మేడ్చల్, మార్చి16(నమస్తే తెలంగాణ): కమర్షియల్ సిల్లిండర్ల బ్లాక్ దందా జోరుగా సాగుతున్నది. కావాలనే కృతిమ కొరత సృష్టించి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్యాస్ ఏజెన్సీలు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర 2,200 ఉండగా బ్లాక్లో రూ. 5 వేల పైచిలుకు విక్రయిస్తున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగదారులు ఎన్ని కోరితే అన్ని గ్యాస్ ఏజన్సీలు సిలిండర్లను అందిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగదారులు కోరితే రూ. 5 వేల నుంచి పైచిలుకు ధర చెల్లిస్తేనే సిలిండర్లను ఇస్తున్నట్లు కస్టమర్లు వాపోతున్నారు.
హోటళ్లు, ప్రైవేట్ హస్టల్ యజమానులు కమర్షియల్ సిలిండర్లను బ్లాక్లో కొనలేక మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్న డీఏవో అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో వందల సంఖ్యలో ఇడ్లీ సెంటర్లు, హోటళ్లు, ప్రైవేట్ హాస్టళ్లను మూసివేశారు. మరిన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఎలా ఉంటుందోనన్న ఆందోళనను హోటళ్ల, హాస్టళ్ల యజమానులు వ్యక్తం చేస్తున్నారు.
కమర్షియల్ సిలిండర్లు బ్లాక్ దందాను కొనసాగిస్తున్న నేపథ్యంలో కట్టెలకు డిమాండ్ పెరిగింది. చిన్న చిన్న హోటళ్లు, ప్రైవేట్ హాస్టళ్ల నిర్వాహకులు కట్టెలను ఉపయోగించుకుంటున్నారు. దీంతో గతంలో క్వింటా రూ. 600 ధర పలికిన కట్టెలు ప్రస్తుతం రూ. 1000 ధర పలుకుతున్నది.