిలో ఇప్పుడు నేను కూడా సాగు చేస్తున్న. కొన్ని నెలల క్రితం మా గ్రామానికి వచ్చిన అటవీ అధికారులు నేను సాగుచేసుకుంటున్న 8 ఎకరాలను లాగేసుకున్నారు. ఎంత బతిమిలాడినా ఎకరం కూడా ఇవ్వలేదు. నేను ఇంతకాలం సాగుచేసుకునే భూమిలో అటవీ అధికారులు మొక్కలను నాటారు. మా గ్రామంలోని మిగతా రైతుల భూములు కూడా తీసుకుంటరట.
– నివురే సురేశ్, ఇటిక్యల్పాడ్