మంచిర్యాల, జనవరి 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రూ. 2 లక్షల లోపు రుణమున్న రైతులందరికీ మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ కొందరికే అవకాశమిచ్చింది. గెలిస్తే రూ.15 వేల రైతు భరోసా ఇస్తామని చెప్పి.. ఇప్పుడేమో రూ.12 వేలే అంటున్నది. ఇలా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలిచ్చి రైతులను బోల్తా కొట్టించిన సర్కారు, ఇక ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జారీలోనూ అడ్డగోలు కొర్రీలు పెట్టి లబ్ధిదారులను తగ్గించాలని చూస్తున్నది. ఎప్పుడో 2014లో రూపొందించిన నిబంధనలే ఇప్పుడు వర్తింపజేయాలనుకుంటుండగా, అనేక మంది అనర్హులుగా మారే అవకాశమున్నది.
పదేళ్లలో కుటుంబ ఆదాయం పెరిగింది
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన గైడ్‌లైన్స్ ప్రకారం.. ఫుడ్ సెక్యూరిటీ (రేషన్) కార్డులకు కుటుంబాల ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించి ఉండకూడదు. 2014లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఈ ఆదాయ పరిమితి (సీలింగ్ లిమిట్)ని నిర్ణయించారు. కానీ ఇప్పుడు దాదాపు పదేళ్లు (2025) పూర్తయ్యాక కూడా ఇంకా 2014 ఉత్తర్వులనే వర్తింప చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్ల క్రితం నెలకు రూ.10 వేలు సంపాదించిన కుటుంబం ఇప్పుడు నెలకు రూ.25 వేలు సంపాదిస్తున్నది. ఈ లెక్కన రేషన్ కార్డు పొందేందుకు అనర్హులవుతారు. ఇక భూముల విషయానికి వస్తే పొలమైతే రెండున్నర ఎకరాలు, ఇతర సాగుభూములైతే ఐదు ఎకరాల్లోపు ఉండాలి. గవర్నమెంట్, ప్రైవేటు, ఔట్సోర్సింగ్, పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులతో పాటు డాక్టర్లు, కాంట్రాక్టర్లు అనర్హులు. గవర్నమెంట్ పింఛన్‌దారులు, ప్రీడమ్ ఫైటర్ పింఛన్‌దారులకు రేషన్ కార్డు రాదు. కారు కలిగి ఉన్న కుటుంబం సైతం రేషన్‌కార్డు పొందేందుకు అర్హులు కారు. మిగిలిన నిబంధనలు ఎలా ఉన్నా ఆదాయ పరిమితిపై 2014 ఉత్తర్వులనే అమలు చేయడంతో వేలాది మంది ఫుడ్ సెక్యూరిటీ కార్డుకు దూరం కానున్నారు.
పింఛన్ వయసు పెంచుతారా..
గతంలో బీఆర్ఎస్ సర్కారు ఆసరా పింఛన్ పొందే వయసును 57 సంవత్సరాలకు కుదించింది. మానవతా దృక్పథంలో ఆలోచించి తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది వృద్ధులు పింఛన్లకు అర్హులయ్యారు. కాగా, ఇప్పుడు రేషన్ కార్డు 65 ఏళ్లలోపు ఉన్న వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇది కూడా 2014లో తీసుకొచ్చిన నిబంధనే. కానీ గత సర్కారు పింఛన్ వయసు 57 ఏళ్లకు తగ్గించింది. మరి ఇప్పుడు పింఛన్ వస్తున్న వారిలో 65 ఏళ్లలోపు వారు చాలా మంది ఉన్నారు. వారంతా ఇప్పుడు రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒక వేళ వృద్ధాప్య పింఛన్లకు సైతం ఇదే 65 ఏళ్ల నిబంధనల వర్తింప చేస్తే అటు రేషన్‌కార్డులతో పాటు ఇటు పింఛన్లకు చాలా మంది దూరమయ్యే ప్రమాదాలు ఉన్నాయి. అంటే 57 ఏళ్లకే ఇప్పుడు వస్తున్న వృద్ధాప్య పింఛన్ ఇకపై రాదా అన్న సందేహాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
Ration
వెరిఫికేషన్‌లో ఇష్టారాజ్యానికి ఛాన్స్…
ఆదాయ పరిమితులు, ఆసరా పింఛన్ల విషయంలో క్లారిటీ రావాల్సి ఉండగా, ఇక రేషన్ కార్డులకు ఆన్లైన్లో దరఖాస్తులు తీసుకోకపోవడం, వెరిఫికేషన్ అధికారం రెవెన్యూశాఖకు కాకుండా స్థానిక సంస్థల అధికారులకు ఇవ్వడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌కార్డుల కోసం అనేక మంది కొన్నేళ్లుగా నిరీక్షిస్తున్నారు. రేషన్‌కార్డులు ఇస్తారు అనగానే ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎలాంటి దరఖాస్తులు తీసుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చేసిన సోషియో-ఎకనామిక్, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, పొలిటికల్ అండ్ క్యాస్ట్ సర్వే చేశారు. అప్పుడు రేషన్‌కార్డు ఉందా.. లేదా అన్న వివరాలు సైతం సేకరించారు. అంతకు ముందు ఆరు గ్యారెంటీల కోసం దరఖాస్తులు స్వీకరించారు. ఈ క్రమంలో సేకరించిన వివరాల మేరకు రేషన్‌కార్డులకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు.
అంటే ప్రత్యేకంగా దరఖాస్తులేవి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అన్ని గ్రామాలు, మున్సిపాలిటీల్లో రేషన్‌కార్డులు కావాల్సిన కుటుంబాల జాబితా సిద్ధమైపోయింది. కాకపోతే దీన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఎప్పుడు ఇచ్చిన దరఖాస్తులు, సర్వే ఆధారంగా జాబితాను ఫైనల్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. పైగా రేషన్‌కార్డుల వెరిఫికేషన్ చేసే బాధ్యత గతంలో రెవెన్యూ అధికారులపై ఉండేది. కానీ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ, ఎంపీడీవో, మున్సిపాలిటీల్లో కమిషనర్‌కు అప్పగించారు. దీంతో అక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జనాలు ఆరోపిస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నాక కూడా రిజెక్ట్ చేసే అధికారం ఈ అధికారులు ఇవ్వడంపైనా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి.. వచ్చిన దరఖాస్తులపై ఎంక్వైరీ చేసి లబ్ధిదారులను ఎంపిక చేయాలని, ముఖ్యంగా 2014 నిబంధనల్లో మార్పు చేసి ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా నిబంధనలు రూపొందించాలనే డిమాండ్ వినిపిస్తున్నది. మరి ఈ వ్యవహారం అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.