ఆదిలాబాద్, జూలై 18(నమస్తే తెలంగాణ) ః రైతులకు 24 గంటల కరెంటును రద్దు చేసి, మూడు గంటలు మాత్రమే పంపిణీ ఇస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావ్, రేఖానాయక్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి, బోథ్ నియోజకవర్గంలోని గుడిహత్నూర్, ఖానాపూర్ నియోజకవర్గంలోని సిరికొండ మండలం లక్ష్మీపూర్‌లో రైతుసభలు నిర్వహించగా.. ఎమ్మెల్యేలు పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. ఆయా చోట్ల రైతు సభల్లో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బినామీగా వ్యవహరిస్తున్న రేవంత్ రైతులపై కుట్రలు చేస్తున్నారని, ఆయన క్షమాపణ చెప్పే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు. రైతులు భారీ సంఖ్యలో హాజరై రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు.
రైతులపై అక్కసుతోనే విషం చిమ్ముతున్నాడు.. : ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతులపై అక్కసుతోనే విషం చిమ్ముతున్నాడని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలిలో నిర్వహించిన రైతు వేదికలో పాల్గొని మాట్లాడారు. మూడు గంటల కరెంటు పంపిణీ చేస్తామన్న రేవంత్‌రెడ్డి రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు గ్రామాల్లో పర్యటించినప్పుడు కరెంటు సరఫరా విషయంలో వారి విధానం తెలిపేంత వరకు నిలదీయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు బినామీ, ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పగ్గాలు అప్పగించారని పేర్కొన్నారు. రేవంత్ వ్యాఖ్యలను బీజేపీ నాయకులు ఖండించక పోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని, తెలంగాణ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.