నస్పూర్, జూలై 30 : అర్హులైన రైతులందరికీ రెండో విడుత రుణమాఫీని ప్రణాళికాబద్ధంగా అమలు చేసిన ట్లు మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మం గళవారం రెండో విడుత రుణమాఫీ నిధుల విడుదల సందర్భంగా కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి కల్పన, డీఆర్డీవో కిషన్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, వివిధ శాఖల అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రుణమాఫీ రెండో విడుతలో రూ.లక్ష నుంచి 1.50 లక్షల వ రకు రుణ మాఫీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
జిల్లాలో రెండో విడుతలో 14104 మంది రైతులకు రూ.138,46, 56,254 అందించినట్లు తెలిపా రు. మొదటి విడుతలో 28727 మంది రైతులకు రూ. 151,27,19,35ను వారి ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. రైతుల సందేహాలు, సమస్యలపై కంట్రోల్ రూమ్ 08736-250501 ఏర్పాటు చేసినట్లు తెలిపా రు. బ్యాంకు అధికారులు, సిబ్బంది రైతుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని ఆదేశించారు. అనంతరం ఇద్దరు రైతులకు రుణమాఫీ చెక్కులను అందించారు.
ప్రణాళికాబద్ధంగా రుణమాఫీ..
-ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జూలై 30 :రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత రుణమాఫీ పథకాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నట్లు కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ శాసనమండలి ప్రాంగణం నుంచి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులతో కలిసి రెండో విడుత రైతు రుణమాఫీ పథకం నిధులను వర్చువల్ విధానం ద్వారా విడుదల చేసిన నేపథ్యంలో కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రాజేశ్వర్ జ్యోషితో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2వ విడుతలో రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణం మాఫీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా 14,623 మంది రైతులకు రూ.153,34,94379 కోట్లను వారి ఖాతాలు జమ చేస్తామని తెలిపారు. రుణమాఫీలో ఏవైనా సమస్యలుంటే కలెక్టరేట్లోని ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లేదా మండల వ్యవసాయ అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు. రైతులకు బ్యాంకు అధికారులు ఇబ్బంది కలిగించవద్దని ఆదేశించారు. అనంతరం రూ.153 కోట్లు రుణమాఫీ చెకును అధికారులతో కలిసి ఆవిషరించి ఐదుగురు రైతులకు రుణమాఫీ చెకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.