తెలంగాణ రాష్ట్ర ప్రదాత, సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రెండో రోజైన బుధవారం రక్తదాన శిబిరాలు కొనసాగాయి. జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతి నిధులు, నాయకులు, అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. చెన్నూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, జోగు రామన్న శిబిరాలు నిర్వహించగా.. వేలాది మంది యువకులు, అభిమానులు రక్తదానం చేశారు. ముథోల్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, రేఖానాయక్ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కోటపల్లి మండ లంలో పచ్చని పొలాల మధ్య ‘జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ సార్’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. కాగజ్‌నగర్ పట్టణంలో దివ్యాంగులు మొక్కలు నాటారు. కాగా.. నేటి కార్యక్రమాల కోసం టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా రెండో రోజైన బుధవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అలాగే అన్నదానం, పండ్ల పంపిణీ, మొక్కలు నాటడం కూడా కొనసాగింది. ఆదిలాబాద్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న, నిర్మల్ జిల్లా భైంసా, బాసర మండలం కిర్గుల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, మథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్‌రెడ్డి పాల్గొన్నారు. నిర్మల్‌లో కూడా టీఆర్ఎస్ నాయకులు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎఫ్సీఏ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రారంభించారు. చెన్నూర్ నియోజకవర్గంలోని మందమర్రిలోని సీఆర్ఆర్ క్లబ్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కూడా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పాల్గొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలోని సింగరేణి ఏరియా హాస్పిటల్లో నిర్వహించిన రక్తదాన శిబిరంలో కూడా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చి రక్తదానం చేశారు. నేడు సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మొక్కలు నాటడం, గిఫ్ట్ ఏ స్మైల్ కార్యాక్రమాలు నిర్వహించనున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బంధన్ ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. 200 మంది రక్తదానం చేశారు.
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామంలో టీఆర్ఎస్ యువ నాయకుడు గారె రమేశ్ ఆధ్వర్యంలో మహిళలు పచ్చని పొలాల మధ్య వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. రైతున్న సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తున్న కేసీఆర్‌కు ‘జన్మదిన శుభాకాంక్షలు కేసీఆర్ సార్’ అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. చైతన్య దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని బాలభారతి పాఠశాలలో 30 మొక్కలు నాటి సీఎం కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.