చెన్నూర్, డిసెంబర్ 8 : కేసీఆర్ సర్కారులో మంజూరైన చెన్నూర్ ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగు నీరు, మూడు మున్సిపాలిటీలు, 103 గ్రామాలకు తాగు నీరందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి.. మంథని నియోజకవర్గంలో చేపట్టబోయే చిన్న కాళేశ్వరానికి మాత్రం వెంటనే నిధులు మంజూరు చేయడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్న తలెత్తుతున్నది. ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలు చూడాలి తప్ప.. ఇలా పార్టీల వారీగా పంథాలకు పోయి నష్టం చేయడం ఏమాత్రం సమంజసం కాదని ఆయా వర్గాల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాగా, ఈ విషయమై ఎమ్మెల్యే గడ్డం వివేక్ నోరుమెదపకపోగా, అనేక విమర్శలకు తావిస్తున్నది.
బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో..
కేసీఆర్ సర్కారులో ఎమ్మెల్యేగా ఎన్నికైన బాల్క సుమన్ ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక చొరవ చూపారు. చెన్నూర్ నియోజకవర్గ భౌగోళిక స్వరూపంపై పూర్తి అవగాహన ఉన్న ఆయన ప్రాణహిత నదిపై ఒకటి, గోదావరి నదిపై రెండు ఎత్తిపోతల పథకాలను నిర్మించి లక్షకు పైగా ఎకరాలకు సాగు నీరు, మూడు మున్సిపాలిటీలకు, 103 గ్రామాలకు తాగు నీరందించాలన్న ఆలోచనకు వచ్చారు. ఇందుకు అనుభవజ్ఞులైన ఇంజినీర్లతో చర్చించి తన ఆలోచనను అప్పటి సీఎం కేసీఆర్‌కు తెలిపారు. నియోజకవర్గంలోని రైతులు, ప్రజలకు ఉపయోగపడే ఈ భారీ ఎత్తిపోతల పథకాలను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన వెంటనే స్పందించి సర్వే కోసం రూ 8.88 కోట్ల నిధులు మంజూరు చేయించారు. 2020 జూన్ ఒకటిన సర్వే పనులను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రారంభించారు. నిర్ధేశించిన గడువు లోగా సర్వే పనులు పూర్తి చేసిన ఇంజినీరింగ్ అధికారులు డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టును ప్రభుత్వానికి అందజేశారు.
అయితే, హైదరాబాద్‌లోని ప్రగతి భవన్లో 2022 ఏప్రిల్12న సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర మంత్రి మండలి రూ 1,658 కోట్లు మంజూరు చేస్తూ ఆమోదం తెలిపింది. అంతేకాకుండా 2023 జూన్ 9న మంచిర్యాలకు వచ్చిన అప్పటి సీఎం కేసీఆర్ చెన్నూర్ ఎత్తిపోతల పథకం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టి.. మంథని నియోజకవర్గానికి ప్రయోజనం చేకూరే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు (ఎత్తిపోతల పథకానికి)పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. రూ 571.57 కోట్లు మంజూరు చేసింది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మంథని ఎమ్మెల్యే, పరిశ్రమలశాఖ మంత్రి డీ శ్రీధర్‌బాబు జలసౌధలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి సమీక్ష నిర్వహించి ప్రభుత్వ పరిపాలనా ఆమోదం తెలిపినట్లు ప్రకటించారు.
పట్టించుకోని ఎమ్మెల్యే వివేక్
తన నియోజకవర్గ ప్రజల కోసం మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్‌బాబు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు చేపడుతుంటే.. చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ మాత్రం చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టినా నోరుమెదపడం లేదు. వివేక్ తన స్వార్థ ప్రయోజనాలే తప్ప.. ఈ ప్రాంత ప్రజల బాగోగులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి మంత్రి పదవి కోసం పాకులాడుతున్నారే తప్ప.. నియోజకవర్గ అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా తన స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి చెన్నూర్ ఎత్తిపోతల పథకంపై శ్రద్ధ పెట్టాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
చెన్నూర్ ఎత్తిపోతలతో ఎంతో మేలు
చెన్నూర్ ఎత్తిపోతల పథకం అందుబాటులోకి వస్తే ఈ నియోజకవర్గానికి ఎంతో మేలు జరిగేది. 10 టీఎంసీల గోదావరి నీటిని వాడుకొని నియోజకవర్గంలోని చెరువులను నింపాలనుకున్నారు. చెరువుల నుంచి గ్రావిటీ కాలువల ద్వారా దాదాపు లక్ష ఎకరాలకు సాగు నీరందించాలనుకున్నారు. అలాగే నియోజకవర్గంలోని చెన్నూర్, మందమర్రి, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలతో పాటుగా చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్, మందమర్రి మండలాల్లోని 103 గ్రామాలకు తాగు నీరు అందించాలని అభిప్రాయపడ్డారు. కానీ కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి రావడంతో ఎత్తిపోతల పథకం గురించి పట్టించుకోవడం లేదు.
చెన్నూర్ ఎత్తిపోతల పథకం స్వరూపం
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలో కోటికిపైగా ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. గోదావరి నదిపై మేడిగడ్డ వద్ద (లక్ష్మి) బ్యారేజ్, అన్నారం వద్ద (సరస్వతీ) బ్యారేజ్, సుందిళ్ల వద్ద (పార్వతి) బ్యారేజ్‌లను నిర్మించారు. దీంతో నియోజకవర్గం చుట్టూ ఉన్న గోదావరి, ప్రాణహిత నదులు నిండుకుండలా ఉంటున్నాయి. అయితే, ఈ మూడు బ్యారేజ్‌లపై మూడు భారీ ఎత్తి పోతల పథకాలు నిర్మించి, 10 టీఎంసీల గోదావరి నీటిని వినియోగించి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరు, మూడు మున్సిపాలిటీలకు, 103 గ్రామాలకు తాగు నీరు అందించాలనుకున్నారు.
ఆల్గాం ఎత్తి పోతలతో..
మేడి గడ్డ (లక్ష్మి) బ్యారేజ్‌పై కోటపల్లి మండలం ఆల్గాం గ్రామం వద్ద ప్రాణహిత నదిపై ఎత్తి పోతల పథకాన్ని నిర్మించాలనుకున్నారు. దీని ద్వార మేడి గడ్డ (లక్ష్మి) బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి 16 కిలో మీటర్ల మేర పైపు లైన్ ఏర్పాటు చేసి 30 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోసి శంకరాపూర్ చెరువును నింపాలని, ఇక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 23 చెరువులను నింపాలని నిశ్చయించారు. ఈ చెరువుల నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా కోటపల్లి మండలంలోని 16,370 ఎకరాలకు సాగు నీరు అందించాలనుకున్నారు.
నర్సక్కపేట ఎత్తిపోతలతో..
అన్నారం (సరస్వతీ) బ్యారేజ్‌పై చెన్నూర్ మండలం నర్సక్కపేట గ్రామం వద్ద గోదావరి నదిపై ఎత్తి పోతల పథకాన్ని నిర్మించాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించింది. దీని ద్వారా అన్నారం (సరస్వతీ) బ్యారేజ్ బ్యాక్ వాటర్ నుంచి 16 కిలో మీటర్ల మేర పైప్‌లైన్ ఏర్పాటు చేసి 50 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోసి.. భీమారం మండలంలోని మద్దికల్ చెరువును నింపాలని భావించారు. ఈ చెరువు ద్వారా గ్రావిటీ కెనాల్ ద్వారా చెన్నూర్ మండలంలోని 18 చెరువులు, కోటపల్లి మండలంలోని 9 చెరువులు, భీమారం మండలంలోని 11 చెరువులను నింపాలనుకున్నారు. ఈ చెరువుల నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా చెన్నూర్, భీమారం, కోటపల్లి మండలాల్లోని 48,208 ఎకరాలకు సాగు నీటిని అందించనున్నారు.
టేకుమట్ల ఎత్తిపోతలతో..
సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్‌పై జైపూర్ మండలం టేకుమట్ల గ్రామం వద్ద గోదావరి నదిపై ఎత్తి పోతల పథకాన్ని నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు సన్నద్ధమైంది. సుందిళ్ల బ్యాక్ వాటర్ నుంచి 17 కిలో మీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేసి 53 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తి పోసి మందమర్రి మండలం పొన్నారం చెరువును నింపాలని, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా మందమర్రి మండలంలోని 7 చెరువులను, జైపూర్ మండలంలోని 21 చెరువులను నింపాలని ప్రణాళికలు రూపొందించింది. ఈ చెరువుల నుంచి గ్రావీటి కెనాల్ ద్వారా జైపూర్, మందమర్రి మండలాల్లోని 25,423 ఎకరాలకు సాగు నీరందించాలని నిశ్చయించారు.
త్వరితగతిన పనులు ప్రారంభించాలి
చెన్నూర్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనం కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన ప్రారంభించి పనులు త్వరగా పూర్తి చేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాలు చూడాలి తప్ప.. ఇలా పార్టీల వారీగా పంథాలకు పోయి నష్టం చేయొద్దన్న వారు వేడుకుంటున్నారు.