మంచిర్యాల, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవ సభను పండుగలా నిర్వహిస్తామని, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పిలుపునిచ్చారు. నియోజకవర్గానికి మూడు వేల మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలను సభకు తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సోమవారం మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో నిర్వహించిన రజతోత్సవ సభ సన్నాహక సమావేశాల్లో ఆయన మాట్లాడారు. చంద్రబాబు, బీజేపీ డైరెక్షన్లోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. చంద్రబాబు మెప్పుకోసమే గోదావరి, కృష్ణా నదీ జలాలను ఏపీకి తరలిస్తున్నారని, గోదావరి, ప్రాణహిత నీళ్లను ఏపీకి తరలించేందుకే మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్‌కు మరమ్మతు చేయడం లేదంటూ మండిపడ్డారు.
కేంద్రంలో బడా బాయ్, తెలంగాణలో చోటా బా య్ ఇద్దరూ ఆంధ్రాబాయ్ చంద్రబాబుతో కలిసి తెలంగాణను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని బీజేపీ లీడర్లకు కాంగ్రెస్ సర్కారు ఆగడాలు ఎందుకు కనిపించడం లేదో ఆలోచించాలన్నారు. ఆనాడు ప్ర పంచ బ్యాంకు ఏజెంటుగా మారిన చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రాంతానికి తీరని నష్టం కలిగేలా నిర్ణయాలు తీసుకుంటున్న తరుణంలో కేసీఆర్ టీ(బీ)ఆర్ఎస్ను స్థాపించి.. 14 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేసి.. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించారని కొనియాడారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచిందన్నారు. 2001కు ముందు రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో ఎలాంటి దుస్థితి ఉండేనో, ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక అలాంటి దారుణమైన పరిస్థితులే తెలంగాణలో ఉన్నాయన్నారు. పచ్చబడ్డ తెలంగాణలో నేడు పంట పొలాలు ఎండిపోతున్నాయని, పట్టించుకున్నోడు లేడని మండిపడ్డారు. నీరులేక పంటలను మూగ జీవాలకు మేతగా వదిలేసే దుస్థితి నెలకొందన్నారు.
రుణమాఫీ పూర్తిగా కాలేదని, రైతుబంధు రాలేదని, కల్యాణలక్ష్మి రూ. లక్ష, తులం బంగారానికి దిక్కులేదని, నాలుగు వేల పింఛన్ రాలేదన్నారు. ఆరు గ్యారెంటీల అమలులో సర్కారు పూర్తిగా విఫలమైపోయిందన్నారు. రాజీవ్ యువ వికాసం కేవలం కాంగ్రెస్ పార్టీ లీడర్ల జేబులు నింపే కార్యక్రమమే అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తున్నదని, ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే ఉంటామన్నారు. లగచర్ల భూములు గుంజుకునేందుకు లంబాడాలను చిత్రహింసలు పెట్టారని, హెచ్‌సీయూలో 400 ఎకరాలు కబ్జా చేసేందుకు విద్యార్థులపై లాఠీ చార్జీ చేశారని, హైడ్రా పేరుతో పేదల ఇండ్లు కూల్చేశారని మండిపడ్డారు. వీటన్నింటిపై బీఆర్ఎస్ చేసిన పోరాటంతో సర్కారు వెనక్కి తగ్గిందన్నారు.
మంచిర్యాలలో లా అండ్ఆర్డర్ విఫలం
మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 7 : మంచిర్యాలలో గడిచిన 15 నెలల్లో దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని, ఈ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉన్నదని, ఇక్కడ లాఅండ్ఆర్డర్ విఫలమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన అసెంబ్లీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
రజతోత్సవ సభలో కాంగ్రెస్ ఆరుగ్యారెంటీల అమలుపై ప్రశ్నిస్తామని, అలాగే బీజేపీ రాష్ర్టానికి చేస్తున్న అన్యాయాలపై నిలదీసి మరో పోరాటానికి కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారని తెలిపారు. కొత్తగా వచ్చిన సీపీ మంచిర్యాలలో జరుగుతున్న ఆగడాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాడులు, కేసులకు భయపడేది లేదని, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. కొందరు వ్యక్తులు పనిగట్టుకుని బాల్క సుమన్ ఇక్కడి నుంచి పోటీచేయడని, వేరే ప్రాంతానికి వెళ్లిపోతాడని దుష్ప్రచారం చేస్తున్నారని, తాను చెన్నూరు నుంచే బరిలో ఉంటానని స్పష్టం చేశారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ 15 నెలల్లోనే ఏ ప్రభుత్వంపై రానంత వ్యతిరేకత కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే వచ్చిందని, కాంగ్రెస్ వద్దు, బీఆర్ఎస్సే ముద్దు అని ప్రజలు అంటున్నారన్నారు. దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులు అధికమయ్యాయని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని విశృంఖలంగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
పోలీసు వ్యవస్థ కిమ్మనకుండా ఉండడం సరికాదని, ఇంతటి భయానక పరిస్థితులకు సైతం ఎదురొడ్డి నిలుస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో ఇక్కడ జరుగుతున్న అరాచకాలన్నింటినీ డైరీలో రాసుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు పెంట రాజయ్య, నల్మాసు కాంతయ్య, డీసీసీబీ మాజీ చైర్మన్లు తిప్పని లింగయ్య, శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు విజిత్‌రావు, గోగుల రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, సందెల వెంకటేశ్, గాదెసత్యం, అంకం నరేశ్, తోట తిరుపతి పాల్గొన్నారు.
45 వేల ఉద్యోగాలేవీ?
చెన్నూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే వివేక్ ఇచ్చిన హామీలు ఏమైపోయాయని క్యాతన్‌పల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహాక సభలో బాల్క సుమన్ ప్రశ్నించారు. 45 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఒక్కటైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. పెద్ద ఇండస్ట్రీ, మైనింగ్ యూనివర్సిటీ, సెమీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, మండలానికో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇవన్నీ ఏమైపోయాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో నెల రోజులకు ఒక మంత్రి చెన్నూర్‌కు వచ్చి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు ఒక్క మంత్రి కూడా రావడం లేదన్నారు.
అభివృద్ధి పనులతో కళకళలాడిన చెన్నూర్ నేడు అనాథైపోయిందన్నారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నేను తెచ్చిన నిధులతో ఇప్పుడు ఎమ్మెల్యే వివేక్ శంకుస్థాపనలు చేసుకుంటూ తిరుగుతున్నారు తప్పితే.. ఒక్క రూపాయి కూడా లాభం చేయలేదన్నారు. మంత్రిపదవి కోసం తిరుగుతూ జనాలను పట్టించుకోవడమే మర్చిపోయారన్నారు. చెన్నూర్‌లో ఇసుక దందా అంటూ నాపై ఆరోపణలు చేశారని, అసత్యాలతో జనాలను మోసం చేశారని మండిపడ్డారు.
అప్పుడు ఇసుక దందా నడిస్తే.. మరి ఇప్పుడు ఎందుకు లారీలు, క్వారీలు బంద్ కావడం లేదో వివేక్ చెప్పాలన్నారు. కొత్త పనులు తేకపోగా బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన పనులను క్యాన్సిల్ చేయించడం దుర్మార్గమన్నారు. నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించే చెన్నూర్ లిఫ్ట్‌ను ఎందుకు పక్కన పెట్టారో చెప్పాలన్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్దే అధికారం అన్నారు. సర్కార్‌ను ప్రశ్నించే బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా యువకులపై అక్రమ కేసులు పెడుతున్నారని బాల్క సుమన్ అన్నారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజా రమేశ్, పట్టణ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్ గౌడ్, మందమర్రి పట్టణ అధ్యక్షుడు రవీందర్, నాయకులు బడికెల సంపత్‌కుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కేసులకు భయపడేది లేదు
బెల్లంపల్లి, ఏప్రిల్ 7 : కాంగ్రెస్ బారి నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకోవడానికి కదం తొక్కాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసీ ఏరియాలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన జరిగిన రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మూడు వేల మంది నాయకులు, కార్యకర్తలను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
మేలో సభ్యత్వ నమోదు, జూన్‌లో కమిటీల ఏర్పాటు, జూలైలో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బీఆర్ఎస్ క్యాడర్‌కు కేసులు కొత్తేమీ కాదని, భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా పోలీస్ వ్యవస్థ పని చేయాలని సూచించారు.
ఇకనైనా మారాలని, లేదంటే మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుకుని రామగుండం కమిషనరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, ఏడు మండలాల అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, టీబీజీకేఎస్ నాయకులు వెంకటరమణ, బడికల రమేశ్ పాల్గొన్నారు.