పై చిత్రంలో ఉన్నది తిర్యాణి మండలం చింతలమాదర (మందగూడ)లోని ఐటీడీఏ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల. ఇందులో దాదాపు 22 మంది ఆదివాసీ బిడ్డలు చదువుకుంటున్నారు. ఇక్కడ ఇద్దరు ఉపాధ్యాయులుండగా, ఇటీవల ఒకరు ఉద్యోగ విరమణ పొందారు. మరొకరు బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి ఇక్కడ పాఠాలు బోధించేవారే కరువయ్యారు.
నిన్నమొన్నటి దాకా చింతలమాదరతో పాటు చుట్టు పక్క పల్లెల నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడం.. ఉపాధ్యాయులు లేక తిరిగి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్యకు దూరమవుతున్న పిల్లల పరిస్థితి, తల్లిదండ్రుల ఆవేదనను చూసి ఇదే గ్రామంలో పనిచేసే అంగన్వాడీ టీచర్ తుంరం కవిత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాఠాలు బోధిస్తున్నారు. ఇలా ఈ ఒక్క పాఠశాల అనే కాదు.. జిల్లా వ్యాప్తంగా అనేక స్కూళ్లలో టీచర్లు లేక విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/తిర్యాణి, ఆగస్టు 27 : ఆసిఫాబాద్ జిల్లాలో 330 గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలుండగా, వీటిలో 38 పాఠశాలల్లో వి ద్యార్థుల సంఖ్య‘జీరో’ఉండడం విశేషం. ఆసిఫాబాద్ మం డలంలో 6, వాంకిడి మండలంలో 9, తిర్యాణిలో 12, బె జ్జూర్లో 4, చింతలమానేపల్లిలో 2, సిర్పూర్-యూలో 2, జైనూర్‌లో 2, సిర్పూర్-టీలో ఒక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య జీరోగా ఉంది. గతంలో ఈ పాఠశాల్లో గిరిజన విద్యార్థులు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్క విద్యార్థి కూడా లేకపోవడం గమనార్హం. విద్యార్థులు లేరనే సాగుతో ఈ పాఠశాలలను మూత వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అడవిబిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకం
ఐటీడీఏ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక అడవిబిడ్డల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టి మెరుగైన విద్యనందించేందుకు చర్యలు చేపట్టగా, కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం పాఠశాలలు మూతబడే స్థితికి చేరుకుంటున్నాయి. మరోవైపు కనీస సౌకర్యాలు లేక ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు అవస్థలు పడాల్సి వస్తున్నది.
వారం రోజులుగా తెరచుకోని పాఠశాలలు
కౌటాల, ఆగస్టు 27 : మండలంలోని పలు గిరిజన పాఠశాలలు ఉపాధ్యాయులు లేక వారం రోజులుగా తెరుచుకోవడం లేదు. కేబీ కాలనీ మొగడ్‌ధగడ్, శివలింగపూర్, కనికి, జనగాం ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఇటీవల ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. అలాగే గురుడుపేట గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు మెడికల్ లీవ్‌లో ఉండడంతో మొత్తం 5 గిరిజన పాఠశాలలు మూతపడ్డాయి. ప్రతి రోజూ విద్యార్థులు పాఠశాలకు వస్తూ.. ఉపాధ్యాయులు లేక తిరిగి వెళ్తున్నారు. ఈ విషయమై ఎస్సీఆర్పీ (స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్) మడావి పోచానిని వివరణ కోరగా, ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లడంతో పాఠశాలలు నడవడం లేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.