బెజ్జూర్/పెంచికల్పేట్/దహెగాం/ఆసిఫాబాద్ టౌన్/వాంకిడి, జూన్ 2 : ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఆఫాబాద్లో ఉరుములు, మెరుపులతో ఒక్కసారిగా వర్షం కురిసింది. గుండి పెద్దవాగులోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. బెల్గాం గ్రామంలో లోనారే హనుమంతుకు చెందిన 10 మేకలు పిడుగుపడి మృతి చెందాయి. బెజ్జూర్ మండలకేంద్రంలోని వారసంతలోగల గుడారాలన్నీ గాలికి లేచి పోయాయు. బెజ్జూర్తో పాటు ఊరి పొలిమేరలో భారీ వృక్షాలు కూలిపోగా, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల దుకాణాలు, ఇండ్ల పై కప్పు రేకులు లేచి పోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
సబ్‌స్టేషన్ నుంచి మండల కేంద్రానికి సరఫరా అయ్యే విద్యుత్ తీగలపై వృక్షం కూలగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పెంచికల్పేట్ మండలం కొండపల్లిలో తాడిచెట్టుపై పిడుగుపడడంతో చేలల్లో ఉన్న వారంతా పరుగులు తీశారు. ఎలపల్లి, లోడ్పల్లి గ్రామాల్లో రాళ్లవాన కురిసింది. వ్యాపార సముదాయాలు రెండు గంటలపాటు మూసివేశారు. దహెగాంలో ఇండ్ల పై కప్పు రేకులు లేచిపోయాయి. వాంకిడి మండలం ఇందానికి దుర్గం విక్రుబాయి(55) ఇంటి సమీపంలోని చెట్టుపై పిడుగు పడగా, ఒక్కసారి ఆ శబ్ధానికి సొమ్మసిల్లి పడిపోయింది. కుటుంబ సభ్యులు మంచిర్యాలలోని హాస్పిటల్‌కు తరలించారు. మోకాసీ గూడలో ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి.
మంచిర్యాలటౌన్, జూన్ 2 : పట్టణంలో ఆదివారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో పాటు వేగంగా గాలులు వీచాయి. రెడ్డికాలనీ, పాతమంచిర్యాల, బృందావన్‌కాలనీ, హనుమాన్నగర్ల్లో చెట్లకొమ్మ లు విరిగి రోడ్లకు అడ్డుగా పడగా, మున్సిపల్ సిబ్బంది తొలగించారు.
జన్నారం, జూన్ 2 : కలమడుగులో సిటనోజు రాజన్న, శ్యామల ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. పిడుగు పడడంతో చాకచక్యంగా తప్పించుకున్నారు.
చెన్నూర్/చెన్నూర్ రూరల్, మే 2 : చెన్నూర్‌లో మధ్యాహ్నం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకొని ఓ మోస్తారు వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. చెన్నూర్ మండలం కిష్టంపేటలో చెన్నూర్-మంచిర్యాల ప్రధాన రహదారిపై చెట్లు విరిగిపడ్డాయి. ఎస్సీ కాలనీలో విద్యుత్ స్తం భాలు నేలకొరిగాయి. కిష్టంపేటలో ఇంటి పైకప్పు లేచి రేకులు విరిగిపడ్డాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది.
వేమనపల్లి, జూన్ 2 : జిల్లెడ గ్రామ సమీపంలో దాసరి పోచయ్యకు చెందిన గేదె మేత మేస్తుండగా, పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతిచెందింది. దీని విలువ సుమారు రూ. 30 వేలు ఉంటుంది. నీల్వాయిలో చెట్టు మండ విరిగి కరెంటు తీగలపై పడడంతో ట్రాన్స్‌ఫార్మర్‌తో సహా మూడు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భీమయ్య ఇల్లు పై కప్పు రేకులు గాలికి ఎగిరిపోయాయి. ముక్కిడిగూడెం సమీపంలోని ముత్యాలమ్మ ఆలయ పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. మండల కేం ద్రంలోని కొనుగోలు కేంద్రంలోరైతుల ధాన్యం తడిసిపోయింది. నీల్వాయి, దస్నాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయ్యింది. రెండు రోజుల్లో మొత్తం ధాన్యం కొనుగోలు చేయకపోతే ఆందోళనలు చేపడుతామని రైతులు హెచ్చరించారు.
కన్నెపల్లి, జూన్ 2 : కన్నెపల్లి మండలం నాయకునిపేట పంచాయతీలోని మొక్కపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం పిడుగు పడి 8 మేకలు మృత్యువాత పడ్డాయి. మేతకు వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా, పిడుగు పడడంతో గాదర్ల మహేశ్, పెద్దల రాజయ్య, బైరి గట్టన్న, పోసు, గట్టయ్యకు చెందిన ఒక్కో మేక, గాదర్ల కొమురయ్యకు చెందిన మూడు మేకలు మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ. 1.20 లక్షల దాకా ఉంటాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.