ఆదిలాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. 62 వేల ఎకరాల్లో సాగు కాగా.. పంట చేతికొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పంట దెబ్బతినగా.. రైతు లు నష్టపోవాల్సి వచ్చింది. కాత దశలో ఉండగా వర్షాల వల్ల పంట నల్లగా మారడంతోపాటు మొలకలు వచ్చాయి. దీంతో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్లు రావాల్సిన దిగుబడి 5 నుంచి 6 క్వింటాళ్లు వచ్చాయి. వారం రోజుల నుంచి వర్షాలు పడకపోవడం, ఎండలు కొడుతుండడంతో కోతలు ప్రారంభమయ్యాయి. చాలా గ్రామాల్లో సోయా తీసిన రైతులు చేలలోనే సోయా కుప్పలు పోసి కాపలా కాస్తున్నారు. వర్షం వస్తే పంట తడిసిపోకుండా, పశువులు తినకుండా అక్కడే కాపల ఉంటున్నారు. ఇండ్లలో సోయా నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో చేలలో కుప్పలు పోసి కాపలా కాస్తున్నామన్ని రైతులు వాపోతున్నారు.
కొనేది ఎప్పుడో?
రైతులు కష్టపడి సాగు చేసిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేయడానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దిగుబడి ప్రారంభం కాక ముందే అధికారులు ప్రణాళికలు తయారు చేసి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేవారు. రైతులు రెండు సీజన్లలో సాగు చేసిన సోయా, కందులు, జొన్నలు, శనగ పంటలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడ చూసిన చేలలో సోయా నిల్వలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఈ ఏడాది సోయా మద్దతు ధ ర క్వింటాలుకు రూ.5,328 ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు క్వింటాలుకు రూ.4,300 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంటను అమ్మి క్విం టాలుకు రూ.1000 చొప్పున నష్టపోతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాల లేకపోవడంతో సోయాబిన్ కొనుగోళ్లు ప్రారంభించలేదని అధికారులు అంటున్నారు. ఈ ఏ డాది అధిక వర్షాల కారణంగా పెట్టుబడి పెరగడంతోపాటు దిగుబడులు తగ్గాయని, ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయకపోతే నష్టపోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు.