ఆసిఫాబాద్ టౌన్, జూన్ 15 : విత్తనాలు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ మెయిన్ రోడ్డులోని కళావతి విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి తనిఖీ చేశారు. విత్తనాలు, ఎరువుల గోదాం పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కంపెనీ నిర్ణయించిన ధరలకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలని డీలర్లను ఆదేశించారు. అధిక ధరలకు విక్రయిస్తే దుకాణాన్ని సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విత్తనాలు కొనుగోలు చేసిన ఓ రైతును ఎంత ధర పెట్టావని అడుగగా, ఎకువ ధరకు విక్రయిస్తున్నారని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ రసీదుల్లో ఉన్న రైతులకు ఫోన్ చేసి ఎవరెవరికి ఎంత ధరకు విక్రయించారో తెలుసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
ప్రజలకు సురక్షితమైన నీరు అందించేందుకే మిషన్ భగీరథ సర్వే చేపడుతున్నట్లు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం మోతుగూడలో అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి పర్యటించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డ్రైనేజీలను శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజినల్ పంచాయతీ అధికారి ఒమర్ హుస్సేన్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్, మిషన్ భగీరథ సహాయ ఇంజినీర్ శైలేందర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం లో అమ్మ ఆదర్శపాఠశాలల కమిటీ పనులపై ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ తాగునీరు, టాయిలె ట్లు, విద్యుత్, గదుల మరమ్మతుల పనులు సత్వరమే పూర్తిచేయాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పేర్కొన్నారు. తుంపెల్లి ప్రభుత్వ పాఠశాలను అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సందర్శించారు. పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. దుస్తులు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన వసతుల గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని సూచించారు. వర్షాలు కురిసినపుడు పాఠశాల భవనం పై కప్పు ఉరుస్తుందని, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఉపాధ్యాయులు తెలపడంతో కలెక్టర్ వెంటనే స్పందించి డాంబర్ షీట్ ఏర్పాటు చేయించారు.