Bellampally | బెల్లంపల్లి : పంటల సాగులో నాణ్యమైన విత్తనం పాత్రను గుర్తించి నాణ్యమైన విత్తనం – రైతన్నకు నేస్తం అనే వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ కోట హరికృష్ణ తెలిపారు. ఇందులో భాగంగా ఎంపిక చేయబడిన ముగ్గురు నుంచి ఐదుగురు అభ్యుదయ రైతులకు వ్యవసాయ పరిశోధన స్థానాల నుంచి ఉత్పత్తి చేయబడిన నాణ్యమైన విత్తనాలను పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేయబడిన రైతులకు విత్తనోత్పత్తిపై ఎప్పటికప్పుడు వ్యవసాయ శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు ఇస్తారని వెల్లడించారు. నాణ్యమైన విత్తనాన్ని రైతులు సాగు చేసి తదుపరి పంట ద్వారా ఉత్పత్తి అయిన విత్తనాన్ని తోటి రైతులకు తక్కువ ధరలకు అందజేయాలని తెలిపారు. రానున్న రెండు, మూడేండ్లలో ప్రతి గ్రామాన విత్తన స్వయం సమృద్ధి సాధించమే కాకుండా తెలంగాణ రాష్ట్రం విత్తన భద్రతలో దేశంలోనే మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలన్నదే కార్యక్రమం ఆశయమని వివరించారు. ఈ కార్యక్రమానికి రైతులు సహకరించాలని కోరారు.