ఆసిఫాబాద్ టౌన్, ఫిబ్రవరి 6 : మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ శాసనమండలి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్లో ఎస్పీ డీవీ శ్రీనివాస్‌రావు, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్‌తో కలిసి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి సభ్యుల ఎన్నికలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఏర్పాటు చేసిన 17 పోలింగ్ కేంద్రాల పరిధిలో 416 మంది ఉపాధ్యాయులు, సుమా రు 6 వేల మంది పట్టభద్రులు ఉన్నారని, నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు, గోడ రాతలు, జెండాలు, ప్రకటనలు తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఎంసీ కమిటీ ఏ ర్పాటు చేసి పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడి యా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ప్రచారాలను నిశితంగా పరిశీలించడం జరుగుతుందని, ఆయా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అవసరమయ్యే బ్యాలెట్ బాక్సులను సరిచూసుకోవాలని, డిస్ట్రీబ్యూషన్, రిసెప్షన్ సెంటర్లకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేయాలని, ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని సూచించారు.