జైపూర్, ఫిబ్రవరి 13 : ఉద్యోగులంతా సంస్థ నిర్దేశిత లక్ష్యాలను అధిగమించాలని సింగరేణి సీఅండ్ఎండీ బలరాంనాయక్ పేర్కొన్నారు. గురువారం శ్రీరాంపూర్ డివిజన్లోని ఇందారం ఓపెన్‌కాస్టు గనిని డైరెక్టర్ ఆపరేషన్స్ వెంకటేశ్వర్లు, శ్రీరాంపూర్ జీఎం సూర్యనారాయణతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. సిబ్బంది ఎనిమిది గంటలు పని చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ఆర్థిక సంవత్సరం 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి దిశగా ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సూచించారు. ఐకే 1ఏ గని జీవితకాలం మరో 20 ఏళ్లు పెరిగిందని, కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో వార్షిక లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు.
సింగరేణి సంస్థలో ఉద్యోగంలో చేరిన వారంతా ఐదేళ్లు భూగర్భ గనిలో పనిచేయాలని తెలిపారు. క్యాంటీన్ కార్మికులతో కలిసి టిఫిన్ చేస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఐకే 1ఏ గనిలో మ్యాన్ రైడింగ్ సిస్టం సమస్యతో లోపలికి, బయటకు రావడానికి ఆలస్యమవుతుందని, పరిష్కరించాలని కార్మికులు విన్నవించుకున్నారు. ఇందుకు ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలిచ్చారు. అనంతరం కార్మికులతో రక్షణ ప్రతిజ చేయించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జీఎం శ్రీనివాస్, ఏఐటీయూసీ ప్రధానకార్యదర్శి రాజ్‌కుమార్, బ్రాంచ్ సెక్రటరీ బాజీసైదా, ప్రాజెక్టు అధికారి ఏవీ రెడ్డి, మేనేజర్లు రవికుమార్, నాగన్న, రక్షణ అధికారి సతీశ్, యూనియన్ నాయకులు మోత్కూరి కొమురయ్య, చంద్రమోహన్, శ్రీకాంత్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు.
అర్ధరాత్రి పర్యటించిన సీఎండీ
రెబ్బెన, ఫిబ్రవరి 13 : బెల్లంపల్లి ఏరియాలో గోలేటి సీహెచ్‌పీ, ఖైర్గూడ ఓసీపీల్లో బుధవారం అర్ధరాత్రి సింగరేణి సీఅండ్ఎండీ బలరాంనాయక్ పర్యటించారు. ముందుగా గోలేటి సీహెచ్‌పీని పరిశీలించి పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఖైర్గూడ ఓసీపీలో పర్యటించి రక్షణ చర్యలు, యంత్రాల వినియోగం, ఉత్పత్తిని పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. బెల్లంపల్లి ఏరియాకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించాలని సూచించారు. ఉత్పత్తి, పెంచాలని, రక్షణకు మొదటి ప్రాధన్యత ఇవ్వాలని, యంత్రాల పనిగంటలు పెంచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్లు ఎల్వీ సూర్యనారాయణ(ఆపరేషన్స్), కే.వెంకటేశ్వర్లు (ప్లానింగ్ అండ్ ప్రాజెక్టులు), ఏరియా జీఎం శ్రీనివాస్, ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా ఎస్వోటూ జీఎం రాజమల్లు, పీవో నరేందర్ తదతరులు ఉన్నారు.