కంఠేశ్వర్, జూలై 9: పారదర్శక ఓటరు జాబితా రూపకల్పన కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను పక్కాగా నిర్వహిస్తూ నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. నగరంలో కొనసాగుతున్న ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, వివరాల డిజిటలైజేషన్ ప్రక్రియను కలెక్టర్ గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. రూరల్ పరిధిలోని గాంధీనగర్ తండా, గూపన్పల్లి గ్రామాలతోపాటు నగరంలో శంకర్‌భవన్ పాఠశాలలో ఎన్యూమరేషన్ ఫారాలా స్వీకరణ వివరాలు, నమోదు తీరును నిశితంగా పరిశీలించారు.
ఇప్పటివరకు ఎస్ఐఆర్ ప్రక్రియ ఎంత శాతం పూర్తయింది, ఓటర్లు అందరికి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అందుబాటులోని లేని ఓటర్లకు కూడా సమాచారమందించాలని గడువులోగా వారు తమ ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి అందించేలా చూడాలన్నారు. ఓటర్లు ఎన్యూమరేషన్ ఫారంలో పొందుపర్చిన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని వీఎల్వో, సూపర్వైజర్లను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, ఆర్డీవో రాజేంద్రకుమార్, కలెక్టరేట్ ఏవో పర్యవేక్షకుడు బాలరాజ్, తహసీల్దార్ వినయ్‌సాగర్ ఉన్నారు.