ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(నమస్తే తెలంగాణ) : సచివాలయం ఎదుట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిగిస్తామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి క్షీరాభిషేకం చేశారు. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. తెలంగాణ తల్లి ఉండాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం తెలంగాణ ఆస్తిత్వా న్ని తాకట్టు పెట్టే చర్యగా అభివర్ణించారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2010 డిసెంబరు 10న అప్పటి కేంద్ర మంత్రి చిదంబరం తెలంగాణ ఏర్పాటుకు సానుకూలం గా ప్రకటన చేశారని, సోనియాగాంధీ ఆదేశాల మేరకు డిసెంబరు 23న ఆ ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో వందలాది మంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారని, యువత బలిదానాలకు రాజీవ్‌గాంధీ కుటుంబం కారణమన్నారు. ఇలాంటి నాయకుని విగ్రహం సచివాలయం ఎదుట పెట్టడం సిగ్గుమాలిన చర్యలగా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టకుండా అవమానపరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రోకండ్ల రమేశ్, యూనిస్ అక్బానీ, మెట్టు ప్రహ్లాద్, విజ్జగిరి నారాయణ, జహురొద్దీన్, పురుషోత్తం, ఆసీఫ్, స్వప్న పాల్గొన్నారు.
బోథ్, సెప్టెంబర్ 17 : మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ తల్లి చిత్రపటానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పాలాభిషేకం చేశారు. జాతీయ జెండా ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ సువిశాలమైన భారతదేశంలో అంతర్భాగంగా మారిందని, రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన పొందిందని, అందుకే గత ప్రభుత్వం జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించిందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంతగా పక్షం రోజులపాటు బీఆర్ఎస్ ప్రభుత్వం భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ కన్వీనర్ డి.నారాయణ రెడ్డి, సురేందర్ యాదవ్, శ్రీధర్‌రెడ్డి, సదానందం, రమణగౌడ్, తాహెర్ బిన్ సలాం, తదితరులు పాల్గొన్నారు.