నార్నూర్, ఆగస్టు 25 : కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలేదని ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు, రైతుల ఆధ్వర్యంలో ధర్నా సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హాయంలో రైతు సంక్షేమానికి నాడు కేసీఆర్ ఎనలేని కృషి చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల పరిస్థితి ఆగమగోచారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కనీసం వ్యవసాయ సాగుకు అరకొర ఎరువు పంపిణీ చేస్తూ సరిపెట్టడం సిగ్గుచేటు అన్నారు. పదేండ్ల పాలనలో రైతులు ఎంతో సంతోషంగా ఉండేవారు అని గుర్తు చేశారు. సరిపడినంత ఎరువులు అందించే వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు ఎరువుల కోసం పసిడిగాడ్పులు పడాల్సిన పరిస్థితి. రైతులు ఇబ్బంది పడకుండా కావలసిన యూరియా అందించేందుకు ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. కనీసం ఎకరానికి యూరియా ఒక సంచి చొప్పున అందించే దిశగా చూడాలన్నారు.
లేనిపక్షంలో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ తోడసం నాగోరావ్, సర్పంచుల సంఘం మాజీ మండల అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్, మాజీ వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు ఉద్ధవ్ కాంబ్లే, మాజీ ఎంపిటిసి రాథోడ్ రమేష్, నాయకులు రాథోడ్ సుభాష్, సయ్యద్ ఖాసిం, సుల్తాన్ ఖాన్, హైమద్, రైతులు ఉన్నారు.