మంచిర్యాల, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : “మేం అధికారంలోకి వస్తే రుణమాఫీ రూ.2 లక్షలు చేస్తం. రైతుబంధు ఎకరాకు రూ.15 వేలు ఇస్తం.. బ్యాంకుకు వెళ్లి రూ.2 లక్షలు ఇప్పుడే తెచ్చుకోండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న మాఫీ చేస్తం..” అని కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికలకు ముందు గొప్పలు చెప్పుకున్నరు. అధికారంలోకి వచ్చి యేడాది గడిచినా పూర్తిస్థాయిలో రుణమాఫీ, రైతు భరోసా ఇవ్వలేదని రైతులు మండిపడుతున్నారు. కొందరికి మాఫీ అయితే మరికొందరికి సాంకేతిక కారణాలు చూపుతూ చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు రైతులను బురిడీ కొట్టించేందుకు రైతు భరోసా పేరిట కొత్త నాటకానికి తెరలేపిందని రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. రైతు భరోసా విధివిధానాలపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ అని పెట్టి అసలు విధివిధానాలే రూపొందించలేదని చెప్పడం కాంగ్రెస్ సర్కార్కే చెల్లుతుందన్నారు. రెండు సీజన్లు పెట్టుబడి సాయం ఊసెత్తని సర్కారు.. ఇప్పుడు ఉన్నఫలంగా సంక్రాంతికి రైతు భరోసా ఇస్తుందంటే నమ్మశక్యంగా లేదని వాపోతున్నారు.
అసెంబ్లీలో రైతుభరోసా చర్చ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటలను బట్టి చూస్తే రైతుభరోసా అందరికీ ఇవ్వరనేది స్పష్టంగా తెలిసిపోతుందని రైతులు వాపోతున్నారు. రుణమాఫీకి పెట్టినట్లే కొర్రీలు పెట్టి సగం మంది రైతులకే పెట్టుబడి సాయం అందించేందుకు కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇచ్చిన హామీ మేరకు ఎకరానికి రూ.15వేల చొప్పున రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.
బీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ హయాంలో ఏడాదికి రూ.15 వేల కోట్ల చొప్పున రూ.72,816 కోట్లు రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాంగ్రెస్ వచ్చాక రెండు సీజన్లుగా రైతుబంధు ఊసేలేదని వాపోతున్నారు. అసెంబ్లీలో మాట్లాడేప్పుడు అసలు ప్రభుత్వం ఏం విధివిధానాలు అనుకుంటుందో చెప్పకుండా.. కేవలం గత ప్రభుత్వాన్ని విమర్శించడంపైనే సీఎం దృష్టి సారించడం ఏంటని మండిపడుతున్నారు. గతంలో రైతుబంధు రాని రైతు లేడని, అదే తరహాలో కాంగ్రెస్ సర్కార్ కూడా రైతులందరికీ రైతుభరోసా ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.
చెన్నూర్ రూరల్, డిసెంబర్ 21 : ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రైతు భరోసా అందించాలి. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ప్రధానంగా ఎకరాకు రూ. 15 వేలు ఇస్తామని చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. ఇకనైనా రైతు భరోసాను అమలు చేసి ఆదుకోవాలి.
– కాళేశ్వరం సమ్మగౌడ్, కొమ్మెర రైతు
నిర్మల్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను నిలువునా ముంచింది. ఏ ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయడం లేదు. ముఖ్యంగా రైతుబంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయాన్ని చేస్తామని ఎన్నికలకు ముందు చెప్పారు. కానీ.. అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా రైతు భరోసాను అమలు చేయలేదు. గత వానకాలం పెట్టుబడి సాయాన్ని ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది. ఇప్పుడు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి రైతు భరోసా అమలు కోసం విధివిధానాలను రూపొందిస్తున్నామంటూ కాలయాపన చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఇలాంటి ఆంక్షలు పెడతామని చెప్పలేదు కదా. కేవలం రైతులను మభ్య పెట్టేందుకే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పని చేస్తున్నది. వచ్చే సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ.. రైతులకు నమ్మకం కలగడం లేదు. ఒకవేళ ఇస్తే రైతులందరికీ ఇస్తారా? కొందరికే ఇస్తారా? స్పష్టత ఇవ్వాలి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లు ప్రతి రైతుకు పెట్టుబడి సాయాన్ని అందజేయాలి. గత వానకాలం సీజన్‌తోపాటు ప్రస్తుత యాసంగికి సంబంధించి రెండు సీజన్ల పెట్టుబడి సాయాన్ని సంక్రాంతిలోపు ఇచ్చి రైతులందరిని ఆదుకోవాలి.
– సునారికారి రాజేశ్, సీపీఐ(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు, ఖానాపూర్.