నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 26 : నిర్మల్ జిల్లాలోని 47 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ను విడుదల చేసినట్లు నిర్మల్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహ్మద్ అబ్దుల్ రజాక్ శుక్రవారం తెలిపారు. 47 మద్యం దుకాణాలకు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 23న మద్యం దుకాణాలకు దరఖాస్తులను లాటరీ పద్ధతిన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక చేస్తారని వివరించారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల చొప్పున చెల్లించి ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా ఇచ్చే అవకాశం ఉందన్నారు. రిజర్వేషన్ దుకాణాల్లో దరఖాస్తు చేసుకునేందుకు కుల ధ్రువీకరణ పత్రం, తదితర పత్రాలతో పాటు రూ.3 లక్షల డీడీ చలాన్ జత చేయాలని జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి నిర్మల్ పేరున తీయాల్సి ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు ఫారాలను జిల్లా ప్రొహిబిషన్ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.
ఎదులాపురం, సెప్టెంబర్ 26 : 2025-27 సంవత్సరానికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో 40 మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదలైనట్లు ఆదిలాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారిని వై.హిమశ్రీ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో ఈ నెల 26 నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు స్వీకరిస్తామని తెలిపారు. అక్టోబర్ 23న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రత్నా గార్డెన్లో లక్కీ డ్రా నిర్వహిస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని 40 మద్యం దుకాణాల్లో 5 దుకాణాలు ఎస్సీలకు, ఒకటి గౌడ కులస్తులకు, ఉట్నూర్ సరిల్ పరిధిలోని ఏజెన్సీలోని 9 దుకాణాలు ఎస్టీలకు కేటాయించినట్లు తెలిపారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ ఆదిలాబాద్ పేరుపై రూ.3 లక్షలు డీడీ చలాన్ తీసి, ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తుకు జతచేసి అందించాలని సూచించారు.