మంచిర్యాల, జూలై 25(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దశాబ్దాలపాటు పోడు భూములు సాగు చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూసిన గిరిజన, ఆదివాసీ రైతుల ఆకాంక్షలను కేసీఆర్ సర్కారు నెరవేర్చింది. దేశంలో మరే రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులకు పట్టాలు ఇచ్చారు. ఆదివాసీ, గిరిజన ప్రజలు ఎక్కువగా ఉండే అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 31,026 మంది రైతులకు 85,398 ఎకరాలకు పట్టాలిచ్చారు. 2023 జూన్‌లో రైతులకు పట్టాలు అందాయి. ఆ వెంటనే రైతుబంధు కూడా రైతుల ఖాతాల్లో జమైంది. కానీ.. పోడు రైతుల్లో ఆ సంతోషం ఎన్నో రోజులు మిగల లేదు. రెండేళ్లు తిరక్క ముందే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు పోడు పట్టాలున్న రైతులను సాగు చేయకుండా అడ్డుకుంటున్నారు.
మంచిర్యాల జిల్లాలో మంత్రి వివేక్ నియోజకవర్గమైన చెన్నూర్‌లో కోటపల్లి మండలంలోని నక్కలపల్లి రైతులు ఈ ఏడాది పంట వేయలేదు. ఈ గ్రామంలో దాదాపు 40 మంది రైతులకు రెండెకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు పోడు పట్టాలు వచ్చాయి. అప్పటి నుంచి ఎలాంటి భయం లేకుండా సాగు చేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. ఈ ఏడాది ఫారెస్ట్ అధికారులు సాగు చేయనివ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ట్రాక్టర్లు పెట్టి భూములు దున్నేందుకు అనుమతి ఇవ్వడం లేదని, ఎండ్లబండ్లతో దున్నుకోమని చెప్తున్నారు. ట్రాక్టర్ల యాజమానులకు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు. బండ్లను సీజ్ చేస్తారన్న భయంతో ఎవ్వరూ పోడు భూములు దున్నడానికి రావడం లేదు. ఎడ్లులేవు, బండ్లు లేవు.. ఎక్కడికి పోయేది అర్థం కాక పత్తి సాగు అదునుదాటిపోయిందని వాపోతున్నారు.
ఇప్పటికైనా అధికారులు దయతలిస్తే నువ్వులైనా పండించుకుంటామంటున్నారు. ఎడ్ల బండ్లు ఉన్న రైతులను అడిగితే ఎంత మందికి ఇవ్వాలంటున్నారని.. ఈ విషయంలో మంత్రి వివేక్ చొరవ తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలంలోని చామనపల్లిలోనూ ఇదే సమస్య ఉంది. 1957లో గత ప్రభుత్వం నుంచి రైతులు పట్టాలు పొందారు. కేసీఆర్ సర్కారు మొన్నటికి మొన్న పోడు పట్టా పాస్‌బుక్‌లు ఇచ్చింది. అటవీశాఖ అధికారులు వారిని భూములు సాగుచేసుకోనివ్వడం లేదు. ఇలా ఈ ఒకటీ, రెండు గ్రామాలనే కాదు.. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా సహా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో పోడు పట్టాలున్నా.. భూములు సాగు చేసుకోలేక రైతులు అవస్థలు పడుతున్నారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. సమస్య పరిష్కారం కాకపోవడంపై రైతులు పెదవి విరుస్తున్నారు.
అటవీ హక్కుల చట్టం-2005 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు కేసీఆర్ సర్కారు పట్టాలను పంపిణీ చేసింది. పోడు భూములను ఎన్నేండ్లుగా సాగు చేసుకుంటున్నారని ఆధారాలను అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేసి సేకరించారు. 2005 సంవత్సరం కంటే ముందు నుంచి సాగులో ఉన్న గిరిజన, ఆదివాసీ రైతుల ఆధారాలు, వివరాలను సేకరించారు. అర్హులైన రైతులను గుర్తించి పట్టాలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల కోసం 24 వేల మంది దరఖాస్తు చేస్తే అర్హులైన 12,222 మందికి పట్టాలిచ్చారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 31,715 దరఖాస్తులకు గిరిజన రైతులు 11,753 మందికి పట్టాలిచ్చారు.
మంచిర్యాల జిల్లాలో 4,503 దరఖాస్తులకు అర్హులుగా ఉన్న 1,847 మందికి, నిర్మల్ జిల్లాకు 5,204 మంది రైతులకు 2023లో కేసీఆర్ ప్రభుత్వం పోడు పట్టాలు పంపిణీ చేసింది. గతంలో సర్వే చేసి మరీ సర్కారుకు నివేదిక అందజేసిన ఫారెస్ట్ అధికారులే ఇప్పుడు రైతులను ఇబ్బందులు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాత, ముత్తాల నుంచి పోడు చేసుకుంటూ వచ్చిన భూములకు రెండేళ్ల క్రితం కేసీఆర్ సర్కారు పట్టాలు ఇచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ మారినంత మాత్రాన మమ్ములను భూములు దున్నుకోనివ్వకపోవడం సరికాదని రైతులు వాపోతున్నారు. మాకు పట్టా ఉన్న భూముల్లో ట్రాక్టర్లు పెట్టి దున్నుకుంటాం.. ఇంకేమైనా చేసుకుంటాం.. అధికారులు వచ్చి ఎడ్లబండ్లతోనే దున్నాలని ఇబ్బందులు పెట్టడం సరికాదంటున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు.
మాకు రెండేళ్ల కింద పోడు పట్టాలి చ్చిన్రు. ఎంతో సంబుర పడ్డం. ట్రాక్టర్లు పెట్టి భూములు దున్నుకోడానికి వీల్లేదని ఫారెస్ట్ అధికారులు అంటున్నరు. ఎండ్ల బండ్ల కోసం ఎక్కడికి పోయేది. అధికారులు హెచ్చరించడంతో ట్రాక్టర్ ఉన్న వాళ్లు దున్నేందుకు రావడం లేదు. వస్తే మా బండ్లు సీజ్ చేత్తరని భయపడుతున్నరు. పట్టా రాక ముందన్న గింతగా ఎవరూ ఇబ్బంది పెట్టలేదు. ఈ ఏడాది వచ్చి పట్టా ఉన్నా ఎందుకు ఇబ్బంది పెడుతున్నరన్నది అర్థం కావడం లేదు. మంత్రి వివేక్ సార్ జర పట్టించుకొని మా భూములు మేము దున్నుకునేలా చూడాలి.
– గుండ్ల రాంచందర్, పోడు రైతు (నక్కలపల్లి)
పత్తి వేద్దాం అనుకున్నం. ఫారెస్టోళ్లు వచ్చి ట్రాక్టర్లు పెట్టి భూములు దున్నడానికి వీల్లేదని చెప్పి అడ్డుకుంటున్నరు. ఇప్పుడు పత్తి కూడా వేసే అవకాశం లేదు. కనీసం నువ్వులైనా వేసుకుందామనుకున్నా భయమైతంది. నాకు రెండెకరాలకు పోడు పట్టా వచ్చింది. హద్దులు పెట్టుకోమని కూడా ఫారెస్టు అధికారులు చెప్తే పెట్టుకున్నం. మా భూములను మమ్ములనే దున్నుకోనివ్వడం లేదు. ఎవుసాన్ని నమ్ముకొని బతికేటోళ్లం. ఇప్పటికైనా మమ్ములను ఇబ్బందులు పెట్టకుండా చూడాలి.
– మేకల ఎల్లక్క, పోడు రైతు (నక్కలపల్లి)