నార్నూర్,ఫిబ్రవరి17: దళితబంధు పథకం అమలులో నార్నూర్, గాదిగూడ మండలాలు రాష్ర్టానికే ఆదర్శంగా నిలువాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆకాంక్షించారు. ఉమ్మడి మండలంలోని ఖడ్కి ఎస్సీగూడ, గంగాపూర్‌లో కలెక్టర్ గురువారం పర్యటించారు. మొదటి విడుతలో ఎంపిక చేసిన లబ్ధిదారులతో దళితబంధు పథకం అమలు తీరుపై చర్చించారు. ఆసిఫాబాద్ నియోజకవర్గం గాదిగూడలోని ఖడ్కి ఎస్సీగూడలో-11 మంది, నార్నూర్‌లోని గంగాపూర్‌లో 12మందిని ఎంపిక చేశామని తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున అందించనున్నట్లు తెలిపారు. ఆ డబ్బులతో చేపట్టే వ్యాపారాలు, ఏర్పాటు చేసే ఉపాధి యూనిట్లపై లబ్ధిదారులతో చర్చించారు. లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో గణపతి, తహసీల్దార్లు దుర్వా లక్ష్మణ్, ఆర్కా మోతీరామ్, గాదిగూడ ఎంపీడీవో రామేశ్వర్, ఎంపీవో స్వప్నశీల, ఏపీఎంలు రమేశ్, మాధవి, ఖడ్కి సర్పంచ్ సీతాబాయి, గంగాపూర్ సర్పంచ్ యుర్వేత రూప్‌దేవ్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, కనక ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి రమేశ్, లబ్ధిదారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపల్లి సర్పంచ్ గోవింద్ నాయక్ కలెక్టర్‌కు పలు సమస్యలు విన్నవించారు. సంబంధితశాఖ అధికారులతో మాట్లాడి పరిష్కారిస్తామని కలెక్టర్ చెప్పారని గోవింద్ నాయక్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లాలో దళిత బంధు పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. దళిత బంధు పథకం అమలుపై జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దళితుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నదన్నారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గంలో వంద మంది చొప్పున లబ్ధిదారులను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో 271 మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. లబ్ధిదారుడు తన వ్యాపారానికి లేదా యూనిట్‌కు రూ.9.90 లక్షలు ఉపయోగించుకోవచ్చన్నారు. రూ.10వేలు దళిత రక్షణ నిధి కింద ప్రత్యేక ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఏ యూనిట్ ను స్థాపిస్తే లాభం చేకూరుతుందో లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. యూనిట్ల ఎంపికలో లబ్ధిదారులకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, వారికి అనుభవం ఉన్న ఉన్న రంగాల్లో యూనిట్లు నెలకొల్పేందుకు తోడ్పాటు అందించాలన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శంకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆశా కుమారి, యువజన సంక్షేమ శాఖ అధికారి వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.