నార్నూర్, డిసెంబర్ 24 : అదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలో గత ఏడాది మొక్కలను పెంచాలని ఉద్దేశంతో హరితహారం నర్సరీని ప్రభుత్వ కార్యాలయాల పక్కనే ఏర్పాటు చేశారు. ఈ నర్సరీలో వేలు ఖర్చు చేసి పదివేల మొక్కలు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు పెంచారు. కాగా ఉన్నత అధికారుల పర్యవేక్షణ క్షేత్రస్థాయిలో కరువై మొక్కల పెంపకం పై అంతగా ఆసక్తి చూపించినట్లు కనిపించడం లేదు.
పంచాయతీ ఈజీఎస్ సిబ్బంది పట్టింపు లేని తనంతో పెంచిన మొక్కలు ఎండిపోయి అస్తవ్యస్తంగా దర్శనమిస్తున్నాయి. నిత్యం ఇతర గ్రామాల నుంచి కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ నర్సరీని చూసి ఆఫీసు పక్కనే ఉన్న నర్సరీ ఇలా ఉంటే మారుమూల గ్రామాల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చని, జిల్లా మండల అధికారుల పనితీరు ఏ మేరకు ఉందో ఈ నర్సరీయే నిదర్శనమని చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నర్సరీలో ఎండుతున్న మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడుతున్నారు.