ఆదిలాబాద్ జిల్లాలో జొన్నలు విక్రయించేందుకు మార్కెట్‌యార్డుల్లో పడిగాపులు కాస్తూ రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎప్పుడు కొంటారోనని మండుటెండలో నిరీక్షిస్తున్నారు. మరో వైపు అకాల వర్షంతో చేతికి వచ్చిన పంటను కాపాడుకోడానికి తిప్పలు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో జొన్నల కొనుగోళ్లు మరింత జాప్యమవుతుందని విమర్శలు వస్తున్నాయి.
ఆదిలాబాద్, మే 2 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో యాసంగిలో రైతులు 1.12 లక్షల ఎకరాల్లో జొన్న పంటను సాగు చేయగా ఎకరాకు 15 నుంచి 20 క్వింటాళ్ల దిగుబడులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం జొన్నలకు మద్దతు ధర క్వింటాకు రూ.3371 ప్రకటించగా, వారం రోజుల కిందట జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా పంట కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఎకరాకు 14 క్వింటాళ్ల చొప్పున పంటను కొనుగోలు చేస్తున్నారు. పంట దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో అన్నదాతలు గంపెడాశతో పంటను విక్రయించేందుకు మార్కెట్‌యార్డుకు పెద్ద మొత్తంలో జొన్నలను తీసుకువస్తున్నారు. పంట రాశులతో మార్కెట్‌యార్డులు కళకళలాడుతున్నాయి. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.
గ్రామాల వారీగా ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం పంటను కొనుగోలు చేస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు రైతులు ఒక రోజు ముందుగానే పంటను ట్రాక్టర్లలో నింపి తీసుకువస్తున్నారు. సాయంత్రం సమయంలో తీసుకువచ్చిన పంటను విక్రయించాలంటే మరుసటి రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీంతో రాత్రి మార్కెట్‌యార్డుల్లోనే నిద్రిస్తున్నారు. తమ పంటను కాంటా వేయాలని పీఏసీఎస్ సిబ్బంది చుట్టూ తిరగాల్సి వస్తుంది. మార్కెట్‌యార్డులో షెడ్లు జొన్నలతో నిండిపోవడంతో కింద పోస్తున్నారు. దీంతో అకాల వర్షంతో ఆందోళన చెందుతున్నారు. పంట కొనాలని కొనుగోలు కేంద్రాల సిబ్బందిని అడిగితే ఆన్లైన్, ఇతర సమస్యలు చెబుతూ జాప్యం చేస్తున్నారని రైతులు అంటున్నారు. పంటను కొను0గోలు చేసేంత వరకు షెడ్ల కింద ఎండ వేడిని తట్టుకుంటూ పడిగాపులు కాస్తున్నారు. పట్టాదారు మార్కెట్‌యార్డుకు తప్పనిసరిగా రావాలని పీఏసీఎస్ సిబ్బంది సూచిస్తుండడంతో వృద్ధ రైతులు, మహిళలు తిండి, తిప్పలు లేక అవస్థలు పడుతున్నారు. పంట కొనుగోళ్లను పర్యవేక్షించి వేగవంతం చేయాలని మార్కెటింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు అంటున్నారు.
ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటను విక్ర యించాలంటే అష్టక ష్టాలు పడాల్సి వస్తుంది. నేను 3.5 ఎకరాల్లో జొన్న పం టను సాగు చేయగా 50 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చింది. మా గ్రామంలోని పంటను శుక్రవారం కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో గురువారం సాయంత్రం ట్రాక్టర్లో ఆదిలాబాద్ మార్కెట్‌యా ర్డుకు తీసుకువచ్చాను. మధ్యాహ్నం 12.30 దాటినా పీఏసీఎస్ సిబ్బంది నాణ్యత పరిశీలించి, పాసింగ్ చేయడం లేదు. పంటను కొనాలని రైతులు వేడుకున్నా పట్టించుకోవడం లేదు. షెడ్లలో వరుస క్రమంలో పంటను పాసింగ్ చేయాల్సి ఉండగా అలా చేయడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పంట కొనుగోళ్లను పకడ్బం దీగా నిర్వహించారు రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పంటను విక్రయించి మద్దతు ధర పొందారు.
– భూమన్న, రైతు, అంకోలి, ఆదిలాబాద్ రూరల్ మండలం
రైతులు స్వయంగా పండించిన జొన్నలు అమ్మాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. కొనుగోలు కేంద్రాల పీఏసీఎస్ సిబ్బంది కాంటాకు రాయమని అడిగితే పట్టాపాసు పుస్తకం పరిశీలించి వంద ప్రశ్నలు అడుగుతున్నారు. పంట మీరు పండించారా..? కొన్నారా? సాగునీటి సౌకర్యం ఉందా? బోర్ ఉందా? ఎన్ని నాజళ్లుతో నీళ్లు పెట్టారు? అని ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. పట్టాదారు తప్పనిసరిగా ఉండాలని షరతు విధిస్తున్నారు. మండుటెండలో వృద్ధ రైతులు, మహిళా రైతులు మార్కెట్‌యార్డులో వేడికి తట్టుకోలేక సతమతమవుతున్నారు. పాసింగ్ రాయాలని చుట్టూ తిరుగుతున్నా కనీసం స్పందించడం లేదు. షెడ్లలో జాగా లేకపోగా కింద పోస్తే కొనుగోలు చేయమంటూ ఇబ్బంది పెడుతున్నారు. జొన్న కొనుగోళ్లను వెంటవెంటనే పూర్తి చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి.
-రవి. రైతు, తలమడుగు