ఆదిలాబాద్, మే 20(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో జొన్న రైతులకు తిప్పలు తప్పడం లేదు. పంట అమ్మకానికి వచ్చిన రైతులు రోజుల తరబడి మార్కెట్ యార్డులోనే ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పంటను సేకరించిన జొన్న సంచులను గోదాముల్లోకి తరలించడంలో జాప్యం జరుగుతున్నది. సంచులను లారీల్లో లోడ్ చేసేంత వరకు కొనుగోలు కేంద్రాల సిబ్బంది పట్టీలు ఇవ్వకపోవడంతో రైతులు పంట వద్ద రాత్రి, పగలు పడిగాపులు కాస్తున్నారు.
అధికారులు మంచినీరు, టెంట్లు ఏర్పాటు చేసినా ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పంట సంచులపై సేద తీరుతున్నారు. మార్కెట్ యార్డులోని సంచులను తరలించడంలో లారీలు రాకపోవడంతోపాటు లోడ్ చేసే హమాలీల కొరత కారణంగా సరుకును తరలించడంలో జాప్యం జరుగుతున్నది. మార్కెట్ యార్డులో 50 వేల సంచులు ఉండగా.. రోజు ఐదు వేల సంచులను తరలిస్తున్నారని రైతులు అంటున్నారు. తమ పంటను ఎప్పుడు లోడ్ చేస్తారని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడిగితే హమాలీల కొరత కారణంగా తాము ఏమి చేయలేమని సమాధానం ఇస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొమ్మిది రోజులుగా కాపలా..
ఆదిలాబాద్ రూరల్ మండలంలోని లాండసాంగ్వికి చెందిన రైతు విఠల్ ఎకరంన్నరలో జొన్న సాగు చేశాడు. 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంటను మద్దతు ధరతో విక్రయించడానికి గత మంగళవారం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చాడు. రెండు రోజుల తర్వాత పంటను కాంటా వేసి సంచుల్లో నింపినా కొనుగోళ్లకు సంబంధించిన పట్టీ ఇవ్వకపోవడంతో రైతు విఠల్ తొమ్మిది రోజులుగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులోని పంట వద్ద కాపలాగా ఉంటున్నాడు. గతంలో తాము పంట అమ్మినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడలేదని, ఒకటి, రెండు రోజుల్లో అమ్మిపోయేవారమని తెలిపారు. ఉన్న కొద్ది పంటను ప్రైవేటులో అమ్మకుందామంటే రూ.2 వేలకు క్వింటాలు ధర ఇస్తున్నారని తెలిపారు. నష్టపోకుండా మార్క్‌ఫెడ్‌కు అమ్మి తిప్పలు పడుతున్నానని విఠల్ రైతు తెలిపాడు.

ఐదారు లారీలు వస్తున్నాయి..
ఆదిలాబాద్ ఎడ్ల మార్కెట్లో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన 50 వేల క్వింటాళ్ల సంచులు ఉన్నాయి. రోజు ఐదారు లారీలు వస్తుండగా, పది మంది బీహార్ హమాలీలు లోడ్ చేస్తున్నారు. లారీలను ఎక్కువ పంపడంతోపాటు జిల్లాలో సివిల్ సప్లయ్, సీడబ్ల్యూసీ, ఎరువుల ర్యాక్‌లు లోడింగ్ చేసే హమాలీలను అధికారులు ఇక్కడికి పంపిస్తే సంచుల రవాణ తొందరగా జరుగుతుంది. నేను మూడెకరాల్లో జొన్న సాగు చేయగా 40 క్వింటాళ్లను తీసుకొచ్చా. నేను వచ్చి తొమ్మిది రోజులు అవుతుంది. పంటను కాంటా చేసినా లోడ్ చేసేంత వరకు ఉంటేనే కొనుగోలుకు సంబంధించిన పట్టీలు ఇస్తామంటున్నారు. దీంతో చేసేదేమీ లేక పంట లోడ్ అయ్యేంత వరకు ఉంటున్నా.
– మత్తి వెంకటేశ్, రైతు, లాండసాంగ్వి, ఆదిలాబాద్ రూరల్ మండలం
నత్తనడక కొనుగోళ్లు
ఉట్నూర్ రూరల్, మే 20 : నేను పదెకరాల్లో వరి సాగు చేశా. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చా. కానీ.. అధికారల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఒక పక్క వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తేమ శాతం పెరగడం వల్ల ఆరబెట్టడం తలకు మించిన భారంగా మారింది. గన్నీ సంచులు కొరత, లారీల కొరతతో కొనుగోళ్లు మందకోడిగా సాగుతున్నాయి. వర్షాలు ఉన్నాయని తెలిసిన అధికారులు తొందరపాటు చర్యలు లేకపోవడం వల్ల ఇలా వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోతున్నారు. ఇప్పటికైన రైతులకు ఇబ్బంది కలుగకుండా పూర్తి ఏర్పాట్లు చేసి కొనుగోళ్లు వేగవంతం చేయాలి.
-జాదవ్ జితేందర్, రైతు, ఉట్నూర్.