మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి13(నమస్తే తెలంగాణ) : తెలంగాణ అంటే గుర్తుకొచ్చే పేరు కేసీఆర్.. ప్రత్యేక తెలంగాణ వాదాన్ని నిలబెట్టి, చావు నోట్లో తలబెట్టి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన యోధుడు. యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే నేత. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ ఊరుకెళ్లినా మా దగ్గర ఎమ్మెల్యే ఎవ్వరైనా పర్లేదు, కానీ.. తెలంగాణకు కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పని మనిషే లేడు. అది కేసీఆర్‌పై తెలంగాణ జనాలకు ఉన్న అభిమానం. పదేండ్ల స్వరాష్ట్ర పాలనలో 60 ఏండ్ల సమైఖ్య పాలన గాయాలను మానేలా చేసిన ధీరుడు. రైతులు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజలు ఆయన పాలనలో సుభిక్షంగా బతికారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే తెలంగాణ అల్లకల్లోమైంది. రైతులు ఆగమైతున్నరు. మహిళలు, వృద్ధుల సంక్షేమం గాడితప్పింది. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో పిల్లలు చనిపోతున్నరు. సమస్యల వలయంలో చిక్కుకుని ఉద్యోగులు విలవిలలాడుతున్నరు. ఇక ఈ సర్కార్‌కు ఇచ్చిన గడుపు చాలు చీల్చి చెండాడుదామంటూ కేసీఆర్ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. సర్కారును నిలదీయాలంటూ పిలుపునిచ్చారు. మొన్నటి దాక అసెంబ్లీ ఎందుకు రావడం లేదంటూ ప్రశ్నించిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో ఏం చేయాలో తెలియని అంతర్మథనంలో పడిపోయాడు.
పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఏం చేయాలో తెలియక కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిండు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు పారేసుకున్నడు. స్ట్రేచర్.. స్ట్రెచ్చర్.. మార్చురీకి పోవాలంటూ కేసీఆర్‌పై అక్కసును వెల్లగక్కిండు. పరిపాలన చేత కాక.. చావుభాష మాట్లాడిండు. కేసీఆర్ అంటే ఉన్న భయంతో ఆయనతో నేరుగా కొట్లాడలేక అవాకులు.. చవాకులు మాట్లాడిండు. సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై తెలంగాణ సమాజం భగ్గుమంటున్నది. ఇవేం మాటలు రేవంత్ అంటూ మండిపడుతున్నది. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు, మేధావులు కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు.
విచక్షణ కోల్పోయారు..
తెలంగాణ సాధకులు కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. పాలన చేతకాక, ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల అమలులో విఫలమై ఇష్టారీతిన మాట్లాడుతున్నడు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండడంతో అసహనానికి లోనవుతున్నడు. కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో రేవంత్‌రెడ్డికి భయమేస్తున్నది. పాలన వైఫల్యాలపై కేసీఆర్ నిలదీస్తే జనంలో తలెత్తుకోలేమని అవమానించేలా మాట్లాడుతున్నరు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, తెలంగాణను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించిన కేసీఆర్ వంటి నాయకుడిపై రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదు.
– బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు
పాలన చేతగాక అనుచిత వ్యాఖ్యలు..
ఆరు గ్యారెంటీల అమలు వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నడు. తన చేతగాని తనాన్ని గత ప్రభుత్వం పైకి నెట్టాలని చూస్తున్నడు. కేసీఆర్ దమ్మున్న నాయకుడు. పదేండ్ల పాలనలో ఏం చేసినా ప్రజల ఆదరించారు. ప్రజల మనసును గెలుచుకున్నారు. పాలనలో విఫలమైన రేవంత్‌రెడ్డి సర్కారును జనాలు ఛీదరించుకుంటున్నారు. కేసీఆర్‌తో పోల్చుకుంటూ అన్యాయమైపోయినమని ఆవేదన చెందుతున్నరు. అది జీర్ణించుకోలేక కేసీఆర్ వంటి నాయకుడిపై చిల్లరమల్లర మాట్లాడి చిన్నగ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.
– దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే, బెల్లంపల్లి.
రాష్ట్రం పరువు తీస్తున్నారు..
రేవంత్‌రెడ్డి దిగుజారుడు మాటలు మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నాడు. సీఎం హోదాను మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నరు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ మాదిరిగా మాట్లాడిన సందర్భాలు లేవు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి కుర్చీకి గౌరవం వచ్చేలా వ్యవహరించాలి. కానీ.. ఆయన మాట్లాడిన తీరును ప్రజలు, మేధావులు గమనిస్తున్నారు. కేసీఆర్ గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం ఆయన దొంగబుద్దికి నిదర్శనం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో అసెంబ్లీ, మూసీ నది విషయంలో కూడా వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి మరోసారి నోరు పారేసుకోవడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.
– జోగు రామన్న, మాజీ మంత్రి.
దేశానికి గాంధీ ఎలానో, తెలంగాణకు కేసీఆర్ అలాగే..
ఏ నాయకుడైనా కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా ఆసుపత్రికి పోవాలి, మార్చురీకి పోవాలని మాట్లాడడం సరికాదు. సంస్కారం ఉన్న ఏ వ్యక్తి అలా మాట్లాడరు. భారతదేశానికి గాంధీ ఎలానో, కేసీఆర్ తెలంగాణకు అలాగే. అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి సంస్కారం లేని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. సీఎం అనుచిత వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నా. తక్షణమే కేసీఆర్‌కు, తెలంగాణ సమాజానికి రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి.
– దివాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల
ఛీదరించుకుంటున్నరు..
రేవంత్‌రెడ్డి తన స్థాయిని మరచి మాట్లాడుతున్నడు. కాంగ్రెస్ పాలనపై, రేవంత్ తీరుపై ప్రజలు ఛీదరించుకున్నా పద్ధతి మార్చుకోవడం లేదు. పరిపాలన చేతకాక, ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నడు. ఇలాంటి వ్యక్తికి రాష్ర్టాన్ని అప్పగించి తప్పు చేశామని ప్రజలు ఇప్పటికే తీవ్ర ఆవేదన చెందుతున్నారు. కేసీఆర్‌పై సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మరణాన్ని కోరుకుంటూ మార్చురీ వంటి పదాలు వాడడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రేవంత్ వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దూషణలతో రాబోయే తరానికి ఎలాంటి సందేషం ఇస్తున్నాడో అర్థం అవుతున్నది. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని వెంటనే కేసీఆర్‌కు క్షమాపణ చెప్పాలి. లేకుంటే రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదు.
– భూక్యా జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ సమన్వయకర్త
క్షమాపణ చెప్పాల్సిందే
తెలంగాణ సాధించి పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అహంకారపూరితంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. రేవంత్‌రెడ్డి మాటలను తెలంగాణ సమాజం పూర్తిగా ఖండిస్తోంది. ఏడాది పాలనలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. సీఎం స్థాయిలో హుందాగా ఉండాల్సింది పోయి ఇలా దిగజారి మాట్లాడడం దారుణం. అసమర్థ సీఎంగా పేరుతెచ్చుకున్న రేవంత్ రెడ్డి వెంటనే గద్దె దిగాలి. తెలంగాణ సమాజం యావత్తు గౌరవించే కేసీఆర్‌ను అవమాన పరిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందే.
– కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే
రేవంత్ మాటలు జుగుప్సాకరం
కేసీఆర్‌పై రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఆయన నీచమైన ఆలోచనలకు నిదర్శనం. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హూందాగ వ్యవహరించాలి. కానీ.. దుర్మార్గమైన ఆలోచనలు, బూతు మాటలతో తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి అలా మాట్లాడడం జుగుప్సాకరం. పరిపాలన చేతకాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైన రేవంత్ ఇష్టానుసారంగా మాట్లాడాన్ని ప్రజలు గమనిస్తున్నారు. తమ నాయకుడు కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి.
– అనిల్‌జాదవ్, ఎమ్మెల్యే, బోథ్
ప్రజలు తరిమే రోజులు దగ్గరపడ్డాయ్..
కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన అసభ్యకరమైన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నా. కేసీఆర్ ఇక మార్చురీకి పోతాడేమో అంటూ నీచంగా మాట్లాడడం అత్యంత దారుణం. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి పెట్టిన గొప్ప మనిషిగా కేసీఆర్‌ను రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. అలాంటి నేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రేవంత్‌రెడ్డి ఎక్కడ సమావేశాలు పెట్టినా.. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించడం అలవాటైపోయింది. పాలన చేతకాక నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు తన్ని తరిమేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
– కే.రాంకిషన్‌రెడ్డి, బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త
రేవంత్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రోజులు దగ్గరపడ్డాయి. పాలన చేతకాని సీఎంగా పేరుతెచ్చుకున్న రేవంత్ రెడ్డికి కనీసం సభ్యత.. సంస్కారం కూడా లేదని అసెంబ్లీ సాక్షిగా నిరూపితమైంది. కేసీఆర్ పాలనలో పదేళ్లు హాయిగా జీవించిన అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ఏడాది పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. త్వర లో రేవంత్ రెడ్డినే తెలంగాణ ప్రజలు స్ట్రెచర్మీదికి పంపిస్తారు. పదేళ్లు ప్రజారంజకంగా పాలించిన కేసీఆర్ తలుచుకుంటే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండలేరు. కేసీఆర్ సార్ సహనాన్ని రేవంత్‌రెడ్డి అలుసుగా తీసుకుంటున్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నోటిని అదుపులో పెట్టుకోకపోతే గుణపాఠం తప్పదు.
– రంగు సందీప్ గౌడ్, బీఆర్ఎస్ యూత్ లీడర్, దహెగాం