మంచిర్యాల, స్టాఫ్ ఫొటోగ్రాఫర్ : ఏదో భూ సమస్య ఉందని ఓ వృద్ధురాలు కొన్ని రోజులుగా మంచిర్యాల కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణికి వస్తున్నది. అధికారులు ఆమెకు వివరణ ఇచ్చి పంపినా.. అర్థం కాకనో.. లేక సమస్య తీరకనో నిత్యం ఫిర్యాదు చేసేందుకు వస్తూ ఉంటుంది. ఈ క్రమంలో సోమవారం కూడా వచ్చింది.
కలెక్టర్‌ను కలిసేందుకు వెళ్లగా, అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వృద్ధురాలు అని కూడా చూడకుండా పక్కకు నెట్టుకెళ్లారు. ఆమెను తీసుకురావాల్సిన మహిళా కానిస్టేబుళ్లు అక్కడే ఉన్నా చోద్యం చూస్తూ ఉండిపోయారు. ఈ ఘటనపై అక్కడున్న వారు విమర్శలు గుప్పించారు. సమస్య చెప్పుకోడానికి వచ్చే వారిపట్ల వ్యవహరించే తీరు ఇలాగేనా అంటూ అసహనం వ్యక్తం చేశారు.