సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. అధికారులు సర్వే చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. 53,333 దరఖాస్తులు రాగా.. 6,292 మందిని గుర్తించారు. ఇందులో నిర్మల్ నియోజకవర్గంలో 2,594, ముథోల్లో 2,422, ఖానాపూర్లో 1,276 మంది అర్హులను ఎంపిక చేశారు. ఈ పథకంలో భాగంగా సొంత జాగ ఉండి ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలు మూడు విడుతల్లో ఉచితంగా అందించనుంది. 100 శాతం రాయితీతో ఇస్తుండడంతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి.
నిర్మల్ అర్బన్, అక్టోబర్ 12 : పేదల సొంతిటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే నిరుపేద ప్రజలను గుర్తించి కోట్లాది రూపాయల నిధులతో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజక వర్గాల్లో దాదాపు 7 వేల డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలను చేపట్టింది. 80 శాతం మంది నిరుపేద కుటుంబాల కు ఉచితంగా ఇండ్లను పంపిణీ చేశారు. సొంత స్థలం ఉన్న వారికి డబుల్ బెడ్రూం తీసుకోని వారి ఆర్థిక ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం గృహ లక్ష్మి పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్నది. సొంత ఇంటి స్థలం ఉన్న ప్రజలకు రూ.3 లక్షల రుణాన్ని అందిం చనుంది. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం అందించే రూ.3 లక్షల నిధులను 100 శాతం రాయితీతో అందించనుండడంతో పేదల ముఖాల్లో చిరునవ్వులు విరబూస్తున్నాయి. తొలిదశలో జిల్లా వ్యాప్తంగా 53,333 మంది గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకోగా ఇందులో 6292 మంది లబ్ధిదారులను అధికారులు గుర్తించారు.
గృహలఇ్మ పథకానికి నిర్మల్ జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లోని 19 మండలాలకు చెందిన అర్హులను అధికారులు గుర్తించారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా మొత్తం 6292కి లబ్ధి చేకూరనుంది. ఇందులో నిర్మల్ నియోజక వర్గంలో 2594 మంది, ముథోల్ నియోజక వర్గంలో 2422, ఖానాపూర్ నియోజకవర్గంలో 1276 మందిని అర్హులుగా అధికారులు గుర్తించారు.
జిల్లాలోని 6292 మందిని మొదటి జాబితాలో అర్హులుగా గుర్తించి వారికి రూ.3 లక్షలు అందిం చనున్నారు. మొదటి దశ పునాది పూర్తయిన తర్వాత రూ. లక్ష, రెండో దశలో పైకప్పు సమయంలో మరో లక్ష, ఇల్లు పూర్తయిన తర్వాత మరో లక్ష ఇలా మూడు విడుతల్లో లబ్ధిదారుల ఖాతాలో జమచే యనున్నారు.