వానకాలం సాగుకు ఆదివాసులు శ్రీకారం చుట్టారు. కెరమెరి మండలంలోని ఝరి, మోడి గ్రామాలో శుక్రవారం విత్తనాల ముహూర్తాన్ని సంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఉదయం కుటుంబ సమేతంగా పూజ సామగ్రి, విత్తనాలతో చేనుకు తరలివెళ్లారు. ముందుగా ఎడ్లకు తిలకం దిద్ది, అక్షింతలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. పంటలు బాగా పండాలని, వ్యవసాయం లాభసాటిగా సాగాలని కొబ్బరికాయలు కొట్టి దేవుడిని వేడుకున్నారు.
ఈ సందర్భంగా తయారు చేసిన నైవేద్యం ఇంటి దేవతకు సమర్పించి, అక్కడే సహపంక్తి భోజనాలు చేశారు. అనంతరం మొదటి రోజు కావడంతో కొన్ని రకాల ఆహార ధాన్యాల విత్తనాలను చేనులో విత్తారు. తిరిగి ఇంటికి చేరుకోగానే ఎడ్లకు హారతిపూజలు చేసి, ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వండిన వంటలను గ్రామపటేల్ ఇంటికి సేకరించి సహపంక్తి భోజనం చేశారు. సంప్రదాయ ఆటపాటలతో సంబురాలు చేసుకున్నారు.
– కెరమెరి, జూన్ 2