ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/నిర్మల్ టౌన్, డిసెంబర్ 30;రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుండగా, వాటిని అందుకొని మురిసిపోతున్నారు. విత్తనాలు, ఎరువులు తదితరవి కొనుగోలు చేస్తూ.. సంబురంగా సాగు చేసుకుంటున్నారు. సమైక్య పాలకుల పట్టింపులేనితనంతో పెట్టుబడి కోసం అష్టకష్టాలు పడ్డామని, నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో రూపాయి అప్పులేకుండా ఎవుసం చేసుకుంటు న్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా, ఈ మూడు రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో 96,882 మంది రైతులకు రూ.72.71 కోట్లు, నిర్మల్ జిల్లాలో 2,32,659 మంది రైతులకు రూ. 120.97 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 2,23,882 మంది రైతులకు రూ. 106.01 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 90,102 మంది రైతులకు రూ. 58.03 కోట్లు జమ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం మూడు రోజుల నుంచి రైతుల ఖాతాల్లో జమవుతోంది. దీంతో రైతులకు అటు సీఎం కార్యాలయం నుంచి, ఇటు బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వస్తుండడంతో బ్యాంకులు, ఏటీఎంలు, ఇతర సర్వీస్ సెంటర్ల ద్వారా నగదు విడిపించుకుంటూ తమకు పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతు నుంచి మోతుబరి రైతుల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పొందుతున్నారు. ఈ నగదును విత్తనాలు, ఎరువులు, దున్నడానికి, కలుపు కూలీలకు చెల్లిస్తున్నారు. సీఎం కేసీఆర్ 2016లో రైతుబంధు పథకం ప్రారంభించిన తర్వాత రైతుల జీవితాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా వారిలో ఎంతో భరోసా పెరిగింది. వ్యవసాయం కోసం సకాలంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కారణంగా భూగర్భ జలాలు పెరిగి పుష్కలంగా నీటి వనరులు అందుతున్నాయి. ఇటు మెరుగైన 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉంది. ప్రతి సీజన్‌కు రైతుబంధు కింద పంట పెట్టుబడి వస్తోంది. దీంతో తెలంగాణ రాకముందు బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో పెట్టుబడిని వెళ్లదీస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పంటలు పండిస్తున్నారు. కాగా, ఈ మూడు రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలో 96,882 మంది రైతులకు రూ.72.71 కోట్లు, నిర్మల్ జిల్లాలో 2,32,659 మంది రైతులకు రూ. 120.97 కోట్లు, మంచిర్యాల జిల్లాలో 2,23,882 మంది రైతులకు రూ. 106.01 కోట్లు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 90,102 మంది రైతులకు రూ. 58.03 కోట్లు జమ చేశారు.
రందిలేకుంట ఎవుసం చేస్తున్నం
దహెగాం, డిసెంబర్ 30 : మా ఊరిలో ఐదెకరాల భూమి ఉంది. వరి, పత్తి, మక్క, మిరప పండిస్తున్న. రైతుబంధు కింద యేటా రూ. 50 వేలు వస్తున్నయ్. గా పైసలతోనే సంబురంగా ఎవుసం చేసుకుంటున్న. ఇది వరకు పెట్టుబడికి మస్తు తిప్పలయ్యేటిది. తెలిసినోళ్ల దగ్గర అప్పులు తెచ్చి ఎవుసం చేసేటోళ్లం. ఆరుగాలం కష్టపడి పనిచేస్తే వడ్డీలకే సరిపోయేవి. అట్లాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. తెలంగాణ వచ్చినంక రైతుల బతుకులు మొత్తం మారిపోయినయ్. సీఎం కేసీఆర్ రైతుబంధు తీసుకొచ్చి పెట్టుబడికి సాయమందిస్తున్నరు. ఉచితంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. ఒకప్పుడు ఎవుసం చేసుడంటనే భయమయ్యేది. ఇప్పుడు రంది లేకుంట చేస్తున్నం. -దాద శంకరయ్య, ఏటీగూడ
రైతుసంక్షేమ ప్రభుత్వం..
కోటపల్లి, డిసెంబర్ 30 : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి, రెండు పంటలకు సంబంధించి రైతుల ఖాతాల్లో 10 వేల రూపాలు జమచేస్తున్నది. నా పేరిట ఏకరం పొలం ఉండగా, నాకు పెట్టుబడుల ఖర్చు కింద తెలంగాణ సర్కారు 5 వేలు అందించింది. రెండు విడుతలుగా అందిస్తున్న సాయంతో రైతులు అప్పులు చేయకుండా పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేస్తున్నారు. రైతుల పక్షాన నిలుస్తూ, రైతుల కోసం ముందకు పోతున్న తెలంగాణ ప్రభుత్వానికి రైతుల దీవెనలు ఎల్లప్పుడూ ఉంటాయి. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్న కేసీఆర్ సార్ వెంటే తెలంగాణ ప్రజలు ఉంటారు.
– మారిశెట్టి విద్యాసాగర్, రాంపూర్, (కోటపల్లి)
రైతుల బంధువు కేసీఆర్ సార్..
నా పేరు కునార్పు అశోక్‌యాదవ్. మాది భీంపూర్ మండలం అంతర్గాంలోని ఓ మధ్యతరగతి రైతు కుంటుంబం. నేను సత్యం కొద్ది చెప్తున్న. పదేైండ్లెంది, మేమసలు దళారీ అనేటోళ్ల దగ్గరికే పోయేటవసరం ఉండుల్లేదు. నా పేరిట ఉన్న 33 గంటల భూమికి నాలుగువేల నూటా ఇరవై ఐదు రూపాలు బ్యాంకు ఖాతాల జమైనయ్. మా గ్రామంలనే ఉన్న సీఎస్సీ మహేశ్ దగ్గర వద్ద ఫింగర్‌ప్రింట్‌తో డబ్బులు తీసుకున్న. అవి ఖర్చు అయితయేమోనని దగ్గరలో ఉన్న అర్లి గ్రామం నుంచి యాసంగి శనగ పంట కోసం ఎరువులు తెచ్చుకున్న. ఇగ మా కుటుంబానికి ఇంకో ఐదెకరాల భూమి ఉన్నది. అవి కూడా ఖాతాల జమవుతయ్. గీ రైతుబంధు పైసలు మాకు అసలైన సమయంల అస్తున్నయ్. అచ్చేటి సంక్రాంతి పండుక్కు మంచిగయింది. తెలంగాణల నేనే కాదు రైతులంతా సీఎం కేసీఆర్ సారు రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. సర్కారుకు వందనాలు.
కష్టకాలంలో సాయం..
కుభీర్, డిసెంబర్ 30 : యాసంగి సాగు సమయానికి కొంచెం అటూ ఇటైనా టంచనుగా రైతు బంధు సాయం అందించిన్రు. యేడాదికి రెండుసార్లు ఎకరానికి 10 వేల రూపాయలు అందించడమంటే మాటలు కాదు. ఇట్ల ఎప్పుడూ ఏ ప్రభుత్వమూ, ఏ సీఎం కూడా రైతులను ఆదుకోలే. రైతుల కన్నీళ్లను తుడిచి, వారి కష్టంలో పాలు పంచు కుంటున్న పెద్దన్న సీఎం కేసీఆర్ సార్. నాకు రెండెక రాలు ఉంది. ప్రతీసారి 10 వేలు ఖాతాలో పడుతు న్నయ్. ఏడాదికి 20 వేలు వస్తున్నయ్. నాకు ఎంతగా నో ఆనందంగా ఉంది. ఇక్కడి మెడికల్ షాపులో మినీ ఏటీఎం ద్వారా డబ్బులు తీసుకున్న. అంద రికీ ఎలా అనిపిస్తుందో తెలీదు కానీ, నా లాంటి తక్కువ భూమి ఉన్న రైతుకు మాత్రం ఎనలేని సంతోషమనిపిస్తుంది. సీఎం కేసీఆర్ సార్‌ను జన్మజన్మలకూ మర్చిపోను.
– ముచ్చిండ్ల దేవన్న, రైతు, కుభీర్
పదోసారి రైతు బంధు వచ్చింది..
నాకు పదోసారి రైతుబంధు పైసలచ్చినయ్. మాలాంటి పేద రైతులకు రైతుబంధు డబ్బులు ఎంతో ఉపయోగపడుతున్నయ్. ఇంతకు ముందు విత్తనాలు, ఎరువుల కోసం దళారుల వద్దకు పోయేటోళ్లం. వాళ్లు ఎక్కువ పైసలు తీసుకొని నకిలీ విత్తనాలు ఇచ్చేటోళ్లు. రైతుబంధు పైసలు వస్తున్నప్పటి నుంచి మాకు కావాల్సిన మంచి విత్తనాలు కొంటున్నం. రెండు సీజన్లకు సంబంధించి సకాలంలో విత్తనాలు, ఎరువులు వేస్తూ మంచి పంటలు పడిస్తున్నాం. రైతుల కోసం పనిచేసే సీఎం కేసీఆర్ సార్‌ను మేము ఎప్పటికీ మర్చిపోలేం.
– నవ్లే బబన్, రైతు, ముక్రా(కే), ఇచ్చోడ మండలం
ఎకురం పైసలచ్చినయ్..
కోటపల్లి, డిసెంబర్ 30 : నాకు జనగామ శివారులో ఎకురం భూమి ఉంది. యాసంగి రైతు బంధు పైలు 5 వేలు నా ఖాతాలో జమైనయ్. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సర్కారు యేటా పైసలు అందిస్తూ రైతులకు చేదోడువాదోడుగా ఉంటున్నది. రైతులకు ప్రభుత్వం అందచేస్తున్న రైతుబంధు సాయంతో అప్పులు చేయకుండా ఎవుసం పనులు చేసుకుంటున్నరు. కేసీఆర్ సార్ సీఎం అయినంక మా రైతుల జీవితాల్లో వెలుగులచ్చినయ్. ఎవుసం చేస్తున్న ప్రతి రైతుకూ కేసీఆర్ సార్ అంది స్తున్న సాయాన్ని మర్చిపోలేం.
– అంగ పోచమల్లు, (కోటపల్లి)
సర్కారు సాయం మరువలేనిది..
రైతులకు సర్కారు చేస్తున్న సాయం మరువలేనిది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంట్, సాగునీరు, పంటల కొనుగోళ్లు లాంటి వాటితో రైతులు సంతోషంగా ఉన్నరు. ఏ రాష్ట్రంలో కూడా రైతులకు రైతుబంధు సాయం అందుతలేదు. రెండు పంటలకు ఎకరానికి 10వేల రూపాల చొప్పున ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఇది సీఎం కేసీఆర్ సార్‌తోనే సాధ్యమైతున్నది. కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు సీఎం సార్ పెట్టుబడి పైసలు ఇచ్చిండు. సర్కారు ఇస్తున్న డబ్బులతో వానకాలం, యాసంగి పంటలను సాగు చేస్తున్నాం. – కాంబ్లె లక్ష్మణ్, రైతు, ముక్రా(కే), ఇచ్చోడ మండలం
వడ్డీలకే సరిపోయేది..
అన్నం పెట్టే రైతన్నల కోసం మన రాష్ట్రంలో ఎన్నో పథకాలు అమలు చేస్తున్నరు. సీఎం కేసీఆర్ వల్లే ఇది సాధ్యమైతున్నది. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంట్, సాగునీరు, పంటల కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చేసిన్రు. నాకు రెండున్నరెకరాల భూమి ఉన్నది. శుక్రారం నా అకౌంట్లో రూ. 12,500 వేసిన్రు. గతంలో పెట్టుబడులకు అప్పులు చేయాల్సి వచ్చేది. పంట అమ్మినంక వచ్చిన పైసలు షావుకార్ల వడ్డీలకే సరిపోయేది. పైసల్లేకుండా విత్తనాలు, ఎరువుల కోసం పోతే రేపు, మాపు అంటూ సతాయించేటోళ్లు. కొందరు నకిలీ విత్తనాలు ఇచ్చోటోళ్లు. ఇప్పుడు రైతుబంధుతోని గా ఇబ్బందులన్నీ పోయినయ్. వానకాలం పత్తి, కంది.. యాసంగిలో శనగ పంటలు వేస్తున్న. రెండు పంటలకు ఖర్చులు పోనూ రూ.లక్ష దాకా మిగులుతున్నయ్. సీఎం కేసీఆర్ సారును పాణమున్నంత వరకు మరువ.
– జగడం పెంటన్న. అంకోలి, ఆదిలాబాద్ రూరల్ మండలం