నిర్మల్, జూన్ 25(నమస్తే తెలంగాణ) : నిన్న, మొన్నటి వరకు సాగుపై అన్నదాతల్లో నెలకున్న ఆందోళనపై రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం ఆశలు రేకెత్తించింది. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షాల కారణంగా జిల్లాలో పత్తి, సోయా పంటలను రైతులు పెద్ద ఎత్తున సాగు చేశారు. గతేడాది కన్నా ఈసారి నైరుతి రుతు పవనాలు ముందుగానే వస్తాయని వాతావరణ నిపుణులు పేర్కొనడమే కాకుండా, దానికి అనుగుణంగా వర్షాలు కురియడంతో రైతులు మురిసిపోయారు.
ఆ వర్షాలను చూసి పంటలను కాస్త ముందుగానే వేశారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను అప్పటి వరకు ఖాతాల్లో జమ చేయనప్పటికీ, రైతులు అప్పులు చేసి విత్తనాలు కొనుగోలు చేశారు. అప్పులతో కొనుగోలు చేసిన విత్తనాలను నాటిన రైతులు వర్షాలపై పెట్టుకున్న ఆశలు దోబూచులాడాయి. మొదట్లో ఒకటి, రెండు రోజులపాటు కురిసిన వానలు.. ఆ తర్వాత ముఖం చాటేయడంతో రైతు ల్లో ఆందోళన తీవ్రమైంది. రెండు, మూడు రోజుల క్రితం వరకు కూడా జిల్లాలో చినుకు జాడ లేకపోవడంతో అప్పటికే వేసిన పత్తి, సోయా విత్తనాలు మొలకెత్తక భూమిలోనే మగ్గిపోవడంతో దిలావర్పూర్ మండలంలోని కొంతమంది రైతులు మరోసారి విత్తనాలు వేసేందుకు ట్రాక్టర్లతో దున్ని భూమిని సిద్ధం చేశారు.
ఈ నేపథ్యంలో మంగళవారం జిల్లా వ్యాప్తంగా కురిసిన వాన రైతులకు కొంతమేర ఊరటనిచ్చింది. ఈ వర్షంతో పత్తి, సోయా విత్తనాలు పునరుజ్జీవం పోసుకోనున్నాయి. ఇప్పటికే మొలకెత్తి బలహీనంగా ఉన్న మొక్కలు ఎదిగేందుకు ఈ వర్షం ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే మూడు,నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వా తావరణ శాఖ ప్రకటించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
ఈ వానకాలంలో జిల్లా వ్యాప్తంగా సోయా, పత్తి పంటలు పెద్ద మొ త్తంలో సాగవుతాయని వ్యవసాయశాఖ రూపొందించిన ప్రణాళికలో పేర్కొన్నది. ఇందుకు అనుగుణంగా 1.50 లక్ష ల ఎకరాల్లో ప త్తి, 1.20 లక్షల ఎకరాల్లో సోయా సాగవుతాయని అధికారులు అంచనాలు రూపొందించారు. ఈ మేరకు రైతులు ఇప్పటికే 1.10 లక్షల ఎకరాల్లో పత్తి, 80 వేల ఎకరాల్లో సోయా సాగు చేశారు. అయితే రెండు రోజుల క్రితం కురిసిన వర్షం పత్తి, సోయాతోపాటు ఇతర పంటలకు జీవం పోసింది. వర్షం కారణంగా రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు.
వానకాలం పంటల ప్రణాళిక
ఈ వానకాలంలో పండించే పంటలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు మే నెలలోనే ప్రణాళిక రూపొందించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 4.30 లక్షల ఎకరాల్లో వివిధ పం టలు సాగవుతాయని అంచనా వేసి, అందుకు అనుగుణంగా ఎరువులు, విత్తనాలను సిద్ధం చేశారు. ము ఖ్యంగా మార్కెట్లో నకిలీ విత్తనాల అమ్మకాలు జరగకుండా తనిఖీలు నిర్వహించారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా వరి, కంది, పెసర, మినుముల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు.
జిల్లాలో ఈసారి వానకాలానికి మొత్తం 4.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అం చనా వేయగా, ఇందులో 1.50 లక్షల ఎకరా ల్లో పత్తి, 1.20 లక్షల ఎకరాల్లో వరి, లక్ష ఎకరాల్లో సోయా, 10 వేల ఎకరాల్లో కందులు, 30 వేల ఎకరాల్లో మక్క, 15 వేల ఎకరాల్లో పసుపు సాగు చేసేందుకు ప్రణాళికలు రూ పొందించారు. అలాగే మరో ఐదు వేల ఎకరాల్లో మినుములు, పెసర్లు, ఇతర పంటలు సాగవుతాయని పేర్కొన్నారు. అయితే ఈసారి కూడా వరి సాగును తగ్గించి, పత్తి పంటతోపా టు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా రైతులను అన్ని విధాలుగా ప్రో త్సహించామని అధికారులు చెబుతున్నారు.
రైతు భరోసా ఆలస్యంతో తప్పని అప్పులు
గత సీజన్ రైతు భరోసా నిధులను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఈసారి కూడా వానకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచినప్పటికీ రైతుల ఖాతాల్లో భరోసా డబ్బులు జమ చేయలేదు. దీనికి తోడుగా బ్యాంకులు పంట రుణాల మంజూరుకు ముందుకు రాలే దు. సీజన్ ప్రారంభం కావడంతో రైతులు విత్తనాల కొనుగోళ్లకు, సాగు పనులకు అప్పులు చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. చాలా మంది రైతులు ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక వడ్డీకి అప్పులు చేసి పంటలు వేశారు.
గత యాసంగి సీజన్‌కు సంబంధించి జిల్లా రైతులకు రూ.131 కోట్లను ఎగ్గొట్టిన ప్రభుత్వం.. ఆ నిధుల ఊసే లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈసారి రైతులకు ఆంక్షలతో కూడిన భరోసా నిధులను విడుదల చేసింది. అయితే ఈ ఆంక్షలు, నిబంధనల కారణంగా జిల్లాలో భరోసా నిధులు కొంతమందికే జమ అయ్యాయని, అర్హులైన చాలా మంది రైతులకు ఈసారి ఖాతాల్లో జమ కాలేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్‌లో అత్యధిక వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో ఇప్పటి వరకు 92.2 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అయితే గతేడాది ఇదే సమయానికి జి ల్లాలో సగటు వర్షపాతం 149.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కా గా, ప్రస్తుతం ఇంకా 57.3 మి.మీ. లోటుగా ఉన్నది. అయితే ఇప్పటి వరకు ఈ సీజన్లో అత్యధికంగా నిర్మల్‌లో164.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే కుభీర్‌లో 127.7 మి.మీ, తానూర్‌లో 67.8 మి.మీ, బాసరలో 92.3 మి.మీ, ముథోల్‌లో 90.3 మి.మీ, భైంసాలో 93.9 మి.మీ, కుంటాలలో 99.2 మి.మీ, నర్సాపూర్(జి) లో 129.4 మి.మీ, లోకేశ్వరంలో 104.4 మి.మీ, దిలావర్పూర్లో 81.7 మి.మీ, సారంగాపూర్‌లో 90.3 మి.మీ, నిర్మల్ రూరల్ంలో 128.4 మి.మీ, సోన్‌లో 57.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే లక్ష్మణచాందలో 75.4 మి.మీ, మామడలో 75.1 మి.మీ, పెంబిలో 75.3 మి.మీ, ఖానాపూర్‌లో 70.7 మి.మీ, కడెంలో 58.6 మి.మీ, దస్తూరాబాద్లో 69.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.