నిర్మల్ అర్బన్, జనవరి 5 : విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో ముఖ్యమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మ ల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభోత్సవానికి గురువారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వల న చేసి, పతాకాన్ని ఆవిష్కరించి పోటీలను ప్రా రంభించారు. ముందుగా ఎన్సీసీ విద్యార్థులు, ఆయా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి కాలంలో విద్యార్థులు అన్ని రంగాల్లో ఆరితేరాలన్నారు. చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలు ఎంతో ముఖ్యమన్నారు. ప్రభుత్వం క్రీడా రంగం అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నదని పేర్కొన్నారు. ఇటీవలే ప్రభు త్వం క్రీడల నిర్వహణ కోసం నిధులను విడుదల చేసిందని గుర్తు చేశారు.
నిర్మల్ జిల్లా క్రీడాకారులకు కొలువైందని, ఎందరో మంది క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించారని తెలిపారు. క్రీడల్లో రాణిస్తే విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ సదుపాయం ఉంటుందన్నారు. ప్రైవేట్ పాఠశాలలు చదువులపైనే దృష్టి సారించకుండా విద్యార్థులకు ఇలాంటి జిల్లా స్థాయి క్రీడలు నిర్వహించడం అభినందనీయ మని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలు నిర్వహిస్తున్న ట్రస్మా సంఘాన్ని అభినందించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన క్రీడా పోటీల్లో 35 టీం లు పాల్గొన్నాయి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల వారీగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి శుక్రవారం ముగింపు సందర్భం గా బహుమతులు అందజేయనున్నారు. కాగా, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ, కౌన్సిలర్ సలీం, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రావు, కార్యదర్శి గంగన్న, కోశాధికారి వినోద్, పట్టణాధ్యక్షుడు చంద్రాగౌడ్, సెక్రటరీ పద్మనాభ గౌడ్, ఉపాధ్యక్షుడు మంచిరాల నాగభూషణ్, జిల్లా క్రీడల సెక్రటరీ మొయినొద్దీన్, సాయన్న, పేటా అధ్యక్షుడు భూక్యా రమేశ్, భోజన్న, ఆయా పాఠశాల కరస్పాండెంట్లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.