ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రాథమిక విద్య నిర్లక్ష్యానికి గురవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల నిర్వహణను గాలికొదిలేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందక ఆకలితో అలమటిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. కుక్ అండ్ హెల్పర్లకు, సర్వశిక్ష అభియాన్ సిబ్బందికి వేతనాలు రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. కోడిగుడ్ల బిల్లులు నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉండడంతో ఇబ్బందిగా మారింది. పారిశుధ్య నిర్వహణకు నెలకు రూ.10 వేలు ఇస్తానన్న కాంగ్రెస్ సర్కారు మాట తప్పింది. ఉచిత కరెంటు ఇస్తామన్న హామీ కూడా ఉత్తదిగానే మారింది.
సీఎం బ్రేక్‌ఫాస్ట్ అమలు కాకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రీమెట్రిక్ స్కాలర్ షిప్స్ రాకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎదురవుతున్న సమస్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన సమస్యలపై ‘నమస్తే తెలంగాణ’ మంగళవారం బడులను సందర్శించింది. హరీశ్‌రావు లేవనెత్తిన సమస్యలు క్షేత్రస్థాయిలో కనిపించాయి. సమస్యలే లేవని ప్రకటించడంపై విద్యార్థులు, మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సర్వశిక్ష అభియాన్ రిసోర్స్ పర్సన్స్, విద్యార్థులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. వారి మాటల్లోనే అభిప్రాయాలు..
– మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 9(నమస్తే తెలంగాణ)
చింతలమానేపల్లి, జూలై 9 : మండలంలోని బాబాసాగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ ఎంపీపీఎస్ పాఠశాలలో మొత్తం 13 మంది విద్యార్థులున్నారు. ప్రతి రోజూ టీచర్ వస్తున్నప్పటికీ విద్యార్థులు రావడం లేదు. ఈ విషయంపై టీచర్ పీ ప్రియాంకను వివరణ కోరగా బడి ప్రారంభంలో ఇద్దరు, ముగ్గురు హాజరయ్యారని, వారు కూడా కొన్ని రోజులుగా రావడం లేదని తెలిపింది. మధ్యాహ్న భోజనం ప్రారంభించలేదని చెప్పింది. పాఠశాల ఆవరణలో ప్రైవేట్ వ్యక్తులు ఇసుక డంపు ఏర్పాటు చేశారని, ఈ విషయాన్ని కాంప్లెక్స్ హెచ్ఎం జయరాజ్ దృష్టికి తీసుకెళ్లినట్లు ఆమె తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ఈ పాఠశాలలో నిర్మాణ పనులు చేపట్టడం గమనార్హం.
చింతలమానేపల్లి, జూలై 9 : మండలంలోని రవీంద్రనగర్-2 గ్రామంలో జీయూపీఎస్ హిందీ మీడియం పాఠశాల ఉంది. 1 నుంచి 7 తరగతులుండగా 20 మంది విద్యార్థులున్నారు. ఉపాధ్యాయుడు కిశోర్ ఉద్యోగోన్నతిపై వెళ్లారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో 20 మంది విద్యార్థులంతా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు. రెబ్బెన పాఠశాల నుంచి ఉపాధ్యాయుడు సునీల్‌ను డిప్యూటేషన్‌పై వచ్చినప్పటికీ విద్యార్థులు రావడం లేదు.
దండేపల్లి, జూలై 9: దండేపల్లి మండలంలోని కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్లో 42 మంది విద్యార్థులున్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు ఉండగా, ఒకరు ప్రమోషన్‌పై బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఉపాధ్యాయుడు సతీశ్ ఒక్కరే ఉన్నారు. 5 తరగతుల విద్యార్థులను ఒకే గదిలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నాడు. అధికారులు స్పందించి ఉపాధ్యాయులను నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తాండూర్, జూలై 9 : తంగళ్లపల్లి జడ్పీ పాఠశాలలో గత 15 ఏళ్లుగా మధ్యాహ్న భోజనాన్ని వండిపెడుతున్నాను. నెలనెలా బిల్లులు ఇవ్వకపోవడంతో అప్పులు చేయాల్సి వస్తున్నది. సరుకులు ఉద్దెర తెచ్చి పిల్లలకు వంటచేసి పెడుతున్నా. ఆరు నెలలుగా బిల్లులు రావడం లేదు. సరుకుల పైసలు కట్టాలని షావుకారు అంటున్నాడు. అప్పుల భారం, వేతనాలివ్వలేక ఇద్దరు వంట చేసే కార్మికులను బంద్ చేసిన. మూడేళ్లుగా 6 నుంచి 10వ తరగతి వరకు గుడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వేతనాలు పెంచడం ఏమో కానీ జనవరి నుంచి ఇప్పటి వరకు అసలు బిల్లులే ఇవ్వడం లేదు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఒత్తిడి చేస్తున్నారు.
– రామగిరి వరలక్ష్మి, మధ్యాహ్న భోజన కార్మికురాలు, తంగళ్లపల్లి, తాండూర్
తాండూర్, జూలై 9 : గతేడాది అల్పాహారం పథకం ప్రారంభం నుంచి పాఠశాలలో విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందించాలని హెచ్ఎం తెలుపడంతో టిఫిన్ వండి పెట్టాం. అప్పుడు 40 రోజులపాటు ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం విద్యార్థులకు అల్పాహారం అందించాం. ఇప్పటివరకు ఆ బిల్లులు రాలేదు. అందుకే పాఠశాలలో అల్పాహారం ఆపివేశాం. బిల్లులు రాకపోవడంతో అప్పులు తెచ్చి వండి పెట్టడం కష్టంగా ఉంది. మాకు బిల్లులు ఇస్తే వంటలు వండిస్తాం. పెండింగ్ బిల్లులు ఇస్తేనే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని నిర్వహిస్తాం.
– రావుల కౌసల్య, సీఎం బ్రేక్ ఫాస్ట్ కార్మికురాలు, గోపాల్‌నగర్, తాండూర్
దహెగాం, జూలై 9: మాకు మార్చి నెల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు రాలేదు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు సంబంధించి కోడి గుడ్లు, భోజనం బిల్లులు అందలేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. అప్పులు తెచ్చి సరుకులు కొని వండి పెడుతున్నాం. కార్మికులకు వేతనాన్ని రూ.3 వేలకు పెంచినప్పటికీ ప్రస్తుతం రూ.2 వేలే ఇస్తున్నారు. వంట గదిలేక ఇబ్బదులు పడుతున్నాం. ప్రభుత్వం మాకు ప్రతి నెలా బిల్లులు అందించి ఇబ్బందులు తీర్చాలి.
-గురుజాల లక్ష్మి,మధ్యాహ్న భోజన కార్మికురాలు, దహెగాం
దండేపల్లి, జూలై 9: చదువుకునే చిన్నారుల్లో తలెత్తే పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు ప్రారంభించిన సీఎంబ్రేక్ఫాస్ట్ పథకం విద్యార్థులకు మేలు కలిగింది. విద్యార్థుల ఇండ్లల్లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉదయం ఏమీ తినకుండానే పాఠశాలకు వస్తారు. అలాంటి వారికి ఈ పథకం ఉపయోగకరంగా ఉండేది. నిర్వాహకులకు సక్రమంగా నిధులు అందిస్తే ఈ పథకం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
-శ్రీలత, ప్రధానోపాధ్యాయురాలు.
మా పాఠశాలకు రెండు మూడేళ్ల నుంచి మ్యాథ్స్ టీచర్ లేక ఇబ్బంది పడుతున్నాం. వేరే సారు చెబుతున్నప్పటికీ సరిగ్గా అర్థం కావడంలేదు. అలాగే ఇంగ్లిష్, తెలుగు, హిందీ, మ్యాథ్స్ టీచర్లు లేరు. ఇంగ్లిష్ మీడియం తరగతులు నిర్వహించడం లేదు. రోజూ పాఠశాలకు వస్తున్నాం, పోతున్నాం కాని సరైన విద్యాబోధన అందడం లేదు. ఉపాధ్యాయులను నియమించి మెరుగైన విద్యా బోధన అందించాలి.
– అనిల్‌కుమార్, 9వ తరగతి, దహెగాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల