నిర్మల్ టౌన్, జూలై 22: నిర్మల్ జిల్లాలో ఆయా రైస్‌మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యం సీఎంఆర్‌ను నిర్ణీత గడువులో గా ఎఫ్‌సీఐకి అందించాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ సమీకృత భవనంలో రైస్‌మిల్లర్లు, ఎఫ్‌సీఐ, సివిల్‌సప్లయ్ అధికారులతో సీఎంఆర్ బియ్యం సేకరణపై శనివారం సమీక్ష నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్ కేటాయింపులు, బియ్యం సేకరణ, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సరిపోయేంత గోదాములు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గోదాముల్లో కూలీల కొరత కారణంగా సీఎంఆర్ బియ్యం ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నదని రైస్‌మిల్లర్లు పేర్కొన్నారు. 2023 ఖరీఫ్, రబీకి సీజన్‌కు సంబంధించిన 2.12లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉందని గుర్తుచేశారు. మిల్లర్లు పౌర సరఫరాలశాఖకు సహకరించాలని, లేకుంటే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్వో తనూజ, డీఎం శ్రీకళ, రైస్‌మిల్లర్లు పాల్గొన్నారు.
సేవలే గుర్తుంటాయి..
అధికారులు ప్రజలకు చేసిన సేవలే చిరస్థాయిగా గుర్తించుకుంటారని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో నిర్మల్ జిల్లా రెవెన్యూ కలెక్టర్‌గా పనిచేసి బదిలీపై వెళ్తున్న రాంబాబు, నిర్మల్ ఆర్డీవో స్రవంతికి వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. వీరిద్దరినీ శాలువాతో సత్కరించి, మెమోంటోలను అందించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో లోకేశ్, డీఆర్డీవో విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి దేవేందర్‌రెడ్డి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్, పంచాయతీరాజ్ ఏఈ శంకరయ్య, జిల్లా అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ఒకరు ఖమ్మంకు..మరొకరు ఆదిలాబాద్‌కు..
అదనపు కలెక్టర్ రాంబాబు భద్రాచలం, నిర్మల్ ఆర్డీవోగా విధులు నిర్వర్తించిన ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. అయితే ఆమె స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ఆర్డీవో స్రవంతి గతంలో జిల్లాలోనే తహసీల్దార్‌గా, మైనార్టీ సంక్షేమశాఖ, శిశు సంక్షేమశాఖ, డిప్యూటీ కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.
స్వర్ణ ప్రాజెక్టు సందర్శన
సారంగాపూర్, జూలై 22: మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు జలాశయాన్ని శనివారం జిల్లా కలెక్టర్ వరుణ్‌రెడ్డి సందర్శించారు.ప్రాజెక్ట్ పూర్తి వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద ఎక్కువైతే వెంటనే చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం భారీ వర్షాలకు దెబ్బతిన్న బండరేవు తండా రోడ్డును కలెక్టర్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. రోడ్డు చాలా వరకు దెబ్బతినడంతో ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు అందజేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ ఈఈ రామారావు, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, తహసీల్దార్ సంతోష్‌రెడ్డి, ఎంపీడీవో సరోజ, ఇరిగేషన్ జేఈ దేవేందర్, పంచాయతీరాజ్ ఏఈ శరత్ , తదితరులున్నారు.
ఓటరుగా నమోదు చేయాలి
సోన్, జూలై 22: జిల్లాలో 18 ఏళ్లు నిండిన వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయాలని కలెక్టర్ వరుణ్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి గ్రామంలో ఈవీఎంలతో ఓటు హక్కు వినియోగంపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బూత్ లెవల్ అధికారులు ప్రత్యేక వాహనాలతో ఇంటింటికీ వెళ్లి ప్రచా రం చేస్తారని, గ్రామాల్లో 18 ఏళ్లు నిండిన యువతీయువకుల ను గుర్తించి ఓటరుగా నమోదు చేయాలన్నారు. రెండు నెలల పాటు జిల్లాలోని ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తా మని తెలిపారు. నిర్మల్ రూరల్ తహసీల్దార్ ప్రభాకర్, సర్పంచ్ అల్లోల రవీందర్‌రెడ్డి, ఆర్ఐ మోహన్, తదితరులున్నారు.