మంచిర్యాల ప్రతినిధి( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/దహెగాం, నవంబర్14 : ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆగమైపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ సర్కారు ప్రకటనలు చేస్తున్నా, ఎక్కడా కనిపించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. వడ్లు ఆరబెట్టేందుకు కల్లాలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తూ అగ్గువకు అమ్ముకొని నష్టపోతున్నారు.
మంచిర్యాల జిల్లాలో 301, నిర్మల్ జిల్లాలో 317, ఆసిఫాబాద్ జిల్లాలో 18 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నా.. పేపర్లపై తప్ప క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల కనిపించడం లేదు. ఉదాహరణకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో ఇప్పటి వరకూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. కనీసం కొనుగోలు కేంద్రాల కోసం స్థలసేకరణ కూడా చేయలేదు. ఈ మండలంలో ఖరీఫ్ సీజన్లో 7900 ఎకరాల్లో వరి సాగు చేశారు. 1,97,500 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా ఉంది. ఇక్కడి సహకార సంఘం ఆధ్వర్యంలో 60 వేల క్వింటాళ్లు కొనడం లక్ష్యంగా ఉంది. ఇందుకోసం దహెగాం, లగ్గాం, ఒడ్డుగూడ, గెర్రె, గిరవెల్లి, ఖర్జీ, చంద్రపల్లి, కొంచవెల్లి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం దహెగాం, లగ్గాం, గెర్రె, కొంచవెల్లి గ్రామాల్లో కల్లాల కోసం స్థల సేకరణ చేయలేదు. కల్వాడ గ్రామంలో ఐకేపీ ద్వారా కొనుగోళ్లు చేపడుతున్నారు. పక్షం రోజులుగా కోతలు నడుస్తున్నాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో పొలాలు లేదా.. ఖాళీ స్థలాల్లో ఆరబెడుతున్నారు. కల్లాలు లేక అవస్థలు పడుతున్నారు.
ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు ఏ-గ్రేడ్‌కు రూ. 2389, బీ-గ్రేడ్‌కు రూ. 2360 ఉంది. ధాన్యాన్ని ఆరబెట్టడానికి కల్లాలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేట్ వ్యాపారులకు తగ్గువ ధరకు అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు(దళారులు) క్వింటాలుకు రూ.1900 నుంచి రూ.2000 ధరకు కొనుగోలు చేస్తూ దోపిడీ చేస్తున్నారు.
పొలం కోసి మస్తు రోజులైంది. సర్కారోళ్లు వడ్లు కొనడం లేదు. కల్లానికి జాగ లేక ప్రైవేట్ వ్యాపారులకు 55 క్వింటాళ్ల సన్నరకం వడ్లు అమ్ముకున్న. తప్పనిసరి పరిస్థితుల్లో క్వింటాలుకు రూ.1900 చొప్పున ఇవ్వాల్సి వచ్చింది. క్వింటాలుకు రూ. 489 తక్కువకు అమ్మిన. సర్కారోళ్లు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రూ. 26,895 నష్టపోయిన.
– చెమ్మకారి జంప్పయ్య, లగ్గాం
14 ఎకరాల్లో వరి సాగు చేసిన. కొనుగోలు కేంద్రం ఎక్కడనేది డిసైడ్ కాకపో వడంతో పొలం కొయ్యకుండానే వదిలేసిన. వడ్లు ఎక్కడ పోయాలో తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికీ కొనుగోలు సెంటర్ లేక నాతోపాటు అనేక మంది రైతులు ఇబ్బందులు పడుతున్నరు. సార్లు స్థలం చూస్తున్నామంటూ గడుపుతున్నరు తప్ప మా బాధ పట్టించుకోవడం లేదు. మళ్లీ వర్షం పడితే మా బతుకులు రోడ్డున పడ్డట్లే.
– ఇంగిలి శేఖర్, లగ్గాం
మూడెకరాల్లో వరి వేసి న. పొలం కోసిన. ముందుగా యేనె గూడెం సమీపంలో కొనుగోలు సెంటర్ పెడుతున్నమని సార్లు చెబితే అక్కడే ఆరబోసిన. ఇప్పుడు అక్కడ కాదు వేరే చోట సెంటర్ పెడుతమంటున్నరు. రోజుకో సారు వచ్చి రోజుకో మాట చెబుతున్నడు. మళ్లీ వేరే కాడికి వడ్లు తీసుకెళ్లాలి అంటే ఖర్చు మీద పడుతది.
-నస్కూరి జంపయ్య లగ్గాం