నా పేరు ఠాక్రే నిర్మల. మాది ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని డోప్తాల. నేను మా గ్రామంలోని మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉన్నా. అభయహస్తం పథకం కింద 2009 సంవత్సరం నుంచి ఏడేండ్లు యేడాదికి రూ.365 చొప్పున పైసలు కట్టిన. అప్పుడు మీరు కట్టిన పైసలకు వడ్డీతో కలిపి వస్తాయని అధికారులు చెప్పిన్రు. పైసల్ కట్టుడు బందై ఆరేండ్లు అయితంది. ఇగ పైసలు రావనుకున్నా. గిప్పుడు తెలంగాణ సర్కారు పైసలిస్తమని ప్రకటించడం ఆనందంగా ఉంది.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు కానుక అందించనుంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభయహస్తం కో కంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్-2009 పేరిట మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఒక్కో సభ్యురాలు యేడాదికి రూ.365 చొప్పున చెల్లించగా.. ఈ డబ్బుల కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సర్కారు నిర్ణయంతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,81,540 మందికి ప్రయోజనం చేకూరనుండగా రూ.30 కోట్ల వరకు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమకానున్నట్లు అధికారులు తెలిపారు. – ఆదిలాబాద్, మార్చి 5(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఆదిలాబాద్, మార్చి 5 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ప్రత్యేక రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తున్నది. మహిళల రక్షణకు సైతం పకడ్బందీ చర్య లు తీసుకుంటున్నది. పలు ప్రభుత్వ పథకాలను కు టుంబాల్లోని మహిళల పేరిట అందజేయడం, పేద మహిళల స్వయం ఉపాధిలో భాగంగా ఆర్థిక సాయం అందజేస్తున్నది. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని బ్యాంకు రుణాలను అందించి అండగా నిలుస్తున్నది. సర్కారు తీసుకుంటున్న చర్యలు మహిళలు వారి కుటుంబాలను పోషించుకునేందుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభు త్వం మరో కానుక ప్రకటించింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ‘అభయహస్తం కో-కంట్రిబ్యూటరీ పెన్షన్ యాక్ట్-2009’ పేరిట మహిళా సంఘాల సభ్యులు చెల్లించిన డబ్బులను తెలంగాణ ప్రభుత్వం వారికి తిరిగి ఇవ్వనున్నది.
సర్కారు నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 1,81,540 మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఇందులో భాగంగా రూ.30 కోట్ల వరకు మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నట్లు అధికారులు తెలిపారు. ఆభయహస్తం పథకంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 39,951 మంది, నిర్మల్ జిల్లాలో 46,345 మంది, కుమ్రంభీ ఆసిఫాబాద్ జిల్లాలో 37,073 మంది, మంచిర్యాల జిల్లాలో 58,171 మంది చొప్పున డబ్బులు చెల్లించారు. ఏటా రూ.365 చొప్పున వీరు డబ్బులు కట్టారు. దాదాపు ఏడేండ్లుగా తాము చెల్లించిన డబ్బుల కోసం మహిళా సంఘాల సభ్యులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సర్కారు నిర్ణయంతో వీరికి డబ్బులు అందనుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
నేను డోప్తాల మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉన్నా. మేము ప్రతి నెలా గ్రూపులో పైసలు జమ చేసుకుంటాం. మా అవసరాలకు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని తిరిగి చెల్లిస్తాం. ఆభయహస్తం పింఛన్‌కోసం నేను ఆరేండ్లు డబ్బులు కట్టిన. కట్టిన పైసలు వడ్డీతో సహా వస్తాయని గ్రూపు లీడర్లు, సార్లు చెప్పిన్రు. డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నా. సర్కారు మా డబ్బులను ఇస్తామనడం మాలాంటి పేదోళ్లకు ఎంతో ఉపయోగం.
-బుర్రెవార్ రుక్మాబాయి, డోప్తాల, బేల, బేల మండలం
నిర్మల్ టౌన్, మార్చి 5: కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్‌ను మొదట రూ.1016 ఇచ్చింది. ఇప్పుడేమో రూ.2016 ఇస్తున్నరు. మహిళా సంఘాలకు గ్రేడింగ్ నిర్వహించి బ్యాంకుల ద్వారా వడ్డీ లేని రుణాలతో పాటు స్త్రీనిధి కింద లోన్లు ఇస్తున్నరు. గతంలో లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగితే వాళ్లు ఇచ్చినంతే తీసుకునేది. ఇప్పుడు బ్యాంకులోల్లే ఎంత అడిగితే అంత ఇస్తున్నరు. మహిళా సంఘాలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. అభయహస్తం కింద దరఖాస్తు చేసుకున్న అప్పటి ప్రభుత్వం పింఛన్‌పై నిర్ణయం తీసుకోలేదు. పదేండ్ల నుంచి డబ్బులు అట్లనే ఉండే. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తిరిగి ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. – గంగవ్వ, నిర్మల్
నిర్మల్ టౌన్, మార్చి 5 : మాది నిర్మల్ మండలంలోని అనంతపేట గ్రామం. మా ఊర్లె మహాలక్ష్మీ మహిళా సంఘాన్ని 20 ఏళ్ల కింద ఏర్పాటు చేసుకున్నాం. 2010లో అభయహస్తం కింద రూ.365 చెల్లిస్తే 60 ఏండ్లు నిండిన తర్వాత పింఛన్ ఇస్తామని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఈ సంఘంలో 15 మంది మహిళా సభ్యులం బీమా కట్టినం. అభయహస్తం పింఛన్ రాలేదు కానీ ఆసరా పింఛన్ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.2016 ఇస్తున్నది. ఇప్పుడు మంత్రి హరీశ్‌రావు అభయహస్తం కింద జమచేసిన డబ్బులను తిరిగి ఇస్తామని ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది.
– మాదస్తు రాజుబాయి, అనంతపేట్
జైనథ్, మార్చి 5: 2009లో అభయహస్తం డబ్బులు చెల్లించిన. ఆ డబ్బులు తిరిగి మాకు ఇస్తామని మంత్రి హరీశ్ రావు సారు చెప్పిండ్రు. వారికి ధన్యవాదాలు. నేను సంవత్సరానికి రూ.365 చొప్పున మొత్తం రూ.4వేలు చెల్లించిన. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న. డబ్బులు తిరిగి ఇయ్యడం ఆనందంగా ఉంది.
– కొడిశెర్ల రాధ, ఆనంద్‌పూర్, జైనథ్
జైనథ్, మార్చి 5: అభయహస్తం డబ్బులకోసం ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్నం. తెలంగాణ సర్కారు ఆ డబ్బులను తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తమని ప్రకటించడం ఆనందంగా ఉంది. నేను గతంలో రూ.4వేలు చెల్లించిన. తిరిగి మా డబ్బులు మాకు ఇవ్వడం ఆనందంగా ఉంది. ఆ డబ్బులు మాకు అక్కరకొస్తాయి.
– కాటిపెల్లి రామక్క, కూర, జైనథ్ మండలం