మంచిర్యాల, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు ముందు రూ.2 లక్షల లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక మాట మార్చింది. వాయిదాలు వేస్తూ అధికారంలోకి వచ్చి ఏడాదైనా పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడంలో విఫలమైంది. రాష్ట్రంలోని రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ కోసం రూ.40 వేల కోట్లు అవుతాయని రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారానికి ముందు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక రూ.31 వేల కోట్లతో కేబినేట్ తీర్మానించింది. ఇక్కడే రూ.9 వేల కోట్లు తగ్గిందనుకుంటే.. రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీకి కేవలం రూ.26 వేల కోట్లు పెట్టారు.
చివరకు నాలుగు విడుతల్లో కలిపి రూ.20,616 కోట్లు మాఫీ చేశామంటున్నారు. సీఎం చెప్పిన దానిలో సగానికి సగం రుణమాఫీ మొత్తం తగ్గింది. ఈ లెక్కన సగం మందికి కోత పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్యాంకర్ల తప్పిదాలతో మాఫీ అంచనా రూ.11 వేల కోట్లు పెరిగితే, మరి బడ్జెట్ కేటాయింపుల్లో ఎందుకు ఎక్కువ చూపించారని రైతులు ప్రశ్నిస్తున్నారు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం తీసుకున్నోళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నాలుగో విడుత కింద మంచిర్యాల జిల్లా 8,195 మందికి రూ.78.59 కోట్లు, ఆదిలాబాద్ జిల్లాలో 6,600 మంది రైతులకు రూ.78 కోట్లు, నిర్మల్ జిల్లాలో 6,823 మంది రైతులకు రూ.69.67 కోట్లు, ఆసిఫాబాద్ జిల్లాలో …. రైతులకు … కోట్లు విడుదల చేసినట్లు గణాంకాలు చెప్తున్నాయి.
కేసీఆర్ సర్కారు చేసినప్పుడే బాగుండే..
తెలంగాణలో తొలిసారి కేసీఆర్ సర్కారు 35 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రూ.17 వేల కోట్ల రుణమాఫీ చేసింది. ఇప్పుడు 25.35 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు చేసినా కేవలం రూ.20 వేల కోట్లు అయ్యిందంటున్నారు. ఈ లెక్కన సగానికి సగం మందికి రుణమాఫీ కాకుండా ఎగ్గొట్టినట్లు స్పష్టం అవుతున్నది. రుణమాఫీ కానీ రైతుల్లో ఇప్పటికే కాంగ్రెస్ సర్కారుపై నైరాశ్యం నెలకున్నది. రుణమాఫీ కాలేదని బయటికి వచ్చి చెప్పుకోలేని దుస్థితిలో అన్నదాతలు ఉన్నారు. బ్యాంకులకు వెళ్లి స్టేట్మెంట్ తీస్తేకాని రుణమాఫీ వివరాలు తెలిసేలా లేవు. ఈ నేపథ్యంలో మరో ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయి వివరాలు బయటికి రానున్నాయి. అన్ని అర్హతలు ఉండి రుణమాఫీ కాని కొందరు రైతులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మాకెందుకు అన్యాయం చేయారంటూ నిలదీస్తున్నారు.
సర్వే చేసినా ప్రయోజనం శూన్యం
మూడు విడుతల్లో రేషన్‌కార్డు లేనో ళ్లు, పేర్లలో అక్షర దోషాలు ఉన్నోళ్లకు రుణమాఫీ కాలేదు. ఈ మే రకు రైతుల నుంచి దరఖాస్తు లు స్వీకరించి అధికారులు స ర్వే చేశారు. ఆ వివరాలను ఆన్లైన్లో నమోదు చేశా రు. అయినప్పటికీ వారిలో చాలా మందికి రుణమాఫీ కాలేదు. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న రైతులు బ్యాంక్‌లకు వెళ్లి ఎక్కువ మొ త్తాన్ని చెల్లించాలని, అనంతరం రూ.2 లక్షల మాఫీ అవుతుందం టూ గతంలో చెప్పారు. రైతులు కూడా బ్యాంకులకు వెళ్లి బారులుదీరి రుణాలు చె ల్లించారు. రుణం చెల్లించిన పత్రాలను తీసుకుని రైతు వేదికల్లో అధికారులకు సమర్పించారు. ఇక నాలుగో విడుతలో మాకు రుణమాఫీ అవుతుందనుకుని సంబురపడ్డారు. కానీ.. అసలు వారెవరికీ మాఫీ జరగలేదని తెలిసింది. రేషన్‌కార్డు లేనోళ్లు, పేర్లలో అక్షర దోషాలు ఉండి రానోళ్లు.. రూ.2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్నోళ్లు చాలా మంది రూ.2 లక్షలు మాఫీ కాక లబోదిబో మంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛన్‌దారులకు, ఐటీ రిటర్న్స్ కట్టేవాళ్లకు, రేషన్‌కార్డ్ లేని వారికి.. ఇలా అనేక రకాల కొర్రీలు పెట్టి 100 మందిలో 60 మందికే మాఫీ చేసి 40 మందికి ఎగ్గొట్టింది. ఎన్నికల్లో ఓట్లేసి గెలిపించిన రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేసింది. ఉమ్మడి జిల్లాలో దాదాపు 2.50 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినట్లు అధికారులు చెప్తున్నా ఎందరికి అయ్యింది. ఎందరికి కాలేదంటే మాత్రం వివరాలు లేవని చెప్తున్నారు.
సార్ల చుట్టూ తిరిగినం
దహెగాం,డిసెంబర్ 2 : నా పేరుమీద కొంచవెల్లి గ్రామీణ బ్యాంక్‌లో రూ. 60 వేలు, నా భార్య పేరున రూ. 80 వేల పంట రుణం తీసుకున్నం. సర్కారు రుణ మాఫీ చేస్తదని ఆశతో ఎదురు చూసినం. యేటా బ్యాంక్ రుణాలు మంచిగ కడుతున్నం. మా ఊరిలో కొందరి రైతులకు మాత్రమే డబ్బులు పడ్డయి. మాకు ఎందుకు రాలేదని బ్యాంక్ సార్లను అడిగితే అగ్రికల్చర్ సార్లను అడుగమని చెప్పిన్రు. గా సార్ల చుట్టూ మస్తు తిరిగినం. రానివాళ్ల లిస్టు పైకి పంపిస్తున్నం. వస్తదని చెప్పిన్రు. కానీ ఇప్పటి వరకు రూపాయి కూడా రాలే.
-కూడే బక్కన్న,గిరివెల్లి
లిస్టులో నా పేరు రాలే
తాంసి, డిసెంబర్ 2 : పంట వేద్దామని రూ.లక్షా 75 వేల అప్పు తీసుకున్న. ఎన్నికలకు ముందు కాంగ్రెసోళ్లు రూ.2 లక్షల లోపు మాఫీ చేస్తమన్నరు. నాలుగో లిస్టులో కూడా నా పేరు రాలే. నేను రైతును కాదా.. పంట కోసం అప్పు తీసుకున్నోళ్లందరికీ మాఫీ చేయాలే. కేసీఆర్ సర్కారుల అందరికీ రుణం మాఫీ చేసిన్రు. వీళ్లు మాత్రం కొందరికే ఇచ్చి చేతులు దులుపుకున్నరు. గీ వయసులో ఆఫీసుల చుట్టూ తిరగడం ఇబ్బందిగా ఉంది. మా బాధలను అర్థం జేసుకొని అప్పు మాఫీ చేయాలె.
– కంది పొచ్చక, హస్నాపూర్
మాట ఇచ్చి తప్పిండు
తాంసి, డిసెంబర్ 2 : హస్నాపూర్ శివారులో 8 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్న. మూడో విడుత రుణమాఫీలో నా పేరు వస్తుందని ఆశపడ్డా. నాలుగో విడుత వచ్చినా నా పేరే లేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పిండు. ఇప్పుడు మాట తప్పిండు. రూ.లక్షా 75 వేలు బాకీ ఉన్న. ఇప్పటిదాకా ఒక రూపాయి రుణమాఫీ కాలేదు.
-కంది సుభాష్ రెడ్డి, హస్నాపూర్
మా ఇంట్లో ఏ ఒక్కరికీ మాఫీ కాలే
చింతలమానేపల్లి, డిసెంబర్ 2 : మా కుటుంబంలో ముగ్గురం కలిసి సిర్పూర్ (టీ) మండల కేంద్రంలోని సొసైటీ బ్యాంక్‌లో లోన్ తీసుకున్నం. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ మాఫీ కాలే. మా అమ్మ దేవబాయి రూ. లక్షా 20 వేలు, నాన్న వసంత్‌రావు రూ. 18 వేలు, నేను రూ. 40 వేల క్రాప్ లోన్ తీసుకున్న. 2 లక్షలు తీసుకున్న ప్రతీ ఒక్కరికీ రుణం మాఫీ చేశామని చెబుతున్నరు. కానీ మాకు కాలేదు. ఇది అన్యాయం. మా ఊరిలో అనేక మంది రైతులకు రుణమాఫీ కాలే.
– నికోడె సందీప్, డబ్బా
రూ. 2 లక్షలు దాటిందని..
బెజ్జూర్, డిసెంబర్ 2 : నా పేరు మీద రెండెకరాల భూమి ఉన్నది. నా పెనిమిటి పేరు మీద నాలుగెకరాల భూమి ఉంది. ఇద్దరం కలిసి రూ. 2,16,000 రుణం తీసుకున్నం. రూ. 2 లక్షలు దాటినందుకే రుణమాఫీ కాలేదని బ్యాంకు మేనేజర్ చెప్పిండు. గిదెక్కడి న్యాయం. మాకు కూడా రుణమాఫీ చేయాలే. ఎలక్షన్లప్పుడు మాట ఇచ్చి.. గిప్పుడు గిట్లా తప్పుడేందో మరి.
– జుండె జమునాబాయి, కుకుడ
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
కోటపల్లి, డిసెంబర్ 2 : నాకు మా ఊరిలో ఎనిమిదెకరాల భూమి ఉంది. నా పేరు మీద రూ. లక్షా 30 వేలు, నా భార్య పేరు మీద రూ. లక్షా 90 వేల రు ణం తీసుకున్న. మొత్తం రూ. 2 లక్షల 90 వేల రు ణం ఉంది. రూ. 2 లక్షలు మాఫీ చేసినా మిగతా డబ్బులు కట్టుకు నేటోళ్లం. ఇప్పుడు రుపాయి కూడా మాఫీకాకపాయె. నాలుగు విడుతలు ఎదురు చూసినా లాభం లేకుంటైంది. అధికారంలోకి రాకముందు రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి రైతుకూ రుణం మాఫీ చేయాలి.
– కొట్టె సంతోష్, కోటపల్లి
అన్యాయం చేసిన్రు
కోటపల్లి, డిసెంబర్ 2 : నాకు మా ఊరిలో ఆరెకరాల భూమి ఉంది. బ్యాంకులో రూ. 2 లక్షల పంట రుణం తీసుకున్న. ఇగ మాఫీ అయితదో.. అగ మాఫీ అయితదోనని నాలుగు విడుతల నుంచి ఎదురు చూస్తున్న. కానీ ఇంత వరకు ఏ లిస్టులో కూడా నా పేరు రాలే. రూపాయి కూడా మాఫీ చేయలే. ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి మాత్రం అందరికీ రుణమాఫీ చేసినమని ప్రకటించిండు. నాలాగే మస్తుమందికి అన్యాయం జరిగింది. ఎన్నికలప్పుడు అందరికీ రుణమాఫీ చేస్తమని మాటిచ్చి.. ఇప్పుడు తప్పిన్రు. ఎన్నో ఆశలు పెట్టుకున్నం. గిట్లా చేస్తడనుకోలే.
– పడాల శంకర్, కోటపల్లి