నిర్మల్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో వసతి సౌకర్యాన్ని పొందుతున్న విద్యార్థులు చలితో గజగజ వణుకుతున్నారు. పది రోజుల నుంచి చతి తీవ్రత అధికం కావడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఉదయం, సాయంత్రం చలి అధికంగా ఉండడం, హాస్టళ్లలో హీటర్లు ఉండకపోవడంతో వేడినీరు దొరకడం లేదు. దీంతో మూడు, నాలుగు రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం వేడినీళ్ల స్నానానికి హీటర్లు, గీజర్ల వంటి ఇతర సౌకర్యాలు కల్పించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హీటర్లు ఏర్పాటు చేయలేదనే విమర్శలు ఉన్నాయి. వేడినీళ్లు లేకపోవడంతో చన్నీటితో స్నానం చేస్తూ దగ్గు, జలుబు, జ్వరాల బారిన పడుతున్నారు. అలాగే మరికొందరు గజ్జి, తామర వంటి అంటువ్యాధుల బారిన పడుతున్నారు. హాస్టళ్లలో వేడినీళ్ల సదుపాయం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహిస్తుండడం సర్వత్రా విమర్శలకు తావిస్తున్నది.
అరకొరగా దుప్పట్ల పంపిణీ
యేటా విద్యా సంవత్సరం ప్రారంభంలోనే హాస్టల్ విద్యార్థులందరికీ దుప్పట్లు పంపిణీ చేయాలి. అయితే రెండేళ్లుగా దుప్పట్ల పంపిణీ నామమాత్రంగా సాగుతున్నదన్న విమర్శలు ఉన్నాయి. అరకొరగా దుప్పట్లు పం పిణీ చేసి చేతులు దులుపుకుంటున్నట్లు ఆరోపణలు ఉ న్నాయి. దుప్పట్లు లేని కారణంగా విద్యార్థులు చలిలోనే పడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అలాగే చాలా హాస్టళ్లలో తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరుకోవడంతో చలిలోనే నిద్రిస్తున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పూర్తిస్థాయిలో కార్పెట్లు, బెడ్షీట్లు పంపిణీ చేస్తేనే చలి బాధలు తప్పే అవకాశం ఉంది. దుప్పట్లు పంపిణీ చేయాలని గతేడాది నుంచి కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు. బీసీ హాస్టళ్లలో దుప్పట్లు కొంత వరకు వచ్చినప్పటికీ, ఎస్సీ హాస్టళ్లలో పంపిణీ ప్రక్రియ టెండర్ దశలోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చలి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల కోసం వేడినీళ్ల సదుపాయంతోపాటు దుప్పట్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు.

హాస్టళ్లలో ఇదీ దుస్థితి
నిర్మల్ జిల్లా పెంబి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి వరకు 135 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇదే మండలంలోని కొసగుట్ట బాలుర ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 158 మంది విద్యను అభ్యసిస్తున్నారు. వీరంతా ఆయా పాఠశాలల్లోనే వసతి పొందుతూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రెండు వసతిగృహాల విద్యార్థులకు ఇప్పటి వరకు ప్రభుత్వం దుప్పట్లు పంపిణీ చేయలేదు. అలాగే వేడినీళ్లు అందుబాటులో లేకపోవడంతో చన్నీటి స్నానాలే చేస్తున్నారు. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ హాస్టళ్లలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వీరికి ప్రభుత్వం సరైన సదుపాయాలు అందించకపోవడంతో చలి తీవ్రతకు గజగజ వణుకుతున్నారు.

రెండు, మూడు రోజులకోసారి స్నానం
మా హాస్టల్ అటవీ ప్రాంతానికి దగ్గరలో ఉండడం వల్ల చలి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వేడినీళ్లు లేకపోవడంతో చల్లని నీటితోనే స్నానం చేస్తున్నం. చలి బాగా ఉన్నప్పుడు చాలా మంది విద్యార్థులు రెండు, మూడు రోజులకోసారి స్నానం చేస్తారు. రోజు స్నానం చేయకపోవడం వల్ల చిన్న పిల్లలకు దురద వస్తున్నది. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి అంటుతున్నది. చలికాలంలో వేడినీళ్లు అందుబాటులో ఉంచాలి.
– జాదవ్ సత్యపాల్, తొమ్మిదో తరగతి, గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల, ఖానాపూర్
పగటి పూట స్నానం చేస్తున్న..
నేను లక్ష్మణచాంద బీసీ హాస్టల్లో ఉంటూ.. ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నా. ఉదయం చలి ఎక్కువగా ఉంటున్నది. స్నానం చేయడానికి ఇక్కడ వేడినీళ్లు లేవు. చన్నీటితో స్నానం చేయాలంటే భయమైతున్నది. అందుకే రెండు రోజులకోసారి పగలు స్నానం చేస్తున్న. చలికాలం అయ్యే వరకు వేడినీళ్లు ఇస్తే బాగుంటుంది.
– వై.యశ్వంత్, విద్యార్థి, బీసీ హాస్టల్, లక్ష్మణచాంద
బెడ్షీట్లు రాలే..
మాది కుభీర్ గ్రామం. నేను ఆరో తరగతిలో ఇక్కడి హాస్టల్లో చేరిన. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న. ఈ సంవత్సరం బెడ్షీట్లు ఇయ్యలేదు. పోయిన సంవత్సరం ఇచ్చిన వాటిని వాడుకుంటున్న. ఈసారి హాస్టల్లో కొత్తగ చేరినోళ్లు ఇంటి నుంచే బెడ్షీట్లు తెచ్చుకున్నరు. స్నానానికి వేడినీళ్లు లేక చాలా ఇబ్బందిగా ఉంది. రోజు పొద్దున బోరునీటితోనే అందరం స్నానాలు చేస్తున్నం. వేడినీటి సదుపాయం కల్పించాలి.
– ఏ.మహేశ్, విద్యార్థి, ఎస్సీ హాస్టల్, నర్సాపూర్(జి)
బడ్జెట్ రాగానే వేడినీటిని అందిస్తాం
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 20 బీసీ హాస్టళ్లలో 1,471 మంది వసతి పొందుతున్నారు. చలికాలంలో స్నానాల కోసం ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. వేడినీటి సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేదు. బడ్జెట్ రాగానే హీటర్లను కొనుగోలు చేసి వేడినీటిని అందిస్తాం. గత జూలైలోనే విద్యార్థులకు అవసరమైన బెడ్షీట్లు అందజేశాం. – శ్రీనివాస్, జిల్లా బీసీ
సంక్షేమ అధికారి, నిర్మల్
జలుబు తగ్గడం లేదు..
రోజు చన్నీతో స్నానం చేయడం వల్ల జలుబు తగ్గడం లేదు. వేడి నీళ్లు లేక ఇక్కడి హాస్టల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నరు. పొద్దున పది గంటల వరకు చలి తగ్గడం లేదు. అలాగే సాయంత్రం ఐదు గంటలు అయిందంటే చలి మొదలవుతున్నది. పదో తరగతి చదివే మాకు స్పెషల్ క్లాసులు పెడుతున్నరు. చలి కారణంగా సక్రమంగా చదువుకోలేకపోతున్నం. సార్లు పట్టించుకొని కనీసం పొద్దున పూట స్నానానికి వేడినీళ్లు అందేలా చూడాలి.
– అభినయ్, విద్యార్థి, బీసీ హాస్టల్, లక్ష్మణచాంద
త్వరలో దుప్పట్లు ఇస్తాం..
జిల్లాలోని ఎస్సీ హాస్టళ్లలో వసతి పొందుతున్న విద్యార్థులకు కార్పెట్లు, బెడ్షీట్లు పంపిణీ చేసేందుకు ఇటీవలే టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలోనే విద్యార్థులందరికీ దుప్పట్లను పంపిణీ చేస్తాం. ఇక వేడినీటికి ఇబ్బందికరంగానే ఉంది. హీటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. చిన్న పిల్లలను దృష్టిలో ఉంచుకొని చలి తీవ్రంగా ఉన్నప్పుడు స్నానాల కోసం నీటిని వేడి చేసి అందించాలని వసతిగృహ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చాం.
– దయానంద్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి, నిర్మల్
గీజర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాం..
ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు చలికాలంలో స్నానాల కోసం పడుతున్న ఇబ్బందుల విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వసతి గృహాల్లో గీజర్ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపాం. కొన్ని హాస్టళ్లలో వాటర్ హీటర్లు ఉన్నప్పటికీ పని చేయడం లేదు. అలాంటి వాటికి మరమ్మతులు చేయించాలి. అటవీ ప్రాంతాలకు దగ్గరలో ఉన్న హాస్టళ్లలో వంట చెరుకు వినియోగించి వేడినీటిని అందించాలని ఆదేశించాం. దాదాపు విద్యార్థులందరికీ బెడ్షీట్లను అందజేశాం. త్వరలోనే బ్లాంకెట్స్ అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
– అంబాజీనాయక్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి, నిర్మల్
