చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు లావణ్య. ఈమెది ఆసిఫాబాద్ మండలంలోని బోరుగూడ గ్రామం. జ్వరం రావడంతో సోమవారం ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. వైద్యుడికి చూపించుకోగా.. మూడు రకాల మందులు రాసిచ్చాడు. ప్రిస్కిప్షన్ తీసుకుని ఫార్మసీ వద్దకు వెళ్తే ఇందులో రెండు రకాల మందులు లేవు. ఒక రకం మాత్రమే ఉన్నాయని ఇచ్చాడు.
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/మంచిర్యాల అర్బన్, జూలై 15 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన, మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో మందులు దొరకడం లేదు. వర్షాలు కురుస్తుండడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. సాధారణ జ్వరం, జలుబు, దగ్గుతోపాటు మలేరియా, టైఫాయిడ్, డెంగీ వంటి వ్యాధులు వస్తుండడంతో ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. వైద్యులు పరీక్షించి మందులు రాసిస్తుండగా.. ప్రభుత్వ మందుల దుకాణాల్లో దొరుకడం లేదు. చేసేదేమి లేక రోగులు డబ్బులు పెట్టుకుని ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేస్తున్నారు. అన్ని రోగాలకు ఒకటే మందు అన్నట్లుగా పారాసిటమాల్ వంటి మందులతోనే సరిపెడుతున్నారు. పూర్తిస్థాయిలో మందులు అందుబాటులో ఉంచడం లేదు.
జిల్లా కేంద్రంలోని మందుల దుకాణంలో మందులు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి పర్యవేక్షులు చెబుతున్నారు. మరి రోగులకు బయట నుంచి మందులు తెచ్చుకోవాలి ఎందుకు సూచిస్తున్నారని ప్రశ్నిస్తే.. మందులు అయిపోయాయని సమాధానం ఇస్తున్నారు. ఈ విషయమై ఆసిఫాబాద్ దవాఖాన సూపరింటెండెంట్ చిన్న కేశవరావును సంప్రదించగా.. జిల్లా కేంద్రంలోని దవాఖానలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉన్నాయని తెలిపాడు. అలాగే.. మంచిర్యాల ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ హరీశ్చంద్రారెడ్డిని అడుగగా.. ఆదిలాబాద్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి ప్రతి నెల జీజీహెచ్‌కు మందులు వస్తున్నాయి. ప్రస్తుతానికి డైక్లోఫెనాక్ మాత్రమే కొరత ఉంది. దీనిని బయటి నుంచి కొనుగోలు చేసి రోగులకు అందిస్తున్నాం.
చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు సుష్మిత. ఈమెది మంచిర్యాల జిల్లాలోని జన్నారం. తన పాపకు ముక్కులో పుండ్లు కావడంతో మంచిర్యాలలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌కు సోమవారం తీసుకొచ్చింది. పరీక్షలు చేసిన వైద్యులు మందులు రాసిచ్చారు. చీటీ తీసుకుని మందుల కౌంటర్ వద్దకు వెళ్తే కొన్ని మాత్రమే ఉన్నాయి. మరికొన్ని లేవని చెప్పారు. లేని మందులను బయటకొంటే దాదాపు రూ.500లకుపైగా అవుతాయన్నారు. ప్రభుత్వ దవాఖాన అన్నట్లే కని మందులు దొరుకకపోతే ఏం లాభం అని ఆవేదన చెందుతున్నది.
చిత్రంలో కనిపిస్తున్న బాలిక పేరు వినత్రయ. ఈమెది ఆసిఫాబాద్ మండలంలోని బోరుగూడ గ్రామం. జ్వరం, జలుబు కావడంతో సోమవారం దవాఖానకు వచ్చింది. డాక్టర్ పరీక్షించి మందులు రాసిచ్చాడు. దవాఖాన ఆవరణలో ఉన్న మందుల దుకాణం వద్దకు వెళ్తే ఇందులో రాసిచ్చిన మందులు అందుబాటులో లేవని సిబ్బంది చెప్పారు. వీటిని బయట మందుల దుకాణంలో తీసుకోవాలని సూచించారు.