ఆదిలాబాద్, జూలై 13(నమస్తే తెలంగాణ) : పత్తి కొనుగోళ్లలో ఈ ఏడాది నుంచి సరికొత్త విధానాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కేంద్రం యేటా వివిధ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తుండగా, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ఆధ్వర్యంలో ఆ రేటుతో మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు చేపడుతారు. ఈ ఏడాది నుంచి ప్రైస్ డెఫిసియెన్సీ పేమెంట్ స్కీం(పీడీపీఎస్) విధానం ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద పత్తి కొనుగోళ్లు నిర్వహించాలని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
ఈ విధానం అమలు చేస్తే సీసీఐ ద్వారా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉండదు. ప్రైవేటు వ్యాపారులు పంటను ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేస్తారు. రైతులు విక్రయానికి తీసుకొచ్చే తేమ, ఇతర నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ధర చెల్లిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర లభించనప్పుడు ఆ లోటును భర్తీ చేయడానికి కేంద్రం వ్యాపారులు కొనుగోలు చేసిన ధరలో 15 శాతం కలిపి రైతులకు ఇస్తుంది.
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది రైతులు 4.40 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు. సీజన్ ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా.. వర్షాలు అనుకూలించడంతో పంట ఎదుగుదల బాగా ఉంది. ఎకరాకు 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశాలున్నాయి. కేంద్రం ఈ ఏడాది పత్తి క్వింటాలుకు రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. సీసీఐ పంట కొనుగోలు చేస్తే రైతులకు మద్దతు ధర లభించే అవకాశాలు ఉండగా.. పీడీపీఎస్ విధానం వల్ల ఈ ధర లభిస్తుందా? లేదా? అనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది.
ఈ విధానంలో ప్రైవేటు వ్యాపారులు తేమ శాతం, పింజ పొడువు, పంట నాణ్యతను పరిగణలోకి తీసుకుని ధర చెల్లిస్తుండడంతో రైతులకు నష్టం జరుగుతున్నది. తాము ఎంతో కష్టపడి భారీగా పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటకు మద్దతు ధర చెల్లించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని, ప్రతి సంవత్సరం మాదిరి ఈసారి కూడా సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు జరపాలని రైతులు కోరుతున్నారు. తమకు నష్టం కలిగించే పీడీపీఎస్ విధానం అమలు చేయవద్దని కోరుతున్నారు.