ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతులకు ప్రతిఏటా తిప్పలు తప్పడం లేదు. ఈ ఏడాదైనా కష్టాల నుంచి గట్టెక్కుదామనుకున్న వారికి నిరాశే మిగిలింది. సీజన్ ప్రారంభం నుంచి ఏపుగా పెరిగిన పత్తి చేలు ఎడతెరిపి లేని వానలతో పంట చేతికి రాకుండా పోతున్నది. అధిక వర్షాలతో కొన్ని చోట్ల మొక్కలు జాలుపట్టి ఎండిపోగా, మిగిలిన చేనులో పూత, కాయలు రాలిపోతున్నది. ఫలితంగా పంట దిగుబడి తగ్గి రైతన్నలకు మళ్లీ కన్నీరే మిగిలే పరిస్థితి నెలకొన్నది.
ఆదిలాబాద్, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో 4.30 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేశారు. జూన్ మొదటి, రెండో వారాల్లో విత్తనాలు వేయగా వర్షాలు అనుకూలించడంతో మొదటిసారిగా వేసిన విత్తనాలు మొలకెత్తాయి. మొదట వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ సాగుకు వర్షాలు క్రమంగా అనుకూలిస్తుండడంతో నెల రోజుల కిందట వరకు పంట మంచి ఎదుగుదల బాగా ఉండడంతో రైతులు దిగుబడులపై ఆశలు పెట్టుకున్నారు. ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశాలు ఉండడంతో నెల రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ప్రతి రోజూ వర్షం పడుతుండడంతో పంట పొలాల్లో నీరు నిలిచి పత్తి చెట్లు పాడవుతున్నాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండడం లేదు. దీంతో అన్నదాతలు పంట దిగుబడులపై ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో పత్తి సాగుకు అనుకూలమైన నల్ల రేగడి నేలలు ఉండడం, రైతులకు పంటసాగులో అనుభవం ఉండడంతో రైతులు ఎక్కువ విస్తీర్ణంలో పత్తిని సాగు చేస్తారు. నెల రోజుల వరకు పంట ఎదుగుదల బాగా ఉండడంతో ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు నమ్మకంతో ఉన్నారు. ప్రస్తుతం పత్తి పంట కాత దశలో ఉండగా మరో 20 రోజుల్లో దిగుబడులు ప్రారంభమవుతాయి. వర్షాల కారణంగా పంట ఎదుగుదల నిలిచిపోవడంతో రైతులు దిగుబడుల కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చెట్ల మొదళ్లలో యూరియా, 20-20 ఎరువులను వినియోగించడంతో పాటు మందులను పిచికారీ చేస్తున్నారు.
ఎరువులు పోసిన రోజు వర్షం పడుతుండడంతో వాటి ప్రభావం ఉండడం లేదు. దీంతో పలు దఫాలుగా ఎరువులు, మందులు చల్లాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. మందుల వాడకం ఫలితంగా పంట పెట్టుబడులు సైతం పెరిగి భారంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎకరాకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడులు సైతం వచ్చే అవకాశాలు లేవని, వర్షాలు ఇలాగే కొనసాగితే ఈ దిగుబడి సైతం రాదని అంటున్నారు.
ఈ చిత్రంలో ఉన్న రైతు పేరు.. పూదరి వెంకన్న ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామానికి చెందిన ఆయన. ఆరు ఎకరాల్లో పత్తి పంటను సాగు చేశాడు. పంట మనిషి ఎత్తు ఏపుగా పెరిగి పూత, కాత బాగా వచ్చింది. నెల రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెట్ల కొమ్మలకు ఉన్న పూతతో కాయలు రాలిపోతున్నాయి. ఒక్కో చెట్టుకు 60 కాయలు ఉండాల్సింది పోయి 20 మాత్రమే ఉన్నాయని రైతు ఆందోళన చెందాడు. పత్తి పంట దిగుబడి కోసం రెండుసార్లు యూరియా, స్ప్రే మందులు వాడినట్లు తెలిపారు. ఎకరాకు 12 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వస్తుందని ఆశించిన తనకు 3 నుంచి 4 క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, పెట్టుబడి సైతం వస్తుందో రాదోనని ఆవేదన వ్యక్తం చేశాడు.