కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ఎలాంటి భయం లేకుండా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తమ ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలించవద్దని అడ్డుకుంటున్న గ్రామస్తులపై సైతం దాడులకు తెగబడుతున్నారు. అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ వ్యాపారులు బెదరడం లేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు ఇసుక రవాణాను అడ్డుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల చింతలమానేపల్లి మండలం రుద్రాపూర్ సమీపంలోని వాగులో నుంచి రాత్రి జేసీబీలతో ఇసుక ట్రాక్టర్లలో నింపి తరలిస్తుండగా గ్రామానికి చెందిన దుర్గం సుగుణాకర్, మోర్బె బాపురావు, కొట్రంగి శ్రీనివాస్, పెరుగు లక్ష్మణ్ పోలీసులకు తెలిపినా స్పందించలేదు. దీంతో 100 నంబర్‌కు డయల్ చేసి ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని 6 ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఫిర్యాదు చేసిన నలుగురిపై పోలీసుల ఎదుటే ఇసుక అక్రమ రవాణాదారులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్లో ఇటీవల అధికారులు 235 ట్రిప్పులు ఇసుక డంపులను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. కొద్ది రోజుల ముందు రెబ్బెనలో దాదాపు 300 ట్రిప్పుల ఇసుక డంప్‌ని సీజ్ చేశారు. రెబ్బెన మండలంలోని గంగాపూర్ వాగు, కాగజ్‌నగర్ మండలంలోని రస్పల్లి వాగు, పెద్దవాగుల నుంచి, చింతలమానేపల్లి, పెంచికల్పేట్ మండలాల్లోని వాగుల నుంచి నిరంతరం ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. ఈ వాగుల్లో దొరికే నాణ్యమైన ఇసుక అక్రమ రవాణాదారులకు వరంగా మారింది.
ఇక్కడి నుంచి పట్టణ ప్రాంతాలకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రోజుకు వందల టన్నుల ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నది. రెబ్బెన మండలంలోని లక్ష్మీపూర్, గంగాపూర్ వాగుల్లో జేసీబీల ద్వారా ట్రాక్టర్లలో ఇసుకను లోడ్‌చేసి తెచ్చి ఇసుకను డంప్ చేస్తున్నారు. గతేడాది ట్రాక్టర్ ఇసుక రూ.1200 నుంచి రూ.1500 వరకు ఉండగా ఇప్పుడు రూ.2 వేల వరకు విక్రయిస్తున్నారు. వాగుల్లో నుంచి తెచ్చి డంప్‌లుగా పోసిన ఇసుకను హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు లారీల్లో ఇసుకను తరలిస్తున్నారు. ఒక లారీ ఇసుక లోడ్‌కు లక్ష రూపాయలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తున్నది. లోకల్‌గా జరిగే నిర్మాణాలకు ట్రాక్టర్ల ద్వారా నేరుగా ఇసుక తరలిస్తున్నారు.
రాజకీయ నాయకుల అండదండలు ఉన్న కొంత మంది వ్యాపారులు ఇసుకను అక్రమంగా తరలించడమే దందాగా మార్చుకున్నారు. స్థానిక అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తుండడంతో ఇసుక రవాణాకు ఎలాంటి అడ్డూ అదుపులేకుండా సాగుతున్నది. కొద్ది రోజులుగా టాస్క్‌ఫోర్స్ అధికారులు, మైనింగ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నా అక్రమార్కులు బెదరడం లేదు. ఇసుక డంపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి సమయాల్లో ఇతర ప్రాంతాలకు లారీలు, తదితర వాహనాల్లో ఇసుక తరలిస్తున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను ఆపాలని, ఇసుక మాఫీయా ఆగడాలను అడ్డుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.