ఆదిలాబాద్, మే 6(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 13న పోలింగ్ జరుగనుండగా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనుంది. 1,837 కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేలా బయట, లోపల రెండేసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు 677 పోలింగ్ స్టేషన్లలో బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో ప్రాంతంలో రెండు నుంచి ఐదు కేంద్రాలు ఉన్న చోట కెమెరాల సంఖ్యను తగ్గిస్తారు. పోలింగ్ కేంద్రాల్లో కెమెరాల ఏర్పాటు, ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చూస్తున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 2,200 కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా చూడడానికి కంట్రోల్ రూంలను ఏర్పాటు చేస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయాలతోపాటు ఆదిలాబాద్, బోథ్, ఉట్నూర్, నిర్మల్, భైంసా, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ సహాయ ఎన్నికల అధికారి కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఉంటాయి. ఎన్నికల పరిశీలకులతోపాటు రిటర్నింగ్ అధికారి, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు కంట్రోల్‌రూంలో అందుబాటులో ఉంటూ పోలింగ్ తీరును పరిశీలిస్తారు. ఎలాంటి ఘటనలు జరిగినా వెంటనే అప్రమత్తమై చర్యలు తీసుకుంటారు. వీరు పోలింగ్ తీరును సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తారు. పార్లమెంట్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ పర్యవేక్షణ ఫలితంగా ఎన్నికలు సజావుగా జరిగే అవకాశాలున్నాయి.