రాష్ట్రంలోని మైదాన ప్రాంతాల్లో రెండు పంటలు కొన్ని చోట్ల మూడు పంటలను రైతులు సాగు చేస్తున్నారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి యేటా ఒకే రకమైన పంటలు వేసి రైతులు అప్పుల పాలవుతున్నారు. కొందరు రైతులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలున్నాయి. ఇందుకు కారణం నీటి నిల్వకు ప్రాజెక్టులు, డ్యాములు లేకపోవడం. సాగుకు యోగ్యం కాని బండ రాళ్లతో ఉన్న భూమి, విద్యుత్ సౌకర్యం, తాగునీటి సౌకర్యం లేక పోవడంతో గిరిజనులు ఎక్కువగా వర్షాధారిత పంటలపైనే ఆధారపడుతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు, ఉద్యానవన పంటల వైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం లేదని, సరైన సబ్సిడీలు అందించడం లేదని రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉట్నూర్, జూన్ 26 : ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో ఎక్కువగా పత్తి పంటను సాగు చేస్తారు. 10 ఎకరాల పైగా ఉన్న గిరిజన రైతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. వారు వర్షాధారంగా పంటలు పండించడం, ఒకే పంటను ఎంచుకోవడంతో ఎక్కువ నష్టాలు చవిచూస్తున్నారు. అతివృష్టి లేదా అనావృష్టి గిరిజన రైతులకు శాపంగా మారుతున్నది. కానీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, గిరిజనులకు ప్రోత్సాహం అందిస్తే ఉద్యాన పంటలతో రాణిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ ఉద్యాన శిక్షణ కేంద్రం 1985 సంవత్సరంలో ప్రారంభించిన అది రానురానూ మూలన పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 10 వేల ఎకరాల్లో సాగు..
రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో మాత్రమే ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. వాటిని 25లక్షల ఎకరాలకు పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 10 వేల ఎకరాల్లో ఉద్యానవన పంటలు సాగవుతున్నాయి. ఈ సంవత్సరం 15 వేల ఎకరాలకు పెంచేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. వరి, మొక్కజొన్న లాంటి ఆహార ధాన్యాలకు బదులు పండ్లు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పూల పంటలను ఉద్యాన పంటలు అంటారు. మామిడి, జామ, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి ఇవి ఒకసారి నాటితే 15-20 ఏళ్లు దిగుబడి ఇస్తాయి. వరి పంట కంటే 3 నుంచి నాలుగు రేట్లు ఆదాయం పొందవచ్చు. ఇక కూరగాయలు వంకాయ, టమాట, మిర్చీ, బెండ 3 నుంచి నాలుగు నెలల్లో చేతికచ్చే పంట, సంవత్సరానికి రెండు నుంచి మూడు పంటలు తీయెచ్చు. కూరగాయలు పండిస్తే నిత్యం విక్రయాలు జరుగుతూ రైతుల చేతుల్లో డబ్బులు కనిపిస్తాయి. ఇక సుగంధ ద్రవ్యాలు పసుపు, మిరియాలు, అల్లం, లవంగాలు మార్కెట్ ధర ఎక్కువ, నిల్వ ఉంచి రేటు బాగున్నప్పుడు విక్రయిస్తే అధిక లాభాలు గడించవచ్చు. ఇక పూలు మేరిగోల్డ్, మలై, కనకాంబరాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు గడించే పంటలు. పూలు ఎప్పుడు దేవాలయాలు, పూజలకు పనికివచ్చే పంటలు, అధిక లాభాలు కూడా సొంతం చేసుకోవచ్చు.
సకాలంలో రైతుబంధు అందక ఇబ్బందులు..
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు ఉన్న భూమిలో 50 శాతం పత్తి, మిగతా 50 శాతం కంది, వేరుశనగ, వ్యవసాయ భూమి చుట్టూ జా మ, మామిడి, ఇతర పండ్ల పంటలు వేసేలా వ్యవసాయ అధికారులు సబ్సిడీపై మొక్కలు అందించడంతో పాటు సలహాలు, సూచనలు చేస్తే పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం మైదాన ప్రాంతంలో రిజిష్టర్ అయిన భూములకు మొదట రైతు బంధు (పెట్టుబడి సాయం) అందించింది. కానీ ఏజెన్సీ పరిస్థితులు తెలిసిన కేసీఆర్ గిరిజన రైతులకు రిజిష్టర్ భూములు లేకున్నా అటవీ భూము ల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజన రైతులకు హక్కు పత్రాలు ఇవ్వడంతో పాటు రైతుబంధు కింద ఎకరానికి 6వేల సాయం అందిం చారు. దీంతో ఒక్కసారిగా ఏజెన్సీలో పరిస్థితులు మారాయి. ప్రతి సంవత్సరం గిరిజనులు షావుకార్ల వద్ద విత్తనాలు, ఎరువులు, పంట ఖర్చులకు తీసుకునే పరిస్థితి తప్పింది. రైతు బంధు రాగానే రైతులే విత్త నాలు, ఎరువులు కొనుగోలు చేసి వ్యవసాయం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వానాకాలం ప్రారంభమైన రైతుబంధు రాక…సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పంపకాలు జరగకపోవడంతో మళ్లీ మొదటికే వచ్చింది. గిరిజన రైతుల పరిస్థితి. దీంతో గిరిజన రైతులు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుతున్నారు.
లాభాల బాటలో ఐటీడీఏ ఉద్యానవనాలు..
ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని ఉట్నూర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, బెల్లంపల్లి ఉద్యాన పంటల్లో ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చింది. లాభాలు కూడా అదే స్థాయిలో ఐటీడీఏకు వచ్చాయి. ఐటీడీఏ అధికారులు ఏజెన్సీ గిరిజన రైతులకు సబ్సిడీపై మొక్కలు, పంటలకు డ్రిప్ ఇరిగేషన్‌పై సబ్సిడీ అందిస్తే ఎక్కువ లాభాలు గడించవచ్చని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అటవీ ఉత్పత్తులతో పాటు తేనే, చింత, ఉసిరి లాంటి పంటలపై కూడా ప్రోత్సాహం అందించాలని రైతులు కోరుతున్నారు.
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం
జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉద్యాన పంటలపై అవగాహన కల్పిస్తున్నాం.నీటి వసతి ఉన్న రైతులు ఉద్యాన పంటలకు ముందుకు వస్తే 40 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. చాలా ప్రాంతాల్లో ఆయిల్ పాం, అంజీర్, డ్రాగన్, అరటి తోట, బొప్పాయి లాంటి పంటలు రైతులు వేస్తున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏ రైతులైన సబ్సిడీతో ప్రోత్సహిస్తున్నాం. ఉద్యాన పంటలతో అధిక లాభాలు గడించవచ్చు. అంతర్ పంటలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఉద్యాన పంటలతో అధిక లాభాలు, కంటిన్యూగా లాభాలు పొందవచ్చని అవగాహన కల్పిస్తున్నాం. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు ఉండడం వల్ల అధిక విస్తీర్ణంలో సాగుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఆసక్తి గల రైతులకు ప్రోత్సాహం అందిస్తాం.
-హార్టికల్చర్, సెరికల్చర్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నర్యయ్య(ఆదిలాబాద్)