కాసిపేట, అక్టోబర్ 7 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలోని సోమగూడెం, కాసిపేట మధ్య ఉన్న కాస్త రోడ్డును నాశనం చేశారని వాహనదారులు మండి పడుతున్నారు. ఈ మేరకు పలువురు ఆటో, ఇతర వాహనదారులు రోడ్డు పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై రోడ్డు ఇలా తయారు చేయడం పట్ల తీవ్ర విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. కాసిపేట, సోమగూడెం దారి మధ్య రోడ్డు భారీ గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా తయారైంది. ఇటీవల ఆ రోడ్డుపై మొరం లేదా ఇతర మరమ్మత్తులు చేయాల్సి ఉండగా అతి తెలివితో ఫ్లైయాష్ దుబ్బ తీసుకువచ్చి గుంతలలో పోశారు. గతంలో కనీసం గుంతలలో నుంచైనా వాహనాలు వెళ్లేవని, దుబ్బ పోయడంతో ఆసలు రాకపోకలు లేకుండా బురదతో జారుతూ నానా కష్టాలు పడుతున్నామని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షం పడితే బురద తయారై దిగపడడం, జారడం, వర్షం తగ్గి ఎండినాక దుబ్బ లేసి మొహమంతా ఫ్రీ మేకప్ పౌడర్ వేసుకున్నట్లుగా దుబ్బ మీద పడుతుందని సోషల్ మీడియాలో పెట్టారు. ఈ రోడ్డుతో ఇప్పటికే ప్రమాదాలు పెరిగాయయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ బాధలు వివరిస్తూ వీడియోను సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయింది. అందరూ వారికి మద్దతుగా కామెంట్లు పెడుతూ రోడ్డు పరిస్థితిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేయాలని వాహనదారులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.