ఉప్పల్, మార్చి 16 : శుక్రవారం రాత్రి ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధి చిలుకానగర్‌లోని ఆదర్శనగర్‌లో జరిగిన హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై శనివారం ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో డీసీపీ సురేష్‌కుమార్ నేతృత్వంలో నిందితులను మీడియా ముందు హాజరు పరిచారు. డీసీపీ సురేష్‌కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీకి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ సుధీర్‌కుమార్‌కు చిలుకనగర్‌లో ఉంటున్న సంతోష్నాయక్తో గత ఏడేళ్ల నుంచి పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి తరచూ మద్యం సేవించేవారు.
కాగా 4 రోజుల క్రితం రాంపల్లిలో సుధీర్ వాళ్ల బావ గృహ ప్రవేశం ఉండగా సుధీర్‌కుమార్ గృహ ప్రవేశానికి రావాలని సంతోష్‌కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. అనంతరం సంతోష్ ఫోన్ చేయగా సుధీర్ లేపలేదు. దీంతో ఇద్దరు వాట్సాప్‌లో తిట్టుకుంటూ మెసేజ్‌లు పెట్టుకున్నారు. మాటామాటా పెరగడంతో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు సుధీర్‌కు సంతోష్ ఫోన్ చేసి చిలుకానగర్‌లోని ఆదర్శనగర్‌కు రావాలని కోరాడు. దీంతో సుధీర్ ఆదర్శనగర్‌కు చేరుకున్నాడు. అప్పటికే దాడి చేయాలని సంతోష్ అతని స్నేహితుడు తరుణ్‌తో మద్యం మత్తులో సుధీర్ రాగానే విచక్షణా రహితంగా మెడ, కడుపులో చాకుతో పొడిచాడు. దీంతో సుధీర్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.
అక్కడి నుంచి నిందితులు బైక్‌పై పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న ఉప్పల్ పోలీసులు శనివారం తెల్లవారుజామున నాగారం ఏరియాలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 8 గంటల్లోనే కేసును ఛేదించిన ఎస్వోటీ, లా అండ్ ఆర్డర్ పోలీసులను సీపీ అవినాశ్ మహంతి అభినందించారు. ఈసమావేశంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అడిషనల్ డీసీపీ (ఎస్వోటీ) నర్సింహారెడ్డి, ఉప్పల్ డివిజన్ ఏసీపీ వెంకట్‌రెడ్డి, ఎస్వోటీ ఏసీపీ అంజయ్య, ఉప్పల్ ఇన్స్పెక్టర్ రామలింగారెడ్డి, ఎస్వోటీ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాస్, ఎస్సైలు మాధవరెడ్డి, చిరంజీవి, రజినీకర్, వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.